Chittoor: పాత మామిడి తోటల్లో కొత్త రకాల సృష్టి..

Old Mango Trees Yield New Type of Fruit
x

Chittoor: పాత మామిడి తోటల్లో కొత్త రకాల సృష్టి..

Highlights

Chittoor: విత్తు ఏది వేస్తే అదే చెట్టు వస్తుంది అనే సామెతకు కాలం చెల్లిపోయింది.

Chittoor: విత్తు ఏది వేస్తే అదే చెట్టు వస్తుంది అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి, చెట్టొకటి పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది ఆధునిక సేద్యం. కొన్నేళ్లుగా మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. ఈ పద్ధతిలో పాత చెట్లైనా కొమ్మ కొమ్మకు కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్న చిత్తూరు జిల్లా రైతులపై ప్రత్యేక కథనం.

తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్లకు అదే రకం కాయలు కాస్తున్నాయనే చింత ఇకపై ఉండదు. అదే పాత చెట్టుకు మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండ్లను కాయించుకోవచ్చు. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు పద్ధతి సత్ఫలితాలనిస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతులు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని మామిడి తోటల్లో అవలంభిస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్నారు.

ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను కొమ్మ అంటు పద్ధతి ద్వారా పండించవచ్చు. నాటురకం చెట్లు, పొత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న రైతులకు ఇది ఒక వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు.

జిల్లాలో ఎక్కువగా గుజ్జు కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీనిని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల నమ్మకమైన మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్‌లో మంచి ధర పలికే బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక వంటి రకాలను టాప్‌ వర్కింగ్ పద్ధతి ద్వారా మార్పు చేస్తున్నారు. ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. పాత తోటల్లో చెట్లకు రోగాలు సోకి దిగుబడు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యా్మ్నాయంగా మారాయి. జులై, ఆగస్టు , సెప్టెంబర్ నెల వరకు మామిడి చెట్లకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఇదే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. పాత మామిడి తోటలున్న రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే సత్ఫలితాలు పొందవచ్చని రైతులు సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories