అధిక దిగుబడినిచ్చే సూపర్ గ్రాసాలు.. పాడి రైతుకు వరం

High Yielding Grass Cultivation in Telugu
x

అధిక దిగుబడినిచ్చే సూపర్ గ్రాసాలు.. పాడి రైతుకు వరం

Highlights

Grass Cultivation: పాడి పరిశ్రమ, జీవాల పెంపకం ఉపాధినిచ్చే మార్గాలుగా అధిక ఆదరణ పొందుతున్నాయి.

Grass Cultivation: పాడి పరిశ్రమ, జీవాల పెంపకం ఉపాధినిచ్చే మార్గాలుగా అధిక ఆదరణ పొందుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన యువత సైతం పశువులు, జీవాల పెంపకం చేపట్టి లాభాలు పొందుతున్నారు. మరి ఈ రంగంలో రాణించాలంటే రైతులు ముందుగా పశుగ్రాసాల సాగుపైన ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. మేలైన గ్రాసాల సాగుతోనే అధిక పాల దిగుబడి, మాంసం ఉత్పత్తి లభిస్తాయంటున్నారు. పాడి పశువులు, జీవాల నిర్వహణలో సింహభాగం ఖర్చు మేతకే వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు అందించే గ్రాసాలను ఎంపిక చేసి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ గ్రాసాలు అధిక దిగుబడినిస్తాయి వాటి సాగులో పాటించాల్సిన మెలకువలు ఏమిటి? ఆయా గ్రాసాల్లో ఉన్న పోషకాల లభ్యత ఎంత? వాణిజ్య సరళిలో పచ్చిమేత సాగు చేసి ఆదాయాన్ని పొందవచ్చా.. ? ఇప్పుడు తెలుసుకుందాం.

పశుగ్రాసాల సాగులో అత్యధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలను ఎంచుకుని సాగు చేసుకుంటే భూమి అవసరం, సాగు వ్యయం తగ్గి, ఎక్కువ మొత్తంలో పశుగ్రాసం లభిస్తుంది. తద్వారా మేపు ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ, జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. ఈ క్రమంలో సూపర్ నేపియర్, జూరి అనే రెండు పశుగ్రాసాలు పాడి రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు గ్రాసాలు అధిక దిగుబడిని అందించే బహువార్షిక, ధాన్యపుజాతి పశుగ్రాసాలు. సజ్జ, హైబ్రిడ్ నేపియర్‌ను సంకరపరిచి రూపొందించించి ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం. ఈ గ్రాసం కాండం లావుగా ఉండి, ఆకులు మెత్తగా ఉంటాయి. ఇక జూరి పశుగ్రాసం గినీ రకానికి చెందింది. ఈ గ్రాసం సన్నటి కాడతో ఎక్కువ ఆకులు కలిగి ఉంటుంది.

మరి ఈ రకాలను సాగు చేసుకునే విధానాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్రాసాలను సాగు చేసుకునే పొలాన్ని కలియదున్నాలి. గ్రాసాల సాగు చేసే నేల సారవంతంగా ఉందో లేదో తెలుసుకోవాలి. దానిని బట్టి సేంద్రియ విధానంలో ఎరువులను వేసుకుని పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా కలియదున్ని పొలంలో బోదెలు తయారు చేసుకోవాలి. బోదెల మధ్య 2 నుంచి 3 అడుగులు, నాటే కణుపుల మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటితడిని అందిస్తుండాలి. గ్రాసాలు సాగు చేసే సమయంలో కలుపు సమస్య ఏర్పడుతుంది. కాబట్టి దీని నివారణ చాలా ముఖ్యం. అందుకే గ్రాసాలు వేసుకున్న మొదటి నెలలోనే అలసంద, పిల్లిపెసర, పెసర వంటి గ్రాసాల్ని అంతరపంటలుగా వేసుకుంటే కలుపు రాకుండా ఉంటుంది. అంతే కాదు భూసారం వృద్ధి చెందుతుంది.

ఇక జూరి పశుగ్రాసం కణుపుల లభ్యత ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్రాసాన్ని విత్తనాలతో కూడా సాగు చేసుకోవచ్చు. ముందుగా నారుమడి తయారు చేసుకుని నారును సిద్ధం చేసుకోవాలి. మడి మీద నిలువు గీతలు గీసుకుని, వరుసల్లో విత్తనాలను ఇసుకలో కలిపి నాటాలి. సాలుకు సాలుకు మధ్య 2 నుంచి 3 అడుగుల స్థలం ఉండాలి. మొక్కమొక్కకు మధ్య 2 అడుగుల స్థలం ఉండాలి. మడిపైన వరిగడ్డి కప్పి, నీటితో తడపాలి. 3 నుంచి 4 రోజుల్లో మొలకెత్తడం ప్రారంభమై నెల రోజుల్లో మడి తయారవుతుంది.

సూపర్ నేపియర్ పశుగ్రాసంలో ఆక్సోలేట్లు ఉన్నందున కాల్షియం ఖనిజలవణ లోపం పశువుల్లో ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ గ్రాసం వాడినప్పుడు పశువులకు అదనంగా కాల్షియం వాడాలి. సూపర్ నేపియర్ గ్రాసాన్ని ముక్కలు చేసి, ప్రతి టన్నుకు 10 కిలో బెల్లం మడ్డి కలిపి సైలేజిగా కూడా నిలువ చేసుకోవచ్చు. ఇక జూరి గ్రాసాన్ని ముదిరినప్పుడు లిగ్నిన్‌ పీచుపదార్ధం ఎక్కువై, జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ఈ గ్రాసాన్ని ముదరనీయకుండా ప్రతి 30 నుంచి 35 రోజులకు ఒకసారి నుంచి 5 అడుగుల ఎత్తు రాగానే కోసి పశువులకు మేపాలి. జూరి సాగు చేసే గట్ల మీద పప్పుజాతి పశుగ్రాసాలను సాగు చేస్తే పశువులకు ధాన్యపు జాతి , పప్పుజాతి పశుగ్రాసాలు రెండు లభిస్తాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories