అనంతలో సిరులు కురిపిస్తున్న వక్క పంట

అనంతలో సిరులు కురిపిస్తున్న వక్క పంట
x
Highlights

ఒక్క సారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడినిస్తుంది వక్క తొట సాగు. తక్కవ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో అధిక...

ఒక్క సారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడినిస్తుంది వక్క తొట సాగు. తక్కవ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో అధిక మొత్తంలో ఆదాయం ఘడించవచ్చు. ఆ విధంగానే దశాబ్ధాలుగా కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గంలో వక్క తోటను సాగు చేస్తున్నారు అనంతపురం జిల్లా రైతులు. సుమారు 10 వేల ఎకరాలల్లో సాగవుతున్న వక్క తోటలపై ప్రత్యేక కథనం.

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం, అగళి, రొళ్ల మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లో దశాబ్ధాలుగా వక్క తోటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా ఎండలు ఉన్నప్పటికీ కర్ణాటకకు సరిహద్దుగా ఉండడం వాతావరణంలో వేడి తక్కువగా ఉండడంతో రైతులు ముందు నుంచి నియోజకవర్గంలో వక్క తోటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాలల్లో వక్క తోటలు సాగవుతున్నాయి. అమరాపురం, రోళ్ల మండలాల్లో అత్యధికంగా రైతులు ఈ పంటనే సాగు చేస్తున్నారు. ఒక్క ఎకరం పొలంలో 450 నుంచి 500 వక్క చెట్లను నాటుతున్నారు. ఐదేళ్ల వరకూ వక్క పంట చేతికి రాదు. ఐదేళ్ల నుంచి ఏటా ఒక్క పంట చేతికి వస్తుంది. ఎకరాకు ధరలు బాగుంటే రూ రెండు నుంచి మూడు లక్షల వరకూ రైతులు ఆదాయం ఉంటుంది.

ఒక్క చెట్టు నుంచి గరిష్టంగా 100 కేజీల వరకు పచ్చి వక్క కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని నుంచి 30 శాతం వరకూ వక్క వస్తూంది. మార్కెట్ లో ధరలు పెరుగుదల ఉంటే మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి భూమిలో నాటే వక్క చెట్లకు ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడాల్సిన అవసరం లేదు. సేంద్రీయ ఎరువలు ఏడాదికి ఒక్క సారి మాత్రమే వేస్తారు. డ్రిప్ ద్వారా సరిపడా నీరు వదులుతారు. వక్క కాయలు పక్వానికి వచ్చిన సమయంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే పని ఉంటుంది, మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాలి. పెట్టుబడి తక్కువగా ఉండడం అధిక లాభాలు వస్తూండడంతో వక్క తోటల సాగు నానాటికీ పెరుగుతోంది.

కొందరు రైతులు వక్క తోటల నర్సరీలను పెంచుతున్నారు. రైతులే తాము పండించిన వక్క కాయలను ప్రాసెసింగ్ చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. పచ్చి కాయల నుంచి పీచు వేరుచేసిన అనంతరం వేడి నీటిలో సుమారు గంటన్నర వరకూ కాయల నుంచి వేరు చేసిన వక్క ను ఉడికిస్తారు. అనంతరం వారం, పది రోజులు ఆరబెట్టడంతో అది వక్క గా మారుతుంది.

కొన్నేళ్లుగా ఇదే పంటలు సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడులు వస్తున్నాయని లాభాలు గడిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పిస్తే మరింతగా పంటల సాగుక అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వక్క కాయల పీచు తొలిచే యంత్రాలు సహా వ్యవసాయ పరికరాలు ప్రభుత్వం రాయితీతో సరఫరా చేయాలని కనీస మద్దతు ధర వంటివి కల్పించాలని కోరుతున్నారు. వక్క తోటలు ముమ్మరంగా సాగు చేస్తున్నప్పటికీ మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తున్నాయి ఇక్కడి రైతులకు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వక్క రైతులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి, రాయితీపై యంత్రాలను విరివిగా సరఫరా చేయాలని కోరుతున్నారు.

ఈ ప్రాంతంలో రైతులు వక్క ను పండిస్తున్నప్పటికీ సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో పక్క రాష్ట్రాల పై ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో వక్క మార్కెట్ లేకపోవడంతో రైతులు కర్ణాటక లోని శిర, హిరియూర్, చిత్ర దుర్గం వంటి మార్కెట్లకు వెళ్లి పంట అమ్ముకుంటున్నారు. తోటల వద్దకే పలువురు వ్యాపారుల వచ్చి సరకు కొనుగోలు చేస్తున్నా చాలా మంది దళారులు, వ్యాపారులు మోసం చేస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంత రైతులకు రూ. 3 కోట్ల వరకూ వ్యాపారులు సరకు తీసుకెళ్లి మోసం చేశారని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వక్క రైతులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి, రాయితీపై యంత్రాలను విరివిగా సరఫరా చేయాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories