Natu Kollu Pempakam in Telugu: గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకానికి ఇటీవల ఆదరణ పెరుగుతోంది.
Natu Kollu Pempakam in Telugu: గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకానికి ఇటీవల ఆదరణ పెరుగుతోంది. రైతులతో పాటు నిరుద్యోగ యువత సైతం ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా మలుచుకుంటోంది. తక్కువ పెట్టుబడితో పెంపకం చేపట్టే వీలుండటం, ఈ కోళ్లకు వ్యాధుల బెడద తక్కువగా ఉండటం , స్థానికంగా విక్రయించే సౌలభ్యం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి . దీంతో ఈ రంగం వైపు యువత అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పెరటి కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. పెంపకం చేపట్టే పెంపకందారులు ఎలాంటి మెళకువలు పాటించాలి? షెడ్డు నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి? మేత అందించే విధానాలేమిటి తెలుసుకుందాం.
నిజానికి పెరటి కోళ్ల పెంపకం గ్రామీణ భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉంది. ఈ దేశీయ కోళ్ల నుంచి మాంసం, గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండేది. ఒక్కో కోడి నుంచి ఏడాదికి 70 నుంచి 80 గుడ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన కోళ్లతో పెంపకం చేపట్టి మాంసం, గుడ్ల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది. రైతుల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగు పరచడానికి తక్కువ ప్రారంభ పెట్టుబడితో పెరటికోళ్ల పెంపకం చేపట్టవచ్చు.
పెరటి కోళ్లకు ఉండాల్సిన మేలైన లక్షణాల్లో ముఖ్యమైనది వాతావరణం. పెంపకానికి ఎంచుకునే కోళ్లు స్థానిక వాతావరణానికి అనువుగా ఉండేలా చూసుకోవాలి. మంచి సంతానోత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు మేలైన శరీరాకృతి ఉండే పెరటి కోళ్లనే పెంపకానికి ఎన్నుకోవాలి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఇతర జంతువుల నుంచి తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి ఉండేల చూసుకోవాలి. గ్రామప్రియ, వనరాజ, గిరిరాజ, గిరిరాణి, కృష్ణ-జె మొదలైన కోళ్లను పెంచుకోవచ్చు. గ్రామప్రియ, వనరాజ కోళ్ల వార్షిక గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం 200 నుంచి 220. పోషకాహారం, ఇతర నిర్వహణ పరిస్థితులను బట్టి 200 నుంచి 230 రోజులకు గుడ్లు పెడుతుంది. గుడ్లు బరువు 55 నుంచి 60 గ్రాముల వరకు ఉంటుంది. పరిపక్వ శరీర బరువు 2.5 నుంచి 3.5 కిలోలు ఉంటుంది.
పెరటి కోళ్ల పెంపకానికి విస్తృతమైన షెడ్ల నిర్మాణం అవసరం లేదు. ఎండ, వాన, జంతువుల నుంచి రక్షణ కల్పించేలా వసతి ఏర్పాటు చేయాలి. పగటిపూట ఆహారం కోసం వదిలి, రాత్రిపూట షెడ్‌లోకి తోలాలి. షెడ్‌ను తూర్పు పడమర దిశలో నిర్మించాలి. వేసవిలో షెడ్‌లోకి సూర్యకాంతి పడకుండా చూడాలి. కలప, వెదురు, గడ్డి వంటి తక్కువ ఖర్చయ్యే వాటితో షెడ్ నిర్మాణం చేపట్టాలి. షెడ్ లోపల తేమ లేకుండా చూడాలి. షెడ్‌ను ఎత్తయిన ప్రదేశంలో లేదా నేల మట్టానికి కనీసం 2 అడుగులపైన ఉండేలా నిర్మించాలి. షెడ్ సులభంగా శుభ్రం చేసేలా ఉండాలి. షెడ్ లోపల విషవాయువులను బయటకు పంపేందుకు షెడ్ ఎగువ భాగంలో ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పక్కగోడ ఎత్తు సాధారణంగా 7 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. పైకప్పు మధ్యభాగం ఎత్తు 9 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఇరువైపులా వాలుతో ఉంటుంది. గడ్డి, టైల్స్, ఆస్‌బెస్టాస్ మొదలైన వాటితో కప్పు వేయవచ్చు. బ్రూడర్ హౌస్‌ను గాలి, వెలుతురు బాగుండేలా నిర్మించాలి.
పెరటికోళ్ల పెంపకం కోసం సహజ సంతానోత్పత్తి లేతా కృత్రిమ సంతానోత్పత్తిని అవలంభించవచ్చు. సహజ సంతానోత్పత్తికి స్థానిక కోడిని ఉపయోగిస్తారు. ఒక కోడి 12 నుంచి 15 కోడి పిల్లలను పొదుగుతుంది. పొదిగిన తరువాత కోడిపిల్లలను తల్లితోపాటు బయటకు వదులుతారు. రాత్రిపూట చిన్న కోడి పిల్లలు, తల్లి కోసం షఎడ్ లోపల ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలి. కృతిత్రిమ బ్రూడింగ్‌లో ఆర్టిఫిషియల్ వేడిని అందిస్తారు. మొదటి వారంలో 95 డిగ్రీల ఫారన్ ఫీట్, తరువాత 70 డిగ్రీల ఫారన్ హీట్ వచ్చే వరకు వారానికి 5 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత చొప్పున తగ్గించవచ్చు. బ్రూడర్ హౌస్‌లో 6 వారాల వరకురెండువాట్ల ఉష్ణోగ్రత అవసరం. బ్రూడర్ హౌస్‌లో గరిష్ట పెరుగుదల కోసం ఫీడ్ వినియోగాన్ని పెంచాలి. ప్రారంభంలో బ్రూడర్ హౌస్‌లో కనీసం 48 గంటల వరకు నిరంతరం కాంతి ఉండేలా చూడాలి. పెరుగుతున్న దశలో అంటే 8 నుంచి 18 వారాల సమయంలో 10 నుంచి 12 గంటల పాటు కాంతి ఉండాలి. వేడితో ప్రత్యక్ష సంబంధాన్ని నిరోధించడానికి బ్రూడర్ హౌస్‌లో కార్డ్‌బోర్డ్ లేదా మెటాలిక్ గార్డుతో తయారు చేసిన చిక్‌గార్డును ఉపయోగించవచ్చు. చిక్‌గార్డ్ ఎత్తు 15 నుంచి 18 అంగుళాల వరకు, హోవర్ నుంచి 3 అడుగుల దూరంలో వృత్తాకారంలో ఉంచాలి.
పౌల్ట్రీ ఉత్పత్తిలో మొత్తం వ్యయంలో 70 శాతం మేతకు ఖర్చవుతుంది. కానీ పెరటి కోళ్ల పెంపకంలో దాణా ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ కోళ్లను మేతకోసం ఆరుబయట వదులుతారు. ఇవి కీటకాలు, నత్తలు, చెదపురుగులు, గడ్డి, కలుపు మొక్కల విత్తనాలు, మిగిలిపోయిన ధాన్యాలు, పంట అవశేషాలు. గృహ వ్యర్థాల నుంచి అవసరమైన ప్రోటీన్, శక్తి , ఖనిజాలు, విటమిన్లు మొదలైన వాటిని పొందుతాయి. వర్షాకాలంలో దాణాలో ఫంగల్ పెరుగుదల ను నివారించడానికి నెలన్నర కంటే ఎక్కువ నిల్వ చేయకూడదు. సాధారణంగా పెరటికోళ్ల పెంపకంలో రెండుసార్లు ఉదయం, సాయంత్రం దాణాను అందిస్తారు. మొక్కజొన్న, వరితవుడు, గోధుమ ఊక, వేరుశనగ పిట్టు, ఫిష్‌మీల్, లైమ్‌స్టోన్‌తో పాటు ఉప్పు, ఖనిజాలు, విటమిన్లు లేదా స్థానికంగా లభించే పదార్థాలతో తయారు చేయవచ్చు. కోళ్ల దాణాలో స్టార్టర్ లెవల్‌లో కనీసం 20 శాతం గ్రోవర్‌లో 16 శాతం మాంసకృత్తులు ఉండాలి.
పెరటి కోళ్ల పెంపకంలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. కోళ్ల వయస్సును బట్టి టీకాలివ్వాలి. ఒక రోజు వయసు కోడిపిల్లలకు మారెక్స్ వ్యాధికి , 4 నుంచి 7 రోజుల వయస్సు పిల్లలకు రాణికెట్ వ్యాధికి, 14 నుంచి 18 రోజులప్పుడు గంబోరో వ్యధికి, 35 రోజుల దశలో రాణికెట్ వ్యాధికి, 6 నుంచి 7 వారాలప్పుడు ఫౌల్‌ఫాక్స్ వ్యాధికి , 8 నుంచి 10 వారాలప్పుడు రాణికెట్ వ్యాధికి డాక్టరు సలహా మేరకు టీకాలివ్వాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire