Organic Farming: ఉన్నది ఎకరం రెండు ఎకరాల భూమే అందులో సేద్యం చేసి బతికేదెలా...? కుటుంబాన్ని పోషించేదెలా..?
Organic Farming: ఉన్నది ఎకరం రెండు ఎకరాల భూమే అందులో సేద్యం చేసి బతికేదెలా...? కుటుంబాన్ని పోషించేదెలా..? అని సేద్యాన్ని వీడి కూలీలుగా మారుతున్న చిన్నసన్నకారు రైతులు ఎందరో ఉన్నారు. సాగు గిట్టుబాటు కాక పట్టణాలకు వలస పోతున్నారు. కానీ ఉపాయం ఉంటే ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటే తక్కువ విస్తీర్ణంలోనూ అద్భుతాలు చేయవచ్చని రుజువు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కమ్మగూడెంకు చెందిన యువరైతు విజయ్‌కుమార్. ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా 20 ఏళ్ల అనుభవం ఉన్నా మట్టి వాసన మీద ఉన్న మమకారంతో సేద్యం వైపు అడుగులు వేశారు. వ్యవసాయ అనుభవం లేదు , అయినా ప్రతి అడుగును ఆచీతూచి వేస్తూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రతి దశలోనూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ సాగులో విజయవంతంగా ప్రయాణిస్తున్నారు. తనకున్న ఎకరం విస్తీర‌్ణంలో పూర్తి సేంద్రియ విధానాల్లో ఉద్యాన తోటలను సాగు చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
వ్యవసాయంలో తలపండిన రైతులే ఏమీ చేయలేకపోతున్నారు. నువ్వేం చేయగలవని ఎగతాలి చేసిన నోర్లే ఇప్పుడు పంట తీరును చూసి అభినందిస్తున్నాయి. ఓ వైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా తన విధులను నిర్వర్తిస్తూనే వారాంతంలో సేద్యపు పనుల్లో సేదదీరుతున్నారు విజయ్. వ్యవసాయం చేయడం అంత సులువైన పని కాదని అందులో అనేక సవాళ్లు అడుగడుగునా ఎదురవుతాయంటున్నారు. కానీ ఆ సవాళ్లే ప్రకృతికి తనను మరింత దగ్గరకు చేశాయంటున్నారు.
తనకున్న ఎకరం పొలంలో బొప్పాయి, సీతాఫలం, అరటి, జామ, వాటర్ ఆపిల్ పండ్ల చెట్లను పెంచుతున్నారు విజయ్. అంతర పంటలుగా పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశీయ వరి రకమైన కాలాబట్టిని పండిస్తున్నారు. ఇలా అన్ని రకాల పంటల సాగులో ప్రయోగాలు చేస్తూ పంటల తీరుతెన్నులు తెలుసుకుంటూ ప్రకృతి ఒడిలో ప్రయాణం చేస్తున్నారు.
రవ్వంతైన రసాయనాల వినియోగం ఉండకూడదనే ఉద్దేశంతోనే సేద్యం మొదలు పెట్టానంటున్నారు విజయ్. ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేసుకునేందుకు గాను నేలను ముందుగా సిద్ధం చేసుకున్నారు. గతంలో రసాయనాల పంటల సాగుకు అలవాటు పడిన నేలను ప్రకృతి సేద్యానికి అనుకూలంగా మార్చుకున్నారు. మొక్కలు నాటే ముందే భూమిని దున్నించి అందులో స్థానికంగా ఉన్న గోషాల నుంచి 17 టన్నుల పశువుల పెంటను తెప్పించి చల్లించారు. ఆ తరవువాత మరోసారి దుక్కి దున్నించి పచ్చిరొట్టి పైర్లను సాగు చేశారు. ఈ పచ్చిరొట్టను నేలలో దున్నించారు. దీంతో మూడు నెలల్లోనే భమిలో వానపాముల జాడ కనబడటంతో సాగు పనులు మొదలుపెట్టారు.
పూర్తి సహజసిద్ధంగానే ప్రకృతి లభించే వనరులతోనే పంటల సాగు చేస్తున్నారు ఈ యువరైతు. రకరకాల ఆకులతో తయారు చేసిన కషాయాలను, అగ్నిఅస్త్రం, నీమాయిల్ ను చీడపీడల నివారణకు వినియోగిస్తున్నారు. చెట్ల వేరు వ్యవస్థకు సూక్ష్మపోషకాలను , మొక్కకు బలాన్ని అందించేందుకు మైకోరైజా ఫంగైను సాగులో వినియోగిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి మదర్ కల్చర్ తీసుకువచ్చి దానిని అభివృద్ధి చేస్తూ మొక్కల మొదల్లలే వేసుకుంటున్నారు.
డ్రిప్ విధానంలోనే నీరు, ఎరువులను అందిస్తున్నారు ఈ సాగుదారు. జీవామృతం, ల్యాబ్, పంచగవ్య ద్రావణాలను సమయానుకూలంగా పంటలకు ఇస్తున్నారు. అదే విధంగా నవధాన్యాల పొడిని మూడు నెలలకు ఒకసారి పిచికారీ చేయడం తో పాటు డ్రిప్ ద్వారా పారిస్తున్నారు. ఈ పొడి పంటకు బలాన్ని అందిస్తుందంటున్నారు విజయ్. వీటితో పాటే ప్లాంట్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ లు, ఫిష్ ఎమినో యాసిడ్స్ ను సాగులో వినియోగిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire