Cattle Care: పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంటుంది.
Cattle Care: పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంటుంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాలం , వాతావరణాన్ని బట్టి మనుషుల లాగే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశుపోషకలు అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే వ్యాధులను గుర్తిస్తే నివారణ సులభమవుతుంది. మరి వర్షాకాలంలో పశువుల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు మనుషులకే కాదు మూగజీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. ఎప్పుడు కాటేద్దమా అనుకుంటూ అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి. ఇదే సమయంలో పశుపోషకులు కలవరపడుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు ప్రబలడంతోపాటు ఈగలు, దోమల దాడి సైతం పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని, పశువులకు వైద్య చికిత్సను అందించాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
వ్యాధి ప్రబలిన పశువును వెంటనే మంద నుండి వేరుచేయాలి. దాని మల మూత్రాలను, అది తినగా మిగిలిన గడ్డిని తీసి కాల్చేయాలి. పశువుల పాక లేదంటే షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వ్యాధి ప్రబలిన పశువు మరణిస్తే ఊరికి దూరంగా తీసికెళ్లి, గొయ్యి తవ్వి, అందులో సున్నంవేసి పూడ్చేయాలి. గురక వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే పశు వైద్యుడి సలహా మేరకు పశువుకు గ్లూకోజ్, యాంటి బయటిక్ మందు, నొప్పి నివారణ మందు ఇవ్వాలి. ఎంత త్వరగా వైద్యం చేయిస్తే పశువు అంత త్వరగా కోలుకుంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేసినా ఫలితం ఉండదు.
గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాలా బలహీనంగా ఉంటుంది. పాలు ఇచ్చే గేదేలు చాలా నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. ఎడ్లు వ్యవసాయం పనులు చేయడానికి సాహసించవు. సంకరజాతి పశువులతోపాటు షెడ్‌లలో పెంచుకొనే పశువులకు ఈవ్యాధి వ్యాపి స్తుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈవ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం ద్వారా పశువులు మేత, తీసుకోక నీరసించిపోతాయి. నోటి నుండి సొంగ కారుతుంది.
వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన పశువుల్లోనూ, తెల్లజాతి పశువుల్లోనూ జబ్బువాపు వ్యాధి ఎక్కువగా కన్పిస్తుంది. వ్యాధిసోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయకుండా పడుకొని ఉంటుంది. జబ్బ భాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి పశువు తీవ్రమైన నెప్పితో బాధపడుతుంది. వాచిన చోట చేతితో తాకితే గరగరమని శబ్దం వస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. వ్యాధి సోకిన పశువుకు పశు వైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ మందు ఇవ్వాలి. నెప్పి, జ్వర నివారణ మందులతోపాటు రక్తనాళాల ద్వారా గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. గురక, జబ్బ వ్యాధులు సోకకుండా రైతులు ముందుగానే పశువులకు టీకాలు వేయించడం మంచిది.
వర్షాకాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువుకు అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. పశువు మేత మేయదు. గొంతుపైన, మెడ కింద వాపు కన్పిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుండి ద్రవం కారుతుంది. పశువు వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంటుంది. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ, చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లిచనిపోతుంది.
తొలకరి వర్షాలకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు ఆబగా తింటుంటాయి. అయితే ఎదిగి ఎదగని లేత గడ్డిలో హైడ్రో సైనైడ్ విష పదార్థం ఉంటుంది. ఇలాంటి గడ్డిని మేసిన 15 నిమిషాలకే పశువులో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే పశువు మత్యువాత పడే ప్రమాదముంది. కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకూ పచ్చిక బయళ్లలో పశువులకు లేతగడ్డిని అతిగా మేపకుండా ఉండడమే మంచిది.
నేల చిత్తడిగా, వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో, నీరు నిల్వ ఉన్న గుంతల్లో, మురుగునీటి కాలువల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పాటు చేసు కుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులను పట్టి పీడిస్తుంటాయి. వర్షాకాలంలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈగలు, దోమలు పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. వీటి తాకిడి కారణంగా పశువులు పడుకోలేవు. నిలబడలేవు. వాటిని వదిలించుకోవడానికి తోకను అటూఇటూ కొట్టు కుంటూ, చెవులు ఊపుతూ అసహనానికి గురవు తాయి. కడుపునిండా మేత మేయలేవు. ఫలితంగా పశువులు రక్తహీనతకు లోనవుతాయి. ఈగలు, దోమ కాటు వల్ల పశువు శరీరంపై పుండ్లు పడతాయి.
ఈగలు, దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్‌ను పిచికారీ చేయాలి. మురుగు నీరు చేరే చోటును, చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగ పెట్టాలి. వైద్యుల సలహా మేరకు పశువు శరీరంపై కీటక నాశనులను పిచికారీ చేయాలి. సాయంకాలం వేళ పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. సీజన్‌కి తగ్గట్టుగా టీకాలు వేయించాలి, బయట మురుగునీరు ఎక్కడపడితే అక్కడ తాగించకూడదు. శుభ్రమైన నీటినే తాగించాలి. యేడాదికి నాలుగుసార్లు డీపీఆర్ నట్టల నివారణ మందులు వేయించాలి. పశువుల షెడ్లు, పాకలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire