బోడ కాకర సాగుతో బోలెడు ఆదాయం

బోడ కాకర సాగుతో బోలెడు ఆదాయం
x
Highlights

కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర, ఇప్పుడు వ్యవసాయ...

కూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర, ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. రుచికి వగరే అయినా రైతులకు మాత్రం లాభాల తీపిని అందిస్తున్నది ఈ తీగజాతి పంట. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో ప్రస్తుతం చాలా మంది రైతులు సాగు చేసి మంచి లాభాలను పొందుతున్నారు. ఆ కోవలోనే ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక రైతు బోడ కాకర సాగులో లాభాలు గడిస్తున్నాడు. రైతుకు లాభాలు తెచ్చి పెట్టే బోడకాకర పంట సాగు గురించి ప్రత్యేక కథనం.

ఖ‌మ్మం జిల్లా గోళ్లపాడు గ్రామానికి చెందిన రైతు శ్యామల రామిరెడ్డి గతంలో పలు రకాల కూరగాయల సాగు చేసేవాడు సాధారణ కూరగాయల సాగులో లాభాలు తక్కువుంటున్నాయనే ఉద్దేశ్యంతో తన ఆలోచన బోడ కాకర సాగు వైపు మళ్లింది. అనుకున్నదే తడవుగా ఎకరా పొలంలో గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు రైతు రామిరెడ్డి.

అటవీ ప్రాంతంలో సాధారణంగా పండే ఈ పంటకు మార్కెట్‌లో ప్రత్యేకంగా విత్తనం లభించదు. చిన్న చిన్న దుంపలు లేదా పండిన కాయల నుంచి గింజలు సేకరించాలి. ఆడ,మగ మొక్కలు వేర్వేరుగా ఉంటాయి. అవి మనకు పూత సమయంలోనే గుర్తించడానికి వీలవుతుంది. మగవాటిని గుర్తించి పది శాతం మాత్రమే ఉండేలా చూసుకుని మిగిలినవి తీసివేయాలని, ఈ బోడ కాకర ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని అంటున్నారు ఈ రైతు.

విత్తనం లేదా దుంపల ఖర్చు 2వేలు అవుతుంది అదే అటవీ ప్రాంతంలో సంపాదించుకుంటే ఖర్చు ఉండదు. పొలం తయారీ ఖర్చు 5వేలు. ఎరువుల ఖర్చు పోను ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో కిలో ధర 120 నుంచి 200 వరకు ఉంటుంది. ఎకరానికి ఆదాయం సుమారు రెండు లక్షల దాకా వస్తుందని అంటున్నారు. రైతు శ్యామల రామిరెడ్డితో పాటు తన కుమారుడు రాజశేఖర్ రెడ్డి కూడా బోడ కాకర సాగులో పాలు పంచుకుంటున్నాడు, కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సొంత గ్రామానికి వచ్చి తన తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. ఇతరాత్ర కూరగాయల సాగు కాకుండా డిమాండ్ ఉన్న ఈ పంట రైతుకు లాభదాయకమని అంటున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories