Dragon Fruit : ఒక్కసారి పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు ..

Farmer Thameem Success Story In Dragon Fruit Farming Nizamabad
x

Dragon Fruit : ఒక్కసారి పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు ..

Highlights

Dragon Fruit Cultivation: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన మహ్మద్ తమీమ్ 18 ఏళ్లుగా దుబాయ్‌లో పలు ఉద్యోగాలు చేశారు.

Dragon Fruit Cultivation: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన మహ్మద్ తమీమ్ 18 ఏళ్లుగా దుబాయ్‌లో పలు ఉద్యోగాలు చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత వ్యవసాయం మీద మక్కువతో విదేశాల్లో విరివిగా సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్ తోటల సాగు గురించి తెలుసుకున్నాడు. సామాజిక మాధ్యమాల సహకారం, తోటి రైతుల అనుభవాలను సేకరించి ప్రయోగాత్మకంగా 5 లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చుతో ఒకటిన్నర ఎకరంలో డ్రాగన్ పండ్ల సాగుకు శ్రీకారం చుట్టారు. సాగుపైన పెద్దగా అవగాహన లేకపోయినా విజయవంతంగా డ్రాగన్ పండ్లను పండిస్తున్నారు ఈ రైతు. ఎలాంటి నేలలోనైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవచ్చునని ,చీడపీలు పెద్దగా ఆశించవని తెలిపారు. తక్కువ సమయంలో తక్కువ శ్రమతో సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తమీమ్.

తక్కువ నీటితో డ్రాగన్ పండ్ల తోటను సాగు చేసుకోవచ్చని రైతు చెబుతున్నారు. పెద్ద ఎత్తును నీరు అవసరం ఉండదంటున్నారు. వేసవిలో వారానికి ఒకసారి, చలికాలంలో 15 రోజులకు ఒకసారి నీరివ్వాలన్నారు. వర్షాకాంలో అసలు నీరు ఇవ్వకపోయినా మొక్కలకు ఎలాంటి సమస్య రాదంటున్నారు. నీరు నిల్వ ఉండని నేలలు డ్రాగన్‌ సాగుకు చాలా అనుకూలమన్నారు. తాను డ్రిప్ ఏర్పాటు చేసుకుని సమయానుకూలంగా మొక్కలకు నీరందిస్తున్నానని తెలిపారు. వరి, మొక్కజొన్న, పసుపు వంటి పంటలతో పోల్చుకుంటే డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతుకు నష్టం అనేది ఉండదని తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు తమీమ్‌. ఒకసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు.

ఎకరంన్నర విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న ఈ రైతు ఎకరానికి 500 స్థంబాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో పోల్‌కు నాలుగు మొక్కలు చొప్పున 2000 మొక్కలను నాటుకున్నారు. మొదటి కోతలో 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు. రెండో ఏటకు పెట్టిన పెట్టుబడి మొత్తం చేతికి అందుతుందన్నారు. చెట్ల పెరుగుదలకు ఆవుపేడ, వర్మీకంపోస్ట్ , జీవామృతం, వేస్ట్ డీకంపోజర‌్ ను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. సేంద్రియ విధానాలు కావడంతో చక్కటి ఫలసాయం అందుతోందన్నారు. రైతు స్వతహాగా తన కుటుంబ సభ్యులతో కలిసి డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేసుకోవచ్చన్నారు ఈ సాగుదారు. కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పంట సాగుపై ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదిస్తే సలహాలు సూచనలు అందిస్తానన్నారు.

మార్కెట్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదన్నారు ఈ సాగుదారు. నాణ్యమైన పండ్ల దిగుబడిని సాధిస్తే విదేశాలకు సైతం ఎగుమతి చేసి ఆదాయం పొందవచ్చన్నారు. ఇందూరు రైతులకు డ్రాగన్ ఫ్రూట్‌ను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు తమీమ్‌. ప్రస్తుతం తాను పింక్ వెరైటీని సాగుస్తున్నానని ఈ రైతు తెలిపారు. ఈ రకానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందన్నారు. మరీ ముఖ్యంగా ఈ పండులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుందని తెలిపారు. పండు లోని గుజ్జు మాత్రమే కాదు పైన ఉన్న తొక్కను కూడా ఫార్మా కంపెనీలకు అందిస్తే రైతు లాభాలు పొందవచ్చన్నారు. ప్రారంభ పెట్టుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ అందిస్తే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories