Fruits Cultivation: ఏపీ ఉద్యాన శాఖ సరికొత్త ప్రయోగం

AP Horticulture Department Over Fruits Cultivation
x

ఏపీ ఉద్యాన శాఖ సరికొత్త ప్రయోగం 

Highlights

Fruits Cultivation: ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల ఆర్ధికాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యాన శాఖ వినూత్న ఆలోచనకు తెరలేపింది.

Fruits Cultivation: ఉద్యాన పంటలు సాగు చేసే రైతుల ఆర్ధికాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యాన శాఖ వినూత్న ఆలోచనకు తెరలేపింది. రైతులు పండించే ప్రతి ఉత్పత్తికి గిట్టుబాటు కల్పించేందుకు ప్రయోగాత్మకంగా రూరల్ మార్కెటింగ్ యూనిట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా సాగయ్యే మామిడి సహా జామ, బొప్పాయి, అరటి తదితర పండ్ల నాణ్యత పెంచడంపై రైతులకు ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ రూరల్ మార్కెటింగ్ యూనిట్లు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఉద్యానాధికారులు భావిస్తున్నారు. అంతే కాదు పండ్ల నాణ్యత పెరగడంతో పాటు మంచి ధర రైతులకు లభిస్తుందంటున్నారు.

ఏటా పండ్ల తోటలను సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. పండిన పండ్లలో నాణ్యత కూడా కొరవడటంతో తక్కువ ధరకే పంటను విక్రియించక తప్పడం లేదు. ఇదే అదనుగా దళారులు అయినకాడికి ధరను తగ్గిస్తూ రైతులను దగా చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఉద్యానాధికారులు ఇటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు తాజా నాణ్యమైన పండ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూరల్ మార్కెటింగ్ యూనిట్‌ ఏర్పాటును తెరముందుకు తీసుకువచ్చారు. తొలి యూనిట్‌ను జిల్లాలోని విసన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో నెలకొల్పాలనుకున్నారు. జాతీయ రహదారి చేరువలో ఇందుకు అవసరమైన స్థలాన్ని కూడా ఎంపిక చేశారు.

ఒక్కొక్క రూరల్ మార్కెటింగ్ యూనిట్‌కు సుమారు 25 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. యూనిట్లను రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడిలో 75 శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. ఎఫ్‌పీఓలు మిగిలిన సొమ్ము సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పెట్టుబడి పెడితే తరువత ప్రభుత్వం రాయితీ సొమ్మును రీయంబర్స్ చేస్తుందని అధికారులు అంటున్నారు. ఎఫ్‌పీఓల వాటా మొత్తాన్ని బ్యాంకులు రుణం ఇచ్చేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకసారి యూనిట్ ఏర్పాటు అయితే సంబంధిత రైతులే దీనిని నిర్వహిస్తారు.

రూరల్ మార్కెటింగ్ యూనిట్లలో మామిడి సహా ఇతర పండ్ల నాణ్యత పెంచడంపై రైతులకు ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించనున్నారు. ట్రేడింగ్ ఎలా చేయాలో మెలకువలను నేర్పుతారు. ఈ యూనిట్‌లలో ప్రాసెస్ చేసిన నాణ్యమైన పండ్లు కొనుగోలు చేసేలా చూస్తారు. ఆన్‌లైన్‌లోనూ ట్రేడింగ్ చేయిస్తారు. ఎగుమతులే కాదు యూనిట్ వద్దే ఓ కౌంటర్ సేల్ ఏర్పాటు చేసి రెడీ టూ ఈట్ సౌకర్యాలను కల్పించనున్నారు. పండ్లు అవసరమైన వారికి డోర్ డెలివరీ సదుపాయం కల్పించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ రూరల్ మార్కెటింగ్ యూనిట్ ప్రక్రియ చేపడితే వచ్చే మామిడి సీజన్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో అధికంగా మామిడి పంట ఉండటంతో ఎక్కువగా ఈ యూనిట్లు మామిడికి ప్రయోగిస్తారు. మామిడి సీజన్ పూర్తయ్యాక జామ, బొప్పాయి, నిమ్మ, అరటి వంటి ఇతర పండ్లకు వినియోగిస్తారు.

ఈ రూరల్ మార్కెటింగ్ యూనిట్లతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఉద్యానాధికారులు భావిస్తున్నారు. పండ్ల నాణ్యత పెరగడంతో మంచి ధర లభిస్తుందంటున్నారు. దళారుల బెడద తప్పుతుందని నాణ్యతకు అలవాటు పడితే రైతులు లాభపడతారంటున్నారు. ఇక ఈ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి త్వరలో ఎగుమతిదారులతో సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories