Kadaknath Poultry Farming: కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు ప్రవీణ్‌

Kadaknath Poultry Farming Young Farmer Success Story
x

Kadaknath Poultry Farming: కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు ప్రవీణ్‌

Highlights

Kadaknath Poultry Farming: అత్యంత విలువైన పెరటి జాతి భారతీయ నాటు కోడి కడక్‌నాథ్‌.

Kadaknath Poultry Farming: అత్యంత విలువైన పెరటి జాతి భారతీయ నాటు కోడి కడక్‌నాథ్‌. అధిక మొత్తంలో పోషక విలువులు, రోగ నిరోధక శక్తి కలిగి ఉండటంతో ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో వీటి ప్రాచుర్యం పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో మాత్రమే లభించే ఈ నాటుకోళ్లు ప్రస్తుతం యువతరానికి చక్కటి ఉపాధి మార్గంగా మారుతున్నాయి. మార్కెట్‌లో మటన్‌తో సమానంగా దీని మాంసం ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ రంగంలోకి అడుగుపెట్టి కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకం చేపట్టి వాటి మాంసం, గుడ్ల అమ్మకాలతో మంచి రాబడిని పొందుతున్నాడు హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌. ఓవైపు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా గా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు నల్లకోళ్ల పెంపకంలో రాణిస్తున్నాడు. నేటి యూవతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

కూకట్‌పల్లికి చెందిన ప్రవీణ్ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఒకప్పుడు ఉదయం లేచింది మొదలు చీకటి పడేవరకు నిత్యం తీరికలేని సమయాన్ని గడుపుతుండేవాడు. విశ్రాంతి కరవు తినే ఆహారంలో ఆరోగ్యం లేదు ఇదే అంశం ప్రవీణ్‌ను తీవ్రంగా ఆలోచింపజేసింది. మనమే ఎందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయకూడదని అనుకున్నాడు. దీంతో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం, మేడికొండ గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. సేంద్రియ వ్యవసాయంతో పాటు నాటుకోళ్ల పెంపకం పైన ఆసక్తి మళ్లింది దీనితో తన మిత్రులకు కలుపుకుని ఎకరం విస్తీర్ణంలో ఫ్రీరేంజ్‌లో కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు ప్రవీణ్‌.

మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, కోల్‌కత్తాతో పాటు హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలను సందర్శించి కడక్‌నాథ్‌ కోళ‌్ల గురించి కూలంకుశంగా తెలుసుకున్నాడు. శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను సేకరించాడు. పూర్తి అవగాహన తెచ్చుకున్నాకే పెపంకం ప్రారంభించాడు. 500 కోళ‌్లతో ప్రారంభించి పెంపకం దినదానాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 6 వేల కోళ్లకు విస్తరించింది. గత నాలుగేళ్లుగా కడక్‌నాథ్‌ కోడి గుడ్లు, మాంసంతో పాటు చిక్స్‌ను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతున్నాడు ప్రవీణ్‌.

ఫ్రీరేంజ్‌లో కోళ్లను పెంచుతున్నప్పటికీ వేసవిలో, వర్షాకాలంలో కోళ‌్లకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా షెడ్డును నిర్మించుకున్నాడు ప్రవీణ్. ఈ షెడ్డును మూడు భాగాలుగా విభజించుకున్నాడు. ఒక భాగాన్ని పిల్లలకు, మరో భాగాన్ని కాస్త ఎదిగిన కోళ‌్లకు, మూడో భాగాన్ని గుడ్లు పెట్టే కోళ్లకు కేటాయించాడు. తద్వారా కోళ్ల మరణాల శాతాన్ని నియంత్రిస్తున్నాడు ప్రవీణ్. నీటి దక్కరి నుంచి అందించే మేత వరకు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నాడు. షెడ్డును నిత్యం శుభ్రపరుస్తూ కోళ్లకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు.

కోళ్ల పెంపకం చేపట్టడం అంత తేలికైన విషయం కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం తప్పదంటున్నాడు. అందుకే వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఏమాత్రం రాజీ పడటం లేదు ప్రవీణ్. ఫ్రీ రేంజ్‌లో కోళ‌్లు పెరుగుతున్నప్పటికీ రాత్రి వేళలో అవి నిద్రించేందకు , వేసవి, వానాకాలంలో వాటికి రక్షణగా ఉండేందుకు షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ షెడ్డును మూడు భాగాలుగా విభజించి కోళ్లకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు.

ప్రస్తుతం 6 వేల కోళ‌్లను పెంచుతున్నాడు ప్రవీణ్‌. ఈ కోళ్లకు నిప్పిల్‌ పద్ధతలో నీరు అందిస్తున్నాడు. 24 గంటలునీటి సరఫరా ఉంటుంది. ఈ పద్ధతిలో నీటి వృథాను అరికట్టవచ్చంటున్నాడు ప్రవీణ్. అలాగే షెడ్డు కూడా ఎంతో శుభ్రంగా ఉంటుందని శ్రమ కూడా తగ్గుతుందంటున్నాడు. రాత్రివేళల్లో కోళ్లు నిద్రించేందుకు షెడ్డులో ప్రత్యే కర్రలను ఏర్పాటు చేశాడు.

కడక్‌నాథ్ కోళ‌్లు 6 నెలల నుంచి గుడ్లుపెడతాయి. సంవత్సరానికి ఒక ‎కోడి 100 నుంచి 110 గుడ్లు పెడుతుంది. కోడి గుడ్డు పెట్టాలంటే చీకటి ప్రదేశం ఉండాలి. అలాంటి ప్రాంతంలోనే అవి గుడ్లు పెడతాయి. అందుకని షెడ్డులో ఒక భాగంలో వేస్ట్ బక్కెట్లు ఏర్పాటు చేసి కోడి గుడ్డు పెట్టడానికి అనువుగా వాటిని కత్తిరించాడు బక్కెట్‌లోని అడుగు భాగంలో గడ్డి ఏర్పాటు చేశాడు. ఇలా చేయడం వల్ల గుడ్లు పగిలిపోకుండా జాగ్రత్తగా ఉంటాయంటున్నాడు ప్రవీణ్‌.

ప్రస్తుతం మార్కెట్‌లో లభించే బ్రాయిలర్, నాటుకోళ్ల కంటే ఈ నల్ల కోళ్ల మాంసం బలవర్థకమైన ఆహారం. మిగతా వాటికంటే కొవ్వు శాతం తక్కువగా ఉండటం, ప్రోటీన్‌ల స్థాయిలు అధికంగా ఉండటమే వీటి ప్రత్యేకత. కడక్‌నాథ్‌ కోడి మాంసం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కబట్టే ఈ నల్లకోళ్ల పెంపకాన్ని గత నాలుగేళ్లుగా చేస్తూ నిర్విరామంగా ఈ రంగంలోనే కొనసాగుతున్నాడు ప్రవీణ్. ఫ్రీరేంజ్ విధానంలో కోళ్లను పెంచుతున్న ఈ యువరైతు సోయా, మక్క, సజ్జల పొడులను మేతగా అందిస్తున్నాడు. వీటితో పాటే కోళ్లలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు సేంద్రియ విధానంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు, మునగ,చింత, కరివేపాకు, వేప ఆకులను మేతగా ఇస్తున్నాడు. కోళ్లు వైరస్‌ల బారిన పడకుండా పసుపు, వెల్లుల్లి నీటిని అందిస్తున్నాడు. దీంతో ఈ ఫామ్‌లో కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి.

కడక్‌నాథ్‌ చిక్స్‌లలో మరణాల శాతం అధికంగా ఉంటుంది. దానిని నియంత్రించాలంటే 21 రోజులు చిక్స్ ను బ్రూడింగ్ లో ఉంచాలి. ఈ కోళ్ల పెంపకంలో బ్రూడింగ్ చేయడం అనేది చాలా ముఖ్యమని అంటున్నాడు ప్రవీణ్‌. బ్రాయిలర్ కోళ్లతో పోల్చితే కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకం సమయం ఎక్కువ. ఈ కోళ్లు చేతికి వచ్చేందుకు 6 నుంచి 7 నెలల సమయం పడుతుందని ప్రవీణ్ చెబుతున్నాడు. అప్పటికీ ఒక్కో కోడి బరువు కిలోన్నర వరకు తూగుతుందని అంటున్నాడు. ఆరు నెలల తరవాత కోడి బరువు పెరగడంతో పాటు రుచిగా ఉంటుందంటున్నాడు.

కడక్‌నాథ్‌ కోళ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న దృష్ట్యా తోటి రైతులకు చిక్స్‌ను అందిస్తున్నాడు ప్రవీణ్. ఇందుకోసం ఫామ్ లోనే గుడ్లు పొదుగుటకు 10 వేల గుడ్ల కెపాసిటీ కలిగిన ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ప్రతి వారం 3 వేల చిక్స్ ఉత్పత్తి అవుతున్నాయి. ఒక రోజు పిల్ల నుంచి నెల పిల్ల వరకు రైతులకు అందిస్తున్నారు.

కడక్‌నాథ్ కోళ్ల పెంపకంలో విజయం సాధించాలంటే మార్కెటింగ్ తప్పనిసరి. వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు సొంతంగా మార్కెట్ ను ఏర్పురుచుకుంటేనే రైతులు ఈ రంగంలో రాణించగలరని చెబుతున్నాడు. ప్రవీణ్ కోడి గుడ్లను ప్రత్యేక బాక్సులలో ప్యాక్ చేసి పలు ఆర్గానిక్ స్టోర్లకు విక్రయిస్తున్నాడు. కోళ్లను హోల్‌ సేల్‌ గా అమ్ముతున్నాడు. దీనితో పాటే రైతులకు చిక్స్ రూపంలో అందిస్తున్నాడు. ఇన్ని రకాలుగా సేల్స్ చేస్తుండటం వల్లనే ఈ రంగంలో నిలదొక్కుని నిలబడగలుతున్నానని ప్రవీణ్ చెబుతున్నాడు. కడక్‌నాథ్‌ కోళ్ల ఫామ్ పెట్టాలనుకునే వారు తమను సంప్రదిస్తే కచ్చింగా సలహాలు, సూచనలు అందిస్తానని అంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories