Fish Farming: చేపల చెరువులుగా మారిన వ్యవసాయ భూమలు

Fish Farming
x

Fish Farming: చేపల చెరువులుగా మారిన వ్యవసాయ భూమలు

Highlights

Fish Farming: ఒకప్పుడు చేపల చెరువులంటే గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. చేపల చెరువు అన్న పదమే తెలంగాణ రాష్ట్ర రైతులకు కొత్తగా ఉండేది.

Fish Farming: ఒకప్పుడు చేపల చెరువులంటే గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. చేపల చెరువు అన్న పదమే తెలంగాణ రాష్ట్ర రైతులకు కొత్తగా ఉండేది. గతంలో సరైన నీటి వసతి లేకపోవడం కూడా మత్స్య సేద్యంపై రైతులు ఆసక్తిని చూపకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండటంతో రైతులు చేపల పెంపకానికి ముందుకు వస్తున్నారు. ఇన్నాళ్లూ ఊర చెరువులు, కుంటలకే పరిమితమైన మీనాల పెంపకం ప్రస్తుతం చేపల చెరువుల వైపు మళ్లుతోంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది ఔత్సాహిక రైతులు చేపల సాగులో లాభాలు గడిస్తున్నారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చేపల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాదంతా వీటికి బాగా గిరాకీ ఉంటుంది. తెలంగాణ రాష‌్ట్రంలోనూ వినియోగం పెరుగుతుండటంతో ప్రత్యేకంగా చేపల చెరువులను నిర్మించుకుని ఆర్థికంగా లాభం పొందుతున్నారు కొంత మంది రైతులు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి పూర్తి యాజమాన్య పద్ధతుల్లో చేపల పెంపకం చేపడుతున్నారు. లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు.

సమీకృత మత్స్య అభివృద్ది పథకం లో భాగంగా చేపల చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ అందిస్తోందన్న విషయాలను తెలుసుకుని జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మాపురానికి చెందిన కొంత మంది రైతులు తమ వ్యవసాయ భూమిని చేపల చెరువుకు అనువుగా మార్చుకుని ఈ ఏడాది నుంచి చేపల పెంపకం మొదలు పెట్టారు.

రెండున్నర ఎకరాల్లో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చేపల పెంపకానికి ముందే నేల సాగుకు అనువుగా ఉందోలేదో అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించుకున్నారు. 6 ఫీట్ల లోతులో చెరువు తవ్వుకుని 8 ఫీట్ల కట్టపోసుకున్నారు. నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో చేప పిల్లలను వదిలారు. ప్రధానంగా తెలంగాణలో గిరాకీ ఉన్న బొత్స, రవ్వ, బంగారు తీగ వంటి మూడు రకాల చేపలను పెంచుతున్నారు. చేపల పిల్లలను చెరువులో వదిలి 6 నెలలు కావస్తోందని ప్రస్తుతం చేపలు అరకిలో వరకు బరువు తూగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోజులో ఒక మూడు గంటలు చేపల పెంపకానికి కేటాయిస్తే సరిపోతుందని చెబుతున్నారు మత్స్య రైతులు . వేరే వ్యాపకాలతో పాటు చేపల పెంపకాన్ని సులువుగా చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. అయితే ప్రతి రోజు వాటి ఎదుగుదలను పరిశీలిస్తుండటంతో పాటు మేత సక్రమంగా అందుతుందో లేదో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. చేపల్లో వ్యాధులు ఏర్పడిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. లేదంటే చేపలు మృత్యువాత పడే అవకాశులు ఎక్కువని తెలిపారు. పోషకాలతో కూడిన మేత అందించడం వల్ల మంచి దిగుబడి అందుతుందంటున్నారు.

హెక్టారు విస్తీర్ణంలో చేపల చెరువు ఏర్పాటుకు సుమారు 12 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు ఈ రైతులు. పెద్దమొత్తంలో పెట్టుబడి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చెరువులోని చేపల పరిస్థితిని గమనిస్తారు. చెరువులో ఏమైన పిచ్చిమొక్కలు, చెత్త ఉంటే వాటిని తొలగించిన తరువాతనే మేత అందిస్తారు. స్థానికంగా మేత అందుబాటులో లేకపోవడంతో ఆంధ్రా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చేపలకు మేతగా తవుడు, శనగ చెక్క, పామాయిల్ చెక్క, పశువుల పేడతో తయారు చేసిన మిశ్రమాన్ని అందిస్తున్నారు.

కొత్తగా చెరువులను ఏర్పాటు చేసుకునే రైతులు ముందుగా మట్టి పరీక్షలు చేయించి , చెరువుకు ఆ నేల పనికి వస్తుందా లేదా అని గుర్తించాలని అంటున్నారు. నీటి సదుపాయం ఉన్న రైతులు నిస్సందేహంగా చేపలను పెంచుకోవచ్చునని అంటున్నారు. వేరే పనులు చేసుకుంటూ ప్రత్యామ్నాయంగా చేపల పెంపకం చేపట్టవచ్చంటున్నారు.పెద్దమొత్తంలో కూలీల అవసరం లేదు. శ్రమ కూడా తక్కువే పెట్టుబడి కాస్త ఎక్కువైనా లాభాలు అందుకు తగ్గట్లుగానే వస్తాయని రైతులు చెబుతున్నారు. గతంలో పత్తి, వరి సాగులో పెట్టుబడులు పెరిగి, గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు మార్కెట్‌లోనూ నెలల తరబడి రాబడికోసం పడిగాపులు పడేదని కానీ చేపల పెంపకంతో ఆ కష్టం తీరిందంటున్నారు. కాస్త మెళకువలు పాటిస్తే పత్తి, వరి సాగుతో పోల్చుకుంటే చేపల పెంపకంతో ఆర్ధికాభివృద్ధి సాధించవచ్చంటున్నారు.

ఏళ్లతరబడి వరి, పత్తి సాగులో రాని లాభాలను చేపల పెంపకం ద్వారా పొందుతున్నామని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చేపల పెంపకంలో పత్తి, వరి పంటకు వేసినట్లు మందులు చల్లాల్సిన అవసరం లేదు. కూలీల అవసరం పెద్దగా ఉండదు. చేపల చెరువుకు కాపలాగా ఒక్క కూలీ ఉంటే సరిపోతుంది. ఇక ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏడాదికి రెండు సార్లు ఆదాయాన్ని పొందవచ్చంటున్నారు. ధర కూడా రైతే నిర్ణయ ఇస్తాడు కాబట్టి లాభాలు దక్కుతాయంటున్నారు. ఇక మార్కెట్ సమస్య అస్సలే లేదంటున్నారు రైతులు. చేరవు దగ్గరే విక్రయించడంతో ఏరోజుకారోజే ఆదాయం లభిస్తుందని అంటున్నారు.

ఒక్కో యూనిట్ నుంచి సుమారు 5 నుంచి 6 టన్నుల చేపల ఉత్పత్తి అందుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. సుమారు 6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా చేపల సాగులో మెళకువలు తెలుసుకుంటున్న ఈ రైతులు రానున్న రోజుల్లో ఏడాదికి మూడు పంటలు తీసే విధానాలను అనుసరిస్తామని చెబుతున్నారు. పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం కాస్త ఆర్ధికంగా ఆదుకుంటే ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తామని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహం, రైతుల ఉత్సాహం వెరసి మహబూబాబాద్ జిల్లాలో చేపల పెంపకం రైతుకు సిరులు కురిపించనుంది. సమీకృత మత్స్య అభివృద్ది పథకం లో భాగంగా ప్రభుత్వం రాయితీని త్వరితగతిన అందిస్తే చేపల పెంపకంలో మరింత అభివృద్ధి సాధించగలుగుతామని మత్స్య రైతులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories