Nagarkurnool: గాడిదలు కాస్తూ లక్షల్లో ఆదాయం.. తెలంగాణలో మొదటి డాంకీ ఫార్మ్..

First Donkey Farm in Telangana Opens in Nagarkurnool
x

Nagarkurnool: గాడిదలు కాస్తూ లక్షల్లో ఆదాయం.. తెలంగాణలో మొదటి డాంకీ ఫార్మ్..

Highlights

Nagarkurnool: గాడిదలు కాస్తూ లక్షల్లో ఆదాయం.. తెలంగాణలో మొదటి డాంకీ ఫార్మ్..

Nagarkurnool: చేసే ప్రతీ పని ఏదో ఓ అనుభవాన్ని నేర్పుతుంది.. అయితే అన్నింట్లో లాభాలు రావాలంటే అది సాధ్యం కాదు.. అలాగని ఏదీ చేయకుండా కూర్చుంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి. మనిషిగా పుట్టాక ఏదో ఒకటి సాధించాలి , అది నలుగురికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఆర్థికంగా ఎలాగైనా నిలబడాలన్న తపన ఉంటే వారికి తిరుగుండదు. ఒకటి కాకుంటే మరో దానిలో విజయం సాధించడం తధ్యం. ఇలాంటి పట్టుదలే ఓ యువరైతును వినూత్నంగా ఆలోచించేలా చేసింది. ఎన్నో పంటలు వేసి కాలం కలిసి రాక సరైన సంపాదనలేక అలసిపోయిన తన తండ్రిని చూసి, ఇలాగైతే కాదు... కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తెలంగాణాలో నే ఎక్కడా లేనివిధంగా... గాడిదల ఫామ్‌ని ఏర్పాటుచేశాడు. విదేశాలకు గాడిదపాల ఎగుమతే లక్షంగా ముందుకు సాగుతున్నాడు.

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన అఖిల్‌ ఉన్నత చదువులు చదువుకున్నాడు. అయితే ఒకరి కింద ఉద్యోగం చేయడం ఇష్టంలేని అఖిల్ సొంతంగా పలు వ్యాపారాలను చేస్తూ వచ్చాడు. అఖిల్ తండ్రి నగేష్‌ రైతు. ఈయన ఏళ్లుగా పంటలు సాగు చేసిన నైపుణ్యం ఉన్నా పెద్దగా రాణించలేకపోయారు. సరైన ఆదాయం లేక అలసిపోయారు. తన తండ్రి బాధను అర్థం చేసుకున్న అఖిల్‌ వినూత్నంగా ఆలోచించి గాడిదల ఫామ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాడు. దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఉన్నటువంటి గాడిద ఫామ్‌లను నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన వాటి పాలను విక్రయించి ఆదాయం పొందాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి అనుభవాలు కూడా తోడవ్వడంతో బిజినేపల్లి మండల కేంద్రంలో పొలాన్ని లీజుకు తీసుకొని 50 గాడిదలను పెంచుతున్నారు.

గాడిదల పాలను ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో.. కాస్మోటిక్ సబ్బుల తయారీలో వినియోగిస్తారు. వీటిని తయారు చేసే కంపెనీలు గాడిద పాలు సేకరించే ఏజెన్సీల ద్వారా అంతర్జాతీయంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏజెన్సీలు గాడిద పాలను ఉత్పత్తిచేసే వ్యాపారులతో ఒప్పందం చేసుకొని, లీటరుకు ఇంతా అని చెల్లిస్తాయని అఖిల్ తెలిపాడు. రోజుకు ఒక గాడిద అర లీటరు నుంచి లీటరున్నర వరకు పాలు ఇస్తాయని చెబుతున్నాడు. ఖర్చులు పోను లాభదాయకమైన ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపాడు. తెలంగాణలో ఇదే మొదటి ఫామని, దేశవ్యాప్తంగా ఉన్న మూడు ఫామ్‌లలో తమది ఒకటని తెలిపాడు.

ఐదు ఎకరాల్లో విస్తరించిన ఈ ఫామ్‌లో ప్రస్తుతం 64 గాడిదలు ఉన్నాయి. 5 ఫ్రెంచ్ గాడిదలను పెంచుతున్నారు. ఈ గాడిదల నుంచి ప్రతి రోజు 15 లీటర్ల పాల ఉత్పత్తిని సాధిస్తున్నారు. ఎలాంటి కల్తీ లేకుండా చుక్కనీరు కూడా చేరకుండా సురక్షిత పద్ధతుల్లో గాడిదల నుంచి పాలను తీస్తూ వాటిని భద్రపరుస్తున్నారు. గాడిదలకు అందించే దానా కోసం ప్రత్యేకంగా 12 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని ఒక్కో ఎకరంలో ఒక్కోరకం గ్రాసాన్ని పెంచుతున్నారు. ఈ ఫామ్‌ను పూర్తిగా విదేశీ మోడల్‌లో డిజైన్ చేశారు. 9 రకాలుగా పొలాన్ని విభజించి గాడిదల ఎదుగుదల క్రమాన్ని బట్టి వాటిని విడదీసి జాగ్రత్తగా పెంచుతున్నారు. పాల ఉత్పత్తి, గాడిదల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు పశు వైద్యాధికారి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు.

అంతర్జాతీయంగా గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. అలాగని మార్కెట్ చూసుకోకుండా పెంపకంవైపు అడుగులు వేయకూడదని అఖిల్ తండ్రి నగేష్ తెలిపారు. ఫామ్ ఏర్పాటు చేసేముందు సుమారు 8 నుంచి 9 నెలలు దేశంలోని అనేక రాష్ట్రాలను సందర్శించి సాగు గురించి అఖిల్ అవగాహన పెంచుకున్నాడని తెలిపారు. గాడిదల పెంపకంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారన్నారు. అవగాహన లేమితో అడుగులు వేస్తే ఇబ్బందులు తప్పవని సూచించారు.

ఈ యువరైతు చేస్తున్న గాడిదల పెంపకం గురించి తెలుసుకుని చుట్టు పక్కన రైతులే కాకుండా ఇతర రష్ట్రాల వారు సైతం పెద్ద సంఖ్యలో ఈ ఫామ్‌ను సందర్శిస్తున్నారు. పెంపకం గురించిన వివరాలను రైతును అడిగి తెలుసుకుంటున్నారు. గాడిదల పాలకు మార్కెట్‌లో డిమాండ్ ఉందని ఈ పరిశ్రమతో స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని సందర్శకులు చెబుతున్నారు. ప్రస్తుతం అఖిల్ చేస్తున్న ఈ గాడిదల ఫామ్‍ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తుంది. రోజు రోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. మరి తెలంగాణోలో మొదటి గాడిదల ఫామ్‍ ను ఏర్పాటు చేసిన అఖిల్ రానున్న రోజుల్లో ఎలాంటి ప్రగతి సాధిస్తాడో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories