ఆర్గానిక్ హనీ@ సూర్యాపేట్.. యువ మహిళా రైతు అనూష భేష్‌

Organic Honey Bee Farming Woman Farmer Success Story
x

ఆర్గానిక్ హనీ@ సూర్యాపేట్.. యువ మహిళా రైతు అనూష భేష్‌

Highlights

Honey Bee Farming: విదేశాల్లో ఉన్నత చదువులు.

Honey Bee Farming: విదేశాల్లో ఉన్నత చదువులు. అక్కడే ప్రముఖ ఐటీ కెంపెనీలో ఉద్యోగం. మంచి ఆదాయం వస్తున్నా ఎక్కడో అసంతృప్తి నిత్యం వెంటాడేది. రైతులకు ఏదైనా చేయాలన్న తలంపు మదిలో మెదిలింది. అనుకున్నదే తడవుగా వ్యవసాయం వైపు అడుగులు వేసింది. నాణ్యమైన తేనెను వినియోగదారులకు అందింస్తూ తేనెటీగల పెంపకంలో రాణిస్తోంది సూర్యాపేట జిల్లాకు చెందిన యువ మహిళా రైతు అనూష.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం కల్కోవ గ్రామానికి చెందిన అనూష విద్యావంతురాలు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందింది. కానీ అందులో ఎలాంటి సంతృప్తి లేకపోవడం రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వ్యావసాయం వైపు రావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అందరిలా పంటల సాగుకు వెళ‌్లకుండా వినూత్నంగా ఆలోచించింది ఈ యువ మహిళా రైతు. వ్యవసాయ అనుబంధరంగమైన తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించింది. పెంపకంలో రాణిస్తూ తోటి మహిళలు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ప్రస్తుతం పచ్చని అడవులు కోతకు గురవుతున్నాయి. విచక్షణరహితంగా వ్యవసాయంలో వినియోగిస్తున్న రసాయనాలతో తేనెటీగలు కొంతవరకు అంతరించిపోవడంతో తేనె కొరత ఏర్పడింది. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన తేనెకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో మంచి గిరాకీ ఉంది. దీంతో ఈ గిరాకీని తెలుసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పనిముట్లను వినియోగించి తేనె పరిశ్రమను ఏర్పాటు చేసి లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు సాగుదారులు. ఈ క్రమంలో అనూష స్వచ్ఛమైన ఆర్గానిక్ తేనెను ఉత్పత్తి చేస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో నాణ్యమైన తేనె లభించడం లేదని అంటోంది అనూష. తేనె నిల్వ చేసేందుకు రసాయనాల వాడకం విపరీతంగా పెరిగిందని చెబుతోంది. ఈ క్రమంలో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ తేనె ఇవ్వడమే తన ప్రధాన ఉద్దేశమని అంటోంది. గత ఏడాది నిపుణుల ద్వారా తేనె టీగల పెంపకంపై శిక్షణ తీసుకుంది అనూష. ఐదు బాక్సులతో ప్రయోగాత్మకంగా పెంపకం ప్రారంభించింది. ప్రస్తుతం 300 బాక్సుల్లో తేనె ఉత్పత్తి చేస్తోంది. తేనెటీగల్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ పెంపకం సులువుగా అయ్యే, అధిక ఉత్పత్తి అందించే ఎఫెస్‌ మెలిఫెరా బీస్‌ ను పెంపకానికి ఎన్నుకుంది.

తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి ముందు అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన అంశం. తేనె దిగుబడిలో తేనె పెట్టెలు పెట్టే స్థలమే కీలకం. ఈ పెట్టెలు పెట్టే స్థలంలో ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ముఖ్యంగా మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. తెనెటీగల పెంపకం ప్రారంభించే స్థలంలో తగినన్ని పుష్పజాతులుండి అవి ఎక్కువ మకరందము, పుప్పొడిని తేనెటీగలకు అందించగలిగేలా చూసుకోవాలి. సేంద్రియ , ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాలు తేనెటీగల పెంపకానికి అనుకూలమైనవి. అదే విధంగా పూర్వం ఏడాది పొడవునా ఒకేచోట స్థిరంగా తేనె టీగలకు సరిపడా పుప్పొడి, మకరందం లభించేవి. ప్రస్తుతం కొన్ని మాసాలలో ఆహార కొరత ఏర్పడుతుంది. కాబట్టి వలస తేనెటీగల పెంపకం అనివార్యమైందని అంటోంది అనూష. ఈ వలస పద్ధతి వల్ల నాణ్యమైన తేనె ఉత్పత్తి లభించడంతో పాటు పొలం కలిగిన రైతుకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

ప్రకృతి, సేంద్రియ విధానంలో తయారైన తేనెకు ఒకే రకమైన రుచి,రంగు ఉండదంటోంది ఈ యువ మహిళా రైతు. తేనెల పెంపకానికి ఎన్నుకునే పొలాన్ని బట్టే తేనె రంగు రుచి ఆధారపడి ఉంటుందంటుంది. పెపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల నాణ్యమైన తేనె లభిస్తుందని అంటోంది. అటవీ ప్రాంతాల్లో కనుగ తేనెటీగల పెంపకాన్ని చేపడితే వైల్డ్ బీస్ ను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అదే విధంగా ప్రతి వారం తప్పనిసరిగా బాక్సులను పర్యవేక్షించాలంటోంది. సేంద్రియ విధానం కావడంతో ఇప్పటి వరకు తేనెటీగలు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదని చెబుతోంది అనూష. అయితే బాక్సులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటోంది. లేకపోతే తేనె టీగలు చనిపోయే ప్రమాదం ఉందంటోంది.

మన దేశంలో తేనె కు గిరాకీ ఉన్నా విదేశాల్లో తేనె నుంచి తయారయ్యే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందంటోంది అనూష. రాయల్ జెల్లీ, బీస్ వ్యాక్స్, పొలెన్‌కు మంచి ధర లభిస్తోందంటోంది. ఈ పెంపకం చేపడితే మార్కెటింగ్ సమస్య లేదంటోంది. స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేస్తే వినియోగదారులే ముందుకు వచ్చి తేనె కొనుగోలు చేస్తారంటోంది. అంతే కాదు ఇలాంటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెబుతోంది.

అడవుల నుంచి తేనె సేకరించడమనేది పాత పద్ధతి. ఓ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి తేనె ను ఉత్పత్తి చేయడం అనేది నేటి పద్ధతి. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్‌లో గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో తేనెటీగల పెంపకం ఓ లాభసాటి పరిశ్రమగా మారింది. దానిని అందిపుచ్చుకుని చక్కటి ఆదాయం పొందుతూ తోటి మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది అనూష.


Show Full Article
Print Article
Next Story
More Stories