Cattle Insurance Policy: అతివృష్టి, వరదలు, వడగాల్పులు, ఉరుములు, పిడుగుపాటు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా రైతులు తమకు ఆసరాగా ఉంటాయని పెంచుకుంటున్న తమ పాడి పశువులు , జీవాలు చనిపోతున్నాయి.
Cattle Insurance Policy: అతివృష్టి, వరదలు, వడగాల్పులు, ఉరుములు, పిడుగుపాటు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా రైతులు తమకు ఆసరాగా ఉంటాయని పెంచుకుంటున్న తమ పాడి పశువులు , జీవాలు చనిపోతున్నాయి. ఎంతో విలువైన పశువులను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన చాలా మంది రైతులు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. ప్రస్తుత కాలంలో పాలు, పాల ఉత్పత్తుల ధర కన్నా పాడి పశువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మంచి పాడిగేదె లేదా గిర్, సాహివాల్ వంటి మేలైన ఆవులను కొనుగోలు చేయాలంటే ఎంత లేదన్నా లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు మార్కెట్‌లో మద్దతు లేకపోవడంతో వ్యవసాయం వల్ల రైతుకు ఆదాయ భరోసా కలగడం లేదని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో రైతుసోదరులకు వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నవి పశువులు, జీవాలు. అవి కూడా మరణిస్తే ఆ పేద కుటుంబం వీధిన పడే పరిస్థితులు అనేక గ్రామాల్లో కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బదులు రాకుండా ఉండాలటే పాడి పశువులను పెంచే రైతులు తప్పక పశువులకు భీమా చేయించాలంటున్నారు నిపుణులు.
బీమా అంటే ఒక నిర్ణీత మొత్తాన్ని బీమా కంపెనీకి చెల్లించాలి. నిర్ణీత కాలంలో బీమా చేసిన పశువు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా, నిర్ణీత మొత్తాన్ని నష్టపరిహారంగా పొందే సదుపాయం ఉంటుంది. ఇది బీమా కంపెనీకి, బీమా చేసిన పశువు యజమానికి మధ్య జరిగే కొన్ని కచ్చితమైన నిబంధనలతో కూడిన ఒప్పందం. అలా అని ప్రతి పశువుకు బీమా వర్తించదు. పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో, నిర్ణీత వయోపరిమితి కలిగిన, ఉత్పాదదాకమైన పశువుకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణంగా పశువు బీమా గడువు ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. అయితే గ్రామీణ రైతుల సౌలభ్యం కోసం మూడు సంవత్సరాల పాలసీలు కూడా అమలులో ఉన్నాయి.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క రైతుకు చెందిన రెండు పాడి పశువుల వరకు అవసరమైన ప్రీమియంను ప్రభుత్వాలు చెల్లిస్తూ ఉచిత బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా గరిష్టంగా పాడి గేదెకు 30 వేల రూపాయలు, పాడి ఆవుకు 15 వేల రూపాయలు పరిహారాన్ని మాత్రమే పొందే వీలుంది. ఇంతకంటే ఎక్కువ విలువైన పశువుకు రైతులే బీమా కంపెనీలతో సంప్రదించి పశువు విలువలో 3 నుంచి 4 శాతం ప్రీమియం చెల్లించి బీమా రక్షణ పొందాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందే రుణాతో కొనుగోలు చేసే పాడి పశువులకు పశువు కొనుగోలు విలువ ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు పాల సహకార డెయిరీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు, గ్రామీణ సహకార సంఘాలు ప్రీమియంలో తమవంతుగా నాలుగో వంతు నుంచి సగం వరకు భరిస్తూ తమకు పాలను సరఫరా చేసే ఉత్పత్తిదారులకు చేయూత నిస్తున్నాయి. దూడలు, పడ్డలు, పెయ్యలకు కూడా వయసుతో పాటు పెరిగే వాటి విలువ ప్రకారం బీమా రక్షణ కల్పించే సదుపాయాలను కొన్ని బీమా కంపెనీలు అమలు చేస్తున్నాయి. శాశ్వత అంగవైకల్యానికి , గొడ్డుమోతు తనానికి, పూర్తి ఉత్పాదకతను కోల్పోయినందుకు కూడా బీమా రక్షణ పొందే పథకాలు కూడా ఉన్నాయి.
పశువులకు బీమా చేయించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బీమా చేసే ముందు జరిపే వైద్య పరీక్షలు, క్లెయిమ్ సందర్భాల్లో చేసే పరీక్షల వ్లల వివిధ రకాల అనారోగ్య లేదా మరణ కారణాలపై పశువైద్యులకే కాకుండా రైతాంగానికి కూడా స్పష్టమైన అవగాహన ఏర్పాడి పశువులు మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆధునిక శాస్త్రీయ విధానాలతో పోషణ, వైద్య, పునరుత్పత్తి పద్ధతులను ఎలాంటి సందేహాలు లేకుండా ఆచరించే అవకాశాలు పెరుగుతాయి. బీమా సదుపాయంలో నమోదు చేసిన గుర్తులు, చెవులకు వేసిన గుర్తింపు పోగుల వల్ల తప్పిపోయిన లేదా దొంగిలించబడినా పశువులను సులువుగా గుర్తించే వీలు కలుగుతుంది. బీమా చేసిన పశువులకు విధిగా పశువైద్య అర్హతలు కలిగిన వైద్యులతో మాత్రమే సకాలంలో శాస్త్రీయ వైద్యం అందించాలనే నిబంధన వల్ల రైతులు నాటు వైద్యులు, మంత్ర తంత్రాలపై ఆధారపడే పరిస్థితులు కాలక్రమంగా కనుమరుగవుతాయి. బీమా చేయించే ముందు విధిగా జరిపే గర్భకోశ పరీక్షల వల్ల చూడి పశువులను, శాశ్వత గొడ్డుమోతు పశువులను సకాలంలో గుర్తించి సరైన చర్యలను తీసుకోవడం సాధ్యమవుతుంది. బీమా చేయించే ముందు బీమా పత్రంలో పశువు గుర్తులను స్పష్టంగా తెలుపుతూ చెవిపోగు నంబరుతో పాటు పశువు స్పష్టమైన ఫోటోను కూడా జోడించాలి. ముఖ్యంగా చనిపోయిన పశువు స్థానంలో మరొక పాడి పశువును కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని కొనసాగించేందుకు బీమా కంపెనీ నుంచి అందిన నష్టపరిహారం సొమ్ము ఉపయోగపడుతుంది.
బీమా పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేమిటంటే బీమా చేసే సమయానికి పశువు పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉన్నట్లు పశువైద్య డిగ్రీ ఉన్న వైద్యుడు నిర్థారణ చేయాలి. బీమాకు అవసరమైన ప్రీమియం సొమ్ము, అందుకు సంబంధించిన పత్రాలు బీమా కార్యాలయానికి సక్రమ రూపంలో అందిన తరువాత, 15 రోజులకు బీమా అమలులోకి వస్తుంది. అయితే ఈ నిబంధనకు అగ్ని ప్రమాదాలు, రైలు, రోడ్డు, ఉపద్రవాల వల్ల జరిగే మరణాల విషయంలో సడళింపు ఉంటుంది. టీకాల ద్వారా నివారించదగిన వ్యాధులకు సకాలంలో టీకాలు వేయడంతో పాటు , ధ్రువీకరణ కూడా తప్పనిసరిగా పొందాలి. అనారోగ్యాలు సంభవించినప్పుడు, అందుబాటులో ఉన్న పశువైద్యునితో చికిత్స జరిపించి రికార్డుల్లో నమోదు చేయాలి. బీమా చేసేముందు నమోదైన గుర్తులు చెవులకు బిగించిన చెవిపోగులను తొలగించడం, మార్పు చేయడం నిషేధం. చెవులకు బిగించిన నెంబరు పోగులు ఊడిపోయినా, పాడైనా , రూపుమారినా వెంటనే ఆ విషయాన్ని బీమా కంపెనీ వారికి లిఖిత పూర్వకంగా తెలియచేసి రశీదు పొందాలి. యజమాని మారితే బీమా కొనసాగదు. ఒకసారి చెల్లించిన ప్రీమియంను తిరిగి ఇవ్వడం సాధ్యపడదు. వ్యాధి లేదా ప్రమాదాలకు గురి కాకుండా యజమాని తన స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విధిగా పాటించాలి.
పశువు మరణించిన వెంటనే ఆ విషయాన్ని బీమా కంపెనీకి తెలియపరచాలి. వారు తనిఖీకి వచ్చేవరకు మృత కళేబరాన్ని కదల్చకూడదు. చెవిపోగును తొలగించకూడదు. ఏ కారణంతో అయినా అధికారులు రావడం ఆలస్యమైతే స్థానిక పెద్దల సమక్షంలో పంచనామా జరిపి, వారి సంతకాలతో వాస్తవాన్ని రికార్డు చేసి, మరణించిన కళేబరం స్పష్టమైన ఫోటో తీసి, తగిన ఆధారాలతో బీమా కంపెనీకి సమర్పించాలి. వారు అందించే క్లెయిమ్ ఫారాలను పశువైద్యుడి ధృవీకరణతో బీమా కంపెనీకి సమర్పించాలి. సాధారణంగా మరణించిన ప్రతి పశువుకు శవపరీక్ష చేయడం తప్పనిసరి. నిర్దేశించిన గడువులో క్లెయిమ్ పరిష్కారం జరగకపోయినా, ఏకపక్షంగా క్లెయిమ్ మొత్తాన్ని తగ్గించిన, క్లెయిమ్‌ను తిరస్కరించినా వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయ సహాయం పొందవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire