ఉపాధ్యాయ వృత్తిని వీడి ఆహార స్వరాజ్యం దిశగా అడుగులు

Bull Driven Oil Business
x

ఉపాధ్యాయ వృత్తిని వీడి ఆహార స్వరాజ్యం దిశగా అడుగులు

Highlights

Bull Driven Oil: గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన క్రమంలో ముఖ్య భూమిక పోషించే కొన్ని అంశాల్లో ఎద్దు గానుగ ఒకటి.

Bull Driven Oil: గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన క్రమంలో ముఖ్య భూమిక పోషించే కొన్ని అంశాల్లో ఎద్దు గానుగ ఒకటి. స్వాతంత్య్రానికి పూర్వం మన గ్రామాల్లో గానుగలు విరివిగా ఉండేవి. క్రమేణా యాంత్రీకరణ, కేంద్రీకృత వ్యవస్థ అమల్లోకి రావడంతో గానుగలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బజారులో రంగు, రుచి, వాసన, పోషకాలు పుష్కలంగా ఉండే మంచి నూనెలు దొరకడం గగనం అయ్యింది. అందుకే తమ వంతుగా స్వచ్ఛమైన నూనెలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో యువకులు గానుగ నూనే తయారీవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి కోవకే వస్తారు మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్ మండలం, జక్లపల్లి గ్రామానికి చెందిన బసవరాజు, శ్రీనివాస్‌ రెడ్డిలు. ఓ ప్రైవేటు పాఠశాలలో చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వీడి మూడేళ్లుగా గానుగ నూనెలను ఉత్పత్తి చేస్తూ స్వచ్ఛమైన నూనెలను వినియోగదారులకు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

నువ్వులు, వేరుశనగ, కుసమ, కొబ్బరి, ఆవాలు, గడ్డినువ్వులు, నూపప్పు వంటి ఎనిమిది రకాల నూనెలను ఉత్పత్తి చేస్తున్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ సంబంధిత నూనెలైన వేప, విప్ప, కానుగ నూనెలు ఉత్పతి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజు మూడు బ్యాచుల చొప్పున నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక గానుగ నుంచి 15 నుంచి 18 లీటర్ల నూనెను ఉత్పత్తి చేస్తున్నామని బసవరాజు తెలిపారు. నెలలో ఒక గానుగతో 450 నుంచి 500 లీటర్ల నూనె ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఇలా ఒక గానుగ నుంచి వంద కుటుంబాలకు నూనె ఇవ్వగలమన్నారు రైతు. ప్రస్తుతం వీరి దగ్గర 6 గానుగలు ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను పదికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు బసవరాజు.

నూనె తీసేముందు, తీసిన తరువాత, ప్యాకింగ్‌లోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ యువ రైతులు. గానుగ తయారీ కోసం దిర్శినం చెట్టును వినియోగిస్తున్నారు. ఏడు పీట్ల చుట్టు కొలత , ఏడు ఫీట్ల పొడువు ఉన్న చెట్టుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గానుగాడేందుకు ఉపయోగపడే రోకలి, కొంకిమాను, వీపుమానును దిర్శినం చెట్టు నుంచే తయారు చేసుకుంటున్నారు. దిర్శినం చెట్టుతో తయారు చేసిన గానుగలో ఆడటం వల్ల ఆ నూనెలో ఔషధగుణాలుంటాయంటున్నారు రైతులు. ఎద్దుపై ఎలాంటి ఒత్తిడి లేకుండా గానుగను ఏర్పాటు చేసుకున్నామని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఎద్దుగానుగ తయారు చేసుకోవాలంటే లక్ష 30 వేలు వరకు ఖర్చు అవుతుందంటున్నాడు శ్రీనివాస్‌. దీనితో పాటు ఒక షెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. షెడ్డుకు కోసం 80 వేల ఖర్చవుతుందన్నారు. మొత్తంగా ఒక యూనిట్ పెట్టుకునేందుకు 2 లక్షల 80 వేల ఖర్చు అవుతుందని తెలిపారు. ఇదే కాకుండా నెలకు లక్షా 50 వేల ముడి సరకు ఖర్చు ఉంటుంన్నారు. నెలకు ఎంతలేదన్నా 450 లీటర్ల 500 లీటర్ల నూనె ఉత్పత్తి అవుతుందని దాని ద్వారా లక్షా 50 వేల ఆదాయం వస్తుందన్నారు. నూనె మాత్రమే కాకుండా నూనె ఆడగా వచ్చే చెక్క నుంచి గో వ్యర్ధాలతో తయారు చేసిన ఎరువుల నుంచి అదనపు ఆదాయం లభిస్తోందని. అది లాభదాయకంగానే ఉందని రైతులు చెబుతున్నారు.

కట్టె గానుగలు తిరగడానికి విద్యుత్తు అవసరం లేదు. ఎంత మారుమూల గ్రామంలో అయినా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎద్దు గానుగలు గ్రామంలో ఉంటే.. అక్కడి పశు సంపద వృద్ధి జరగడంతో పాటు గ్రామంలోనే ఎక్కడి వారు అక్కడే ఆరోగ్యదాయకమైన వంట నూనెలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నూనె అందించవచ్చు. ఆ దిశగా సాగుదారులు తిరిగి మూలాలవైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నామం.


Show Full Article
Print Article
Next Story
More Stories