ఆకుకూరల అమృతవ్వ అందరికీ ఆదర్శం

Leafy Vegetables Cultivation, Farmer Amrutavva Success Story
x

ఆకుకూరల అమృతవ్వ అందరికీ ఆదర్శం

Highlights

Leafy Vegetables Cultivation: ఆమె ఓ మహిళా రైతు గ్రామాల్లో రైతులు పంటలు వేసి నష్టపోవడం గుర్తించింది లాభసాటి వ్యవసాయం చేయాలని ఆలోచన చేసింది.

Leafy Vegetables Cultivation: ఆమె ఓ మహిళా రైతు గ్రామాల్లో రైతులు పంటలు వేసి నష్టపోవడం గుర్తించింది లాభసాటి వ్యవసాయం చేయాలని ఆలోచన చేసింది. దీంతో మార్కెట్ లో గిరాకీ ఉన్న ఆకుకూరల సాగుపై దృష్టి పెట్టింది 30 ఏళ్లుగా ఏడాది పొడవునా ఎదో ఒక ఆకుకూర సాగు చేస్తూ ఆకుకూరలనే తన ఇంటి పేరుగా మార్చుకుంది. జగిత్యాల జిల్లాలో ఆకుకూరల అమృతవ్వగా పేరుగాంచిన ఆదర్శ మహిళా రైతుపై ప్రత్యేక కథనం.

ఈ అవ్వ పేరు అమృతవ్వ. జగిత్యాల జిల్లా స్వగ్రామం. భర్త చిన్న వయసులోనే చనిపోవడంతో ఇద్దరు పిల్లల బాధ్యత ఈమెపై పడింది. తనకు తెలిసిన సేద్యాన్నే ఉపాధిగా మార్చుకుంది. అయితే వ్యవసాయంలో తలలు పండిన రైతులే నష్టాల బారిన పడటం సాగు గిట్టుబాటు కాదని గుర్తించిన అమృతవ్వ ప్రతి రోజు ఆదాయం ఇచ్చే, మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటలను పండించాలని నిర్ణయించుకుంది. తనకున్న ఎకరం భూమిలో తీరొక్క ఆకుకూరలను పండిస్తూ ఆదాయం పొందుతోంది. గత 30 ఏళ్లుగా ఆకుకూరలే ఏడాది పొడవునా పండిస్తోంది ఈ సాగుదారు. అందుకే అమృతవ్వ పేరు ఆకుకూరల అమృతవ్వగా పేరుగాంచింది.

ఎకరం భూమిలో దశల వారీగా పాలకూర, కొత్తిమీర,తోటకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలను ఏడాదంతా సాగు చేస్తోంది అమృతవ్వ. ఏ ఆకుకూరకు ఏ సమయంలో మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుందో అమృతవ్వకు బాగా తెలుసు అందుకు తగ్గట్లుగానే ఆకుకూరలు పండిస్తుంటుంది. వివిధ కంపెనీల నుంచి నాణ్యమైన విత్తనాలు సేకరించడంతో పాటు తన తోటలో పండిన పంట నుంచి విత్తనాలకు సేకరించి వాటినే తిరిగి పంట సాగుకు ఉపయోగిస్తుంటుంది. ఇక పంట అయిపోగానే మరో పంట వేస్తూ భూమిని ఎప్పుడూ ఖాళీ ఉంచకుండా నిత్యం ఏదో ఒక ఆకుకూరను పండిస్తూ ఆదాయం పొందుతుంటుంది. సేంద్రియ ఎరువులను వినియోగించడంతో పాటు సమృద్ధిగా నీరు అందిస్తూ ఆకుకూరలు సాగుతో లాభాలు గడిస్తూ అబ్బురపరుస్తోంది ఈ అవ్వ.

ప్రతి రోజు ఉదయం 4 గంటలకు నిద్ర లేచి తోటలో ఆకుకూరలు సేకరించి 6 గంటలకు జగిత్యాల మార్కెట్ కు వెళుతుంది మార్కెట్లో విక్రయాలు ముగియగానే 10 గంటలకు ఇంటికి చేరుకుని బోజనం చేసి మళ్లీ తోట పనుల్లో నిమగ్నమవుతుంది. కలుపు తీయడం , నీరు పెట్టడం వంటి పనులు తానే స్వయంగా చేసుకుంటుంది. సాయంత్రం 4 గంటల వరకూ పొలంలోనే ఉండి మళ్లీ ఆకుకూరలు తీసుకుని మార్కెట్ వెళ్లి 6 గంటల వరకువిక్రయిస్తుంది. ఇలా గత 30 సంవత్సరాలుగా ఆకుకూరల సాగే తన దినచర్యగా మార్చుకుని మలివయసులోనూ ఎంతో ఓపికతో సాగు పనులు చేసుకుంటూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అమృతవ్వ సాగు తీరును ప్రతిఒక్కరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories