కర్ణాటక యువ దంపతులు..చేస్తున్నారు వ్యవసాయంలో మేజిక్!

కర్ణాటక యువ దంపతులు..చేస్తున్నారు వ్యవసాయంలో మేజిక్!
x
Highlights

వ్యవసాయంలో కొత్త పద్ధతులల్తో రైతులకు మేలు చేయవచ్చనే ఆలోచనతో తమ ఉద్యోగాల్ని వదిలి పెట్టి ఆక్వాపోనిక్ రంగం లో కృషి చేస్తున్న కర్ణాటక యువజంట!

ఒక చేపల తొట్టె.. దానిపై పచ్చని మొక్కలు.. ఇది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.

ఒక పచ్చని తోట.. చక్కగా పెరిగిన పళ్ళ చెట్లు.. కనిపించని బోర్ వెల్స్ కానీ, తోటలో అక్కడక్కడ నీటి చెలమలు.. ఎలా? చూస్తే అబ్బురమనిపిస్తుంది.

ఈ ఆశ్చర్యాలకు, అబ్బురాలకూ మధ్య ఓ యువ జంట కృషి వుంది. అదిప్పుడు అన్నదాతలకు ఆసరా అవుతోంది. ప్రకృతి ప్రేమికులకు ముచ్చట కలిగిస్తోంది. మరి ఆ యువ జంట కథేమిటో చూద్దామా!

ఇంజనీరింగ్ చదవాలి.. అదీ సాఫ్ట్ వేర్ అయితే ఇంకా మంచిది.. మంచి కార్పోరేట్ ఉద్యోగం పట్టేయాలి.. నెల నేలా లక్షలాది రూపాయల్ జీతం కొట్టేయాలి.. లైఫ్ అంతా జాలీగా గడిపేయాలి! ఇవే ఇప్పటి కుర్రకారు కలలు. సామాజిక బాధ్యత వంటి పదాలు చాలా మందికి ఫేస్ బుక్ కి పనికి వచ్చే కొటేషన్లు మాత్రమే. ఇక వ్యవసాయం.. పల్లెటూరు ఇటువంటి విషయాలైతే సరదాకోసం అప్పుడప్పుడు మాట్లాడుకునే మాటలు అంతే! కానీ, వారికి మాత్రం అలా కాదు. ఉన్నత చదువులు చదివినా.. సిటీలోనే పెరిగినా.. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అంటే గౌరవం. నేలతల్లి అంటే మమకారం. ఇద్దరిలోనూ ఉన్న ఆ సారూప్య భావమే చదువుకునే సమయంలోనే ఇద్దరినీ ఒక్కటి చేసింది. తరువాత వివాహమైనా తమ ఆశయాల ఊసుల్ని ఊరంతా చెప్పుకునేలా కాదు..ప్రపంచం చెప్పుకునేలా నిజం చేసుకోవలానే తపనకు మెరుగులు దిద్దుకునే ప్రయాణం విజయాల బాటలోకి నడిచేలా చేసింది.

కర్నాటక రాజధాని బెంగళూరు. కార్పోరేట్ ఉద్యోగులు తమ కలలు నెరవేరతాయని భావించే నగరం. ఆ నగరంలో తమకున్న మంచి ఉద్యోగాల్ని కూడా వదిలేసి ఆధునిక సేద్యం వైపు మళ్లారు అజ్లాం షాకిబ్, ఆమినా ఇమాన్ జంట. వ్యవసాయం అంటే ఇద్దరికీ చిన్నప్పటినుంచీ ఉన్న ఆసక్తి.. వారి వివాహబంధంతో మరింత బలపడింది. లక్షలాది రూపాయలు సంపాదించే ఉద్యోగాల్లో ఉన్నా వారిని కుదురుగా ఉండనీయలేదు. దాంతో వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టారు.

ఏం చేయాలి?

వారిద్దరి ఆలోచనా ఒక్కటే. ఆధునిక పద్ధతుల్లో సేద్య విధానాలను అందరికీ పరిచయం చేయాలి. అదీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం వచ్చే విధంగా.. నగరజీవులు కూడా సులభంగా తమకు కావలసిన వాటిని తామే పండించుకునే విధంగా కావలసిన విధానాలు రూపొందించాలి. ఇదే ఆలోచన. కానీ, ఎలా మొదలెట్టాలి? అసలు ఎక్కడ మొదలెట్టాలి? ఏం చేయాలి? అన్నీ ప్రశ్నలే. వాటి సమాధానాల కోసం వారుద్దరూ ఎన్నో ప్రయాసలు పడాల్సి వచ్చింది.

రైతులు మన కోసం చాలా త్యాగాలు చేస్తారు. మన కోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. కానీ, వారు ప్రస్తుతం తమ పొలాలను విడిచిపెట్టి స్థిరమైన ఆధారం కోసం నగరాలకు వలస వెళ్ళిపోవడం నేను చూశాను. అప్పుడే వ్యవసాయ సంబంధిత విషయాలపై పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నిజానికి మా ఇద్దరికీ వ్యవసాయ సంబంధిత శిక్షణ ఏదీ లేదు.. మా ఇద్దరిలో ఎవరికీ వ్యవసాయ నేపధ్యం కూడా లేదు. కానీ, రైతుల ప్రస్తుత పరిస్థితి మా ఉద్యోగాలను వదిలిపెట్టి ఇటువైపుకు వచ్చేలా చేసింది అని చెబుతారు అజ్లాన్.

అంత సులువు కాదు..

మొదట్లో వారిద్దరూ తమ ఉద్యోగాల్ని వదిలి వ్యవసాయం గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2014 లో 'డిజైన్ హౌస్' పేరుతొ ఓ చిన్న కంపెనీ మొదలు పెట్టారు. అదిప్పుడు ''హమ్మ్ఆఫ్ ది ఎర్త్'' గా రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో వారిద్దరూ చాలా పరిశోధనలు చేశారు.. ఏంతో నేర్చుకున్నారు. వ్యవసాయంలో ఆధునిక విధానాల గురించి ఎంతో వెతికారు. మొదట వారు చేసింది సులభంగా మొక్కల్ని పెంచ గలిగే విధానాలు ఏముంటాయనే విషయంపై కూలంకష పరిశోధనలు చేశారు. అంటే తక్కువ నీరు ఉపయోగించి ఎలా వ్యవసాయం చేయొచ్చు అనే విధానాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వారికి ఆక్వాపోనిక్స్, పెర్మాకల్చర్ అంశాలు తాము అనుకునే విధానాలకు దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. దాంతో ఆ దిశలో వారు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు.

ఆక్వాపోనిక్స్ అంటే మట్టి లేకుండా కేవలం చేపలు వదిలిన విసర్జాలు ఉన్న నీటిని ఉపయోగించి మొక్కలు పెంచడం. ఇదే క్రమంలో ఆ నీటిని మొక్కల వేర్లు శుభ్రపరుస్తాయి. ఆ నీటిని చేపల కోసం ఉపయోగించడం. ఇక, పెర్మా కల్చర్ అంటే ప్రకృతిలో లభించే వాటిని ఉపయోగించుకుని, సహజ పర్యావరణ వ్యవస్థను అనుసరిస్తూ చేసే వ్యవసాయం.

ఈ రెండు విధానాలు తమకు సరిపోతాయని నిర్నయిన్చుకున్నాకా వాటిపై శిక్షణ తీసుకున్నారు. ఆక్వా ఫోనిక్స్ కు సంబంధించి ముర్రే హల్లాం వద్ద, పెర్మా కల్చర్ కు సంబంధించి జెఫ్ లాటన్ వద్ద మూడు నెలల పాటు వీరు శిక్షణ పొందారు. మా జీవితంలో ఇది చాలా కష్టమైన సమయం. ఉద్యోగాన్ని వదిలి ఇటువంటి పనులు చేస్తున్నామని బంధువుల నుంచి ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నిటినీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సమయంలో మేమిద్దరం ఒకరికి ఒకరు తోడుగా నిలిచాం అంటూ తమ ప్రయాణంలో ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు అజ్లాన్.

చేపల విసర్జితాలు ఉన్న నీటితో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం..

ఈ విధానంలో తక్కువ ప్రాంతంలో.. పర్యావరణ హితంగా ఇటు ఇంట్లో అందంగా ఉండే చేపల్ని పెంచుతూ, అటు ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకోవచ్చు. దీనికోసం మేము బెంగళూరు లోని మా ఇంటి పైభాగంలో చేపల తొట్టె ఏర్పాటు చేశాం అని చెప్పారు అమీనా. 2014 లో ఇది జరిగింది. దంపతులు ఇద్దరూ కల్సి మొదట ఈ ప్రయోగం తమ ఇంటిలో చేశారు. చేపల తోట్టిలోని నీటిని తొట్టి పైభాగంలో ఏర్పాటు చేసిన మొక్కల తొట్టికి పంపిస్తారు. ఆ మొక్కల వేర్లు చేపల వ్యర్థాలను తీసుకుని దానిలోని నైట్రోజన్ గ్రహించి పెరుగుతాయి. ఈ క్రమంలో ఆ నీరు పరిశుభ్రమౌతుంది. తిరిగి ఆ నీరు చేపల తొట్టిలోకి చేరుతుంది. ఇలా రెండు పర్యావరణాల మధ్య నీరు మాధ్యమంగా ఉండి ఇటు చేపలను, అటు మొక్కలను బతికిస్తుంది. ఈ విధానంలో వారు తమటా, పాలకూర, గోధుమ గడ్డి వంటి వాటిని విజయవంతంగా పండించారు.


ఈ రీసైక్లింగ్ విధానం ద్వారా మొక్కలు పెంచడానికి అవసరమయ్యే 90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. అదేవిధంగా చేపల ట్యాంక్ ను శుభ్రపరచాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదంతా ఆటోమేటిక్ విధానంలో జరిగిపోతుంది. దీనితో మనకిష్టమైన కూరగాయల్ని మన ఇంటిలో తక్కువ ప్రదేశంలోనే పండించుకోవచ్చు అని చెప్పారు అజ్లాం.

ఇక ఈ విధానంలో వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకూ ఖర్చు పెట్టి కావలసిన మొక్కల్ని పెంచుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరి ఆర్ధిక స్థోమత బట్టి వారికెంత ఖర్చులో కావాలంటే అంత ఖర్చుతో కూరగాయల్ని పెంచుకునేలా మేం సహాయపడతాం. ఇది చాలా సులువైన విధానం. స్కూలు పిల్లలు కూడా చిన్న బియ్యపు పెట్టెలో కూరగాయల్ని పెంచేసుకోగాలుగుతాడు. మేము ఈ విధానం ఎవరికైనా అవసరం అని చెబితే, వారికి చేపల తొట్టి ఏర్పాటు చేసి మొక్కలను పెంచుకునే బెడ్ తాయారు చేసి దాని విధానాల్ని వివరిస్తాం అని చెప్పారు అమీనా.

2015 నుంచి వారు తమ వినియోగదారులకు సేవలు అందించడం ప్రారంభించారు. త్వరలోనే వీరి సేవలు వ్యక్తిగత ఖాతాదారుల నుంచి స్కూళ్ళు, రెస్టారెంట్ ల వరకూ విస్తరించాయి. ఇదే సందర్భంలో మేము వర్టికల్ సిస్టం కూడా అభివృద్ధి చేశాము దీనిలో 40 కి పైగా కూరగాయల్ని తక్కువ ప్రదేశంలో పెంచే అవకాశం ఉంటుంది అంటూ చెప్పారు అజ్లాం.

వీరిరువురి అతి పెద్ద విజయం పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య పరమైన కూరగాయల తోటను ఏర్పాటు చేయడం. బెంగళూరు లోని ఓ రిసార్ట్స్ కోసం ''ది ఈట్ నీట్ ప్రాజెక్ట్'' కోసం దీనిని వారు డిజైన్ చేసి ఇచ్చారు. అదిప్పుడు ప్రఖ్యాతి పొందింది.

దీంతో అజ్లాన్, అమీనా దంపతులు ఇప్పుడు నగరంలోని ప్రజలకు ఆక్వా పానిక్స్ విధానం పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు.

అక్కడితో ఆగిపోలేదు..

ఈ దంపతుల ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు. ఐదేళ్ళ విజయవంతమైన ప్రస్థానం తరువాత వీరు పల్లె బాట పట్టారు. రామనగర దగ్గరలో ఉన్న హరోహళ్లి గ్రామం వద్ద తొమ్మిది ఎకరాల స్థలం లీజుకు తీసుకుని పెర్మా కల్చర్ ఫాం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫుడ్ ఫారెస్ట్ పెంచుతున్నారు. ఇందులో మామిడి, కొబ్బరి, సీతాఫలం, జామ, సపోటా ఉసిరి, చేర్రీస్, మునగ వంటి చెట్లను పెంచుతున్నారు.


కనీసం బోర్ కూడా లేకుండా తోటనే పెంచేస్తున్నారు...

కర్నాటక ధార్వాడ్ జిల్లాకు చెందిన మామిడి తోట ఉంది. అందులో ఆయన జామ, సీతాఫలం వంటివి కూడా పెంచుతున్నారు. నిజానికి మూడేళ్ళ క్రితం ఆ భూమి అలా ఉండేది కాదు. నీళ్ళు లేక భూమి అంతా ఎండిపోయి ఉండేది. జస్ట్ మూడేళ్ళలోనే ఆ భూమి పచ్చని తోటగా మారిపోయింది. ఇదంతా అజ్లాన్ అమీనా దంపతుల మహత్యమే.

ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ఆ భూమిలో తోట పెంచాలనుకుంటే కనీసం వందేళ్ళు పట్టేది. పెర్మాకల్చర్ తో ఆ సమయం నాలుగు నుంచి ఐదేళ్లకు తగ్గిపోయింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాన్ని దీనితో పొందవచ్చు అంటున్నారు అజ్లాన్. ఈ విధానంలో బోర్ వెల్ తో కానీ, నీటి పారుదల విధానాలతో కానీ పనిలేదని అయన చెబుతున్నారు.

సాధారణంగా ఎక్కడన్నా తోట పెంచాలంటే, మొదట విత్తనాలు నాటడం చేస్తారు. కానీ, ఈ విధానంలో నీటిని నాటుతారు. అంటే.. ప్రకృతి నుంచి జాలువారుతున్న నీటిని ఒడిసి పట్టుకుని నిలువ చేసి ఆ నీటిని మొక్కల పెంపకానికి వాడుతారు. ఈ విధానం లో వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని ఆ నీటిని చెట్ల పెంపకానికి వాడతారు. ఇలా ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటూనే తోటల పెంపకాన్ని సాధించారు.

ఇన్ని విజయాలు సాధించిన ఈ దంపతులు ఇక్కడితో ఆగిపోవడం లేదు. తాము కృషి చేస్తున్న వ్యవసాయ పద్ధతుల్ని మరింత మెరుగు పరచి అందరికీ అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. పెద్ద చదువులు చదివీ..అన్నదాత మీద మమకారంతో వ్యవసాయాన్ని భుజాన మోయడానికి ప్రయత్నిస్తున్న వీరి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆశిద్దాం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories