Hydroponic Farming: హైడ్రోపోనిక్స్ లో రాణిస్తున్న హరికృష్ణ
Hydroponic Farming: చక్కని కొలువు కొలువుకు తగ్గ ఆదాయం అంతా బాగుంది కాని ఆత్మసంతృప్తే కొరవడింది.
Hydroponic Farming: చక్కని కొలువు కొలువుకు తగ్గ ఆదాయం అంతా బాగుంది కాని ఆత్మసంతృప్తే కొరవడింది. ప్రకృతితో ముడిపడింది. ఈ తరుణంలో వ్యవసాయంపై మక్కువ ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వీడేలా చేసింది. సేద్యం తెలియకపోయినా అనుభవం పాఠాలు నేర్పింది. సాగు రంగంలో రాణించేలా చేసింది. ప్రకృతిపై ఉన్న ప్రేమతో సేద్యం వైపు అడుగులు వేసి నూతన విధానాలను శ్రీకారం చుడుతున్న యువరైతు హరికృష్ణ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా రాణిస్తున్నా అందులో లేని సంతృప్తి నేడు సేద్యంలో పొందుతున్నాడు మేడ్చల్ కు చందిన యువరైతు హరికృష్ణ. ప్రకృతిపై ఉన్న మమకారంతో సాగు వైపు అడుగులు వేశాడు. పట్టణంలో పొలం లేదు, వ్యవసాయ అనుభవం లేదు అయినా ఆసక్తి చావలేదు. ఏదో చేయాలని తపన ప్రకృతితో కలిసి ప్రయాణించాలన్న కోరిక ఇంటి మీదే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించేలా చేసింది. మట్టిలేని సేద్యానికి అంకురార్పణ మొదలైంది.
ఒక్కోమెట్టు ఎక్కుతూ ఒడిదుడుకులను తట్టుకుంటూ హైడ్రోపోనిక్స్ సేద్యంలో రాణిస్తున్నాడు హరికృష్ణ. ప్రారంభంలో అంతా ఇది సాధ్యం కాదని నిరుత్సాహ పరిచారు. మట్టిలేని సేద్యమా అని ఎగతాలి చేశారు. కానీ కాలమే సమాధానం చెబుతుందని ఎదురుచూసిన హరికృష్ణ ప్రస్తుతం సత్ఫలితాలను సాధిస్తున్నాడు.
సాగంటే సమస్యల సుడిగుండ అందులో పండిపోయిన రైతులు సైతం ప్రస్తుతం కష‌్టనష్టాలను చవిచూస్తున్నారు. ఈ విషయాలను గమనించిన హరికృష్ణ సాంకేతిక సహకారం తీసుకున్నాడు. హైడ్రోపోనిక్స్ సేద్య విధానం గురించి తెలుసుకున్నాడు. ఈ పద్ధతిలో విదేశాల్లో ఇప్పటికే చాలా మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కానీ భారత్ లో ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటోంది. ముఖ్యంగా మట్టి అవరసం లేకుండా నీటితో అందులోనూ తక్కువ నీటితో ఆరోగ్యకరమైన ఆకుకూరలను ఈ విధానంలో సాగు చేసుకోవచ్చు. ఇదే ఈ యువరైతును ప్రధానంగా ఆకర్షించింది.
సేద్యంపై అవగాహన లేకపోవడంతో ప్రారంభంలో కాస్త ఇబ్బందులు పడ్డా ప్రస్తుతం అందుతున్న పంట ఉత్పత్తులను చూస్తూ సంతృప్తి చెందుతున్నాడు ఈ యువరైతు. మొదట 50 మొక్కలతో ప్రారంభమైన సేద్యం ప్రస్తుతం 20 వేల మొక్కలకు విస్తరించింది. హైడ్రోపోనిక్స్ సేద్యానికి కావాల్సిన సమస్త సదుపాయాలను తక్కువ ఖర్చుతో తానే తన కుటుంబ సహకారంతో మేడ మీదే ఏర్పాటు చేసుకున్నాడు. ఔరా అని అనిపిస్తున్నాడు.
చూడడం వేరు దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. చూస్తున్నవారందరికీ వ్యవసాయమంటే ఏ ముందిలే విత్తు నాటితే అదే వస్తుందని భావిస్తుంటారు. కానీ రైతు పడే శ్రమను చూస్తే కానీ అర్ధకం కాదు అందులో ఎంత శ్రమ ఉందో. నిజానికి హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల సేద్యం అంటే నీటి సాయంతో మొక్కలను పెంచడం. ఇది సులువైనదేనని అందరూ భావిస్తారు. వాస్తవానికి అది నిజమే కానీ పూర్తిస్థాయిలో అవగాహన తప్పనిసరి అని అంటారు హరికృష్ణ. సేద్యం అంటే ఏమిటో తెలియక సాగు మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు. అనుభవం నేర్పిన పాఠాలతో నేడు నేర్పును పొందాడు హరికృష్ణ.
అంతా బాగుంది ఇంకేముంది కమర్షియల్ గా ఓ ప్లాంట్ ను ఇంటి మేడ మీదే నెలకొల్పుదామని నిశ్చయించుకున్నాడు. కానీ దానికయ్యే ఖర్చు చూసి ఖంగుతిన్నాడు. కానీ ప్రయత్నం మానలేదు. నేనే ఎందుకు చేయకూడదని ఆలోచించాడు. తన తండ్రి సహకారంతో 20 వేల మొక్కలను పెంచే సామర్థ్యం గల కిట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలను నుంచి మొక్కలను రక్షించుకునేందుకు గ్రీన్ షేడ్ నెట్ ను చుట్టూ నిర్మించాడు. ఈ పద్ధతిలో కొత్తిమీర, పుదీనా, పాలకూర, మెంతికూర, తోటకూర , గోంగూర్, చుక్కకూర, ఇలా ఎన్నో రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నాడు. నాణ్యమైన పంటను వినియోగదారులకు విక్రయిస్తున్నాడు.
కుండీలు, మడుల్లో కన్నా ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో సాగైన ఆకుకూరలు ఎంతో తాజాగా , నాణ్యంగా ఉండటంతో పాటు ముందుగానే అందివస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు హరికృష్ణ. రీసైక్లింగ్ పద్ధతులను అనుసరించి పంటలకు నీటిని అందిస్తున్నాడు. ప్రతి గంటకు తాజా నీటిని మొక్కలకు అందిస్తున్నాడు. తద్వారా వేర్లు ఆరోగ్యంగా పెరగడంతో దిగుబడి బాగుంటోందని చెబుతున్నాడు ఈ యువ రైతు.
మొదట ప్రయోగాత్మకంగా పీవీసీ పైపులను ఉపయోగించి హైడ్రోపోనిక్స్ టవర్ ను ఏర్పాటు చేశాడు హరికృష్ణ. అందులో కోకోపిట్, పెర్లైట్, నీమ్ పౌడర్ మాధ్యమాన్ని వినియోగించాడు. ఒక్కో టవర్లో 45 మొక్కలు పెంచే విధంగా టవర్ ను నిర్మించాడు. పుదీనా, కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలను ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. అయితే ఈ విధానంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. టవర్లోని అన్ని మొక్కలకు సూర్యరశ్మి తగులక ఎదుగుదల లోపించింది. దీనితో ఈ విధానానికే కాస్త మెరుగులు అద్ది న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ తో మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు.
ఈ న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్కిక్ లో కోకోపిట్ వంటి మాధ్యమాల అవసరం ఉండదని ఇది చాలా తేలికైన పద్ధతని వివరిస్తున్నాడు హరికృష్ణ. నీటి ద్వారానే మొక్కలు పెరుగుతాయంటున్నాడు. ఒక్కో టవర్ లో ఎంతలేదన్నా 80 మొక్కల వరకు పెరుగుతాయని చాలా తక్కువ ఖర్చుతోనే హైడ్రోపోనిక్స్ సాగు చేసుకోవచ్చునని అంటున్నాడు. రీసైక్లింగ్ పద్ధతులను అనుసరించి పంటలకు నీటిని అందిస్తున్నాడు. ప్రతి గంటకు తాజా నీటిని మొక్కలకు అందిస్తున్నాడు. తద్వారా వేర్లు ఆరోగ్యంగా పెరగడంతో దిగుబడి బాగుంటోందని చెబుతున్నాడు ఈ యువ రైతు.
హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కలను పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నాడు హరికృష్ణ. సాధారణ సాగుతో పోల్చుకుంటే చాలా తక్కువ నీటితోనూ ఆకుకూరలు సాగు చేసుకోవచ్చునని అంటున్నాడు. అదే విధంగా ఎలాంటి రసాయనాలు వాడనవసరం లేకుండా ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం లభిస్తుందని చెబుతున్నాడు. దిగుబడి కూడా ముందుగానే వస్తుందని అంటున్నాడు. ఇక ప్రధానంగా సాగులో ఎదురయ్యే చీడపడీల సమస్యలు పెద్దగా ఉండవంటున్నాడు ఈ యువరైతు. మట్టి వాడకం లేదు కాబట్టి మట్టి నుంచి వచ్చే ఎలాంటి సమస్యలు రావంటున్నాడు. ఇక మేడ మీద వ్యవసాయం చేస్తున్నాము కాబట్టి పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నాడు. వాటికి సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నామంటున్నాడు.
హైడ్రోపోనిక్స్ లో మొక్కలు పెంచాలనుకునే వారి కోసం ఓ ఎకనామిక్ కిట్ ను తయారు చేశాడు హరికృష‌్ణ. ఈ కిట్ లో 4 రకాల మొక్కలు పెంచుకోవచ్చు . ఈ కిట్ తో పాటే విత్తనాలను పంటకు అవసరమైన పోషకాలను అందిస్తున్నాడు. ప్రకృతితో కలిసి ప్రయాణించాలనే ఒకే ఒక్క ఆలోచన అతడిని సేద్యం వైపు నడిచేలా చేసింది. అందులోనూ అత్యాధునిక విధానాలను అందిపుచ్చుకున్న ఈ యువరైతు హరికృష‌్ణ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire