Ankapur Corn: మొక్కజొన్న సాగుతో..సిరుల పంట

Full Demand for Ankapur Corn
x

Ankapur Corn: మొక్కజొన్న సాగుతో..సిరుల పంట

Highlights

Ankapur Corn: పత్తికి వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌, ఉల్లిగడ్డకు మలక్‌పేట్‌, కూరగాయలకు మోండా మార్కెట్‌ ఎలా ప్రసిద్ధి చెందాయో ..

Ankapur Corn: పత్తికి వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌, ఉల్లిగడ్డకు మలక్‌పేట్‌, కూరగాయలకు మోండా మార్కెట్‌ ఎలా ప్రసిద్ధి చెందాయో మక్క బుట్టలకు నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ అంతలా గుర్తింపు సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పచ్చి మక్క బుట్టల సంతగా అంకాపూర్ మార్కెట్ నిలుస్తోంది. ప్రాంతాలను బట్టి మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న కంకులు మక్కబుట్టలు అని వ్యవహరిస్తూ ఉన్నా ఉత్తర తెలంగాణలో మక్క బుట్టలు పేరు చెబితేనే నోరూరుతుంటుంది. సీజన్ ప్రారంభం కావడంతో తాజా మొక్కజొన్న కంకుల కోసం వ్యాపారులు అంకాపూర్ మార్కెట్‌కు క్యూ కడుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుండగా రైతులకు లాభదాయకమైన ఆదాయం అందివస్తోంది మక్క బుట్టల సాగుతో సిరుల పంట పండిస్తున్న అంకాపూర్ మొక్కజొన్న రైతులపై ప్రత్యేక కథనం.

పంటల సాగులో దేశ స్థాయిలో గుర్తింపు సాధించిన రైతులు మక్క బుట్టల సాగులోనూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. జిల్లాలో పది వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉంది. ప్రధాన పొలంలో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసి సిరుల పంట పండిస్తున్నారు. సాగు చేసిన చోటే పంటను విక్రయిస్తూ రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతుల దగ్గరకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. ప్రతీ సీజన్‌లో సుమారు 50 కోట్లకు పైగా వ్యాపారం చేస్తుంటారంటే ఈ మక్క బుట్టలకు ఏ మేరకు గిరాకీ ఉంటుందో అర్దం చేసుకోవచ్చు.

అంకాపూర్ లో పచ్చి బుట్టలు సీజన్ ప్రారంభం కావడంతో నాలుగు నెలల పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతీరోజు 10 టన్నులకు పైగా విక్రయాలు జరుగుతుండటంతో ఆ మేరకు హమాలీలకు చేతి నిండా పని దొరుకుతుంది. వర్షం పడి వాతావరణం చల్లబడితే ఒక ధర, పొడి వాతావరణం ఉంటే మరో ధర ఉంటుంది. ఒక్క ఆటో ట్రాలీలో 1200కు పైగా కంకులుంటాయి. డిమాండును బట్టి 4 వేల నుంచి 7 వేల రూపాయలకు వ్యాపారులు పచ్చి మక్కలను కొనుగోలు చేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర దొరకడంతో పాటు కూలీలకు చేతి నిండా పని వ్యాపారులు సైతం నాలుగు రాళ్లు వెనుకేసుకులేలా అంకాపూర్ మార్కెట్ సిరుల వర్షం కురిపిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories