coronavirus: ముందుంది మంచికాలం.. కరోనాను జయించే దిశలో ప్రపంచం!

coronavirus: ముందుంది మంచికాలం.. కరోనాను జయించే దిశలో ప్రపంచం!
x
Representational Image
Highlights

ప్రపంచమంతా కరోనా నామస్మరణమే కనిపిస్తోంది..వినిపిస్తోంది. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ భయం నీడన చప్పుడు కాకుండా స్తంభించిపోయిన పరిస్థితి. చైనాలో పుట్టిన...

ప్రపంచమంతా కరోనా నామస్మరణమే కనిపిస్తోంది..వినిపిస్తోంది. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ భయం నీడన చప్పుడు కాకుండా స్తంభించిపోయిన పరిస్థితి. చైనాలో పుట్టిన మహమ్మారి మెల్లగా ప్రపంచాన్ని ఆవరించేసింది. ఇక మన దేశంలో ఆలస్యంగా తన ప్రభావాన్ని మొదలు పెట్టిన కరోనా ప్రస్తుతం మెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటికే మూడు కరోనా మరణాలు మన దేశంలో నమోదయ్యాయి. ఇక కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అదేవిధంగా దాదాపుగా అన్ని రాష్ట్రాలు ( ఏపీ మినహా) గట్టి చర్యలు మొదలు పెట్టాయి. తెలంగాణా లో స్కూళ్ళు..సినిమాహాళ్లు..మాల్స్ అన్నీ బంద్ అయ్యాయి. బార్లు రెస్టారెంట్లో మూత పెట్టారు. దాదాపుగా దేశవ్యాప్తంగా ఇలానే ప్రజలు గుంపులుగా ఉండే అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు.

సాధారణ పరిస్థితుల దిశగా చైనా..

కరోనా పుట్టిల్లుగా మారిన చైనా ఒక దశలో దాని ధాటికి చిగురుటాకులా వణికి పోయింది. వూహాన్ నగరం మొత్తం కరోనా మరణ మృదంగాన్ని మోగించింది. వందలాది మంది చనిపోయారు. వేలాది మంది కరోనా ప్రభావంతో అనారోగ్యం పాలయ్యారు. ఇది ముట్టుకుంటే చుట్టుకుపోయే లక్షణం ఉన్న వ్యాధి కావడంతో వూహాన్ నగరం పూర్తిగా మూసేశారు. అప్పటికప్పుడు ఆసుపత్రులు నిర్మించారు. వందలాది మంది వైద్య సిబ్బందిని మోహరించారు. కరోనాతో పెద్ద యుద్ధం చేసింది చైనా ప్రభుత్వం. దాంతో ఇప్పుడు చైనాలో పరిస్థితులు దారికి వస్తున్నాయి. శుభవార్త ఏమిటంటే.. గత రెండురోజులుగా చైనాలో ఒకే ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు అయింది. వందల కేసుల నుంచి ఒక్క కేసుకు.. అంటే దాదాపుగా చైనా కరోనా నుంచి బయట పడుతున్నట్టే. వూహాన్ లోని తాత్కాలిక ఆసుపత్రిలో ఇప్పుడు ఒక్క పేషేంట్ కూడా లేరు.

ఇప్పుడు చైనాలోని వుహాన్, హుబే ప్రాంతాల్లో తిరిగి వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. జనజీవనం మెల్లగా సాధారణ పరిస్థితులకు వస్తోంది.

ప్రపంచంలో కరోనాతో బాగా ఇబ్బంది పడ్డ చైనా, స్పెయిన్, ఇటలీ, ఇరాన్, అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పరిస్థితి మెల్లగా అదుపులోకి వస్తోందని చెబుతున్నారు. ఇక దక్షిణ కొరియాలో కొత్త కేసులు ఈ రెండు రోజుల్లోనూ నమోదు కాలేదని తెలుస్తోంది.

మందులు కనిపెట్టే దిశలో ముందడుగు..

కరోనా అంటే ఏమిటి? అని తలలు బద్దలు కొట్టుకునే స్థాయి నుంచి కరోనాను జయించడానికి అవసరమైన మందులను కనిపెట్టే దిశలో ప్రపంచ దేశాలు ముందడుగు వేస్తున్నాయి.

- ఇజ్రాయిల్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రూపొందించిండానీ, ట్రయల్స్ కూడా స్టార్ట్ చేసిందనీ చెబుతున్నారు.

- కెనడాలోని సైంటిస్టుల టీం ఒకటి త్వరలోనే కరోనాకు విరుగుడు మందు కంపెడతామని ప్రకటించింది.

- ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, శాన్ డియాగో కు చెందిన ఒక బయోటెక్ కంపెనీ సింగపూర్‌లోని డ్యూక్ యూనివర్శిటీ, నేషనల్ యూనివర్శిటీతో కలిసి వాక్సిన్‌ను డెవలప్ చేసినట్టు తెలుస్తోంది.

- హెచ్ఐవీ, మలేరియా మందుల్ని ఓ కాంబినేషన్‌తో వాడటం వల్ల కరోనా చికిత్సలో మంచి ఫలితాలు వస్తున్నట్టు ఆస్ట్రేలియా డాక్టర్లు చెబుతున్నారు.

- అదేవిధంగా కరోనా ను కొద్దీ గంటల్లోనే కనిపెట్టగలిగే ల్యాబ్ టెస్ట్ ను డెవలప్ చేసినట్టు చెబుతున్నారు. ఇక త్వరలోనే కరోనా సోకి బయటపడ్డ రోగుల నుంచి సేకరించిన ప్లాస్మాతో కరోనాను ఎదుర్కోగలిగే మందు కనిపెట్టే ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇది పెద్ద శుభవార్త గా చెప్పుకోవచ్చు.

ఇండియాలో పరిస్థితి ఇదీ..

మన దేశ రాజధాని ఢిల్లీలో ఏడుగురు పేషేంట్లకు విజయవంతంగా కరోనా నిర్వీర్యం చేసి డిస్చార్జ్ చేశారు. భారత దేశం కరోనా ను వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) మెచ్చుకుంటోంది. మన డాక్టర్లు Lopinavir, Retonovir, Oseltamivir, Chlorphenamine వంటి మందులతో కరోనా వ్యాధి గ్రస్తుల కు ఇస్తున్న ట్రీట్మెంట్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే మన దేశం కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు చాలా తీసుకుంది.

ఇక అన్నిటికంటే చెప్పుకోదగ్గ వార్త ఏమిటంటే.. కరోనా దెబ్బకు అతలాకుతలంగా మారిన ఇటలీ లోని పరిస్థితిని చక్కదిద్దడానికి చైనా ఈ వ్యాధితో పోరాడిన వుహాన్ వైద్యబృందాలు, నర్సులు, ఇతర స్టాఫ్‌ను అక్కడకు తరలించింది.

మొత్తమ్మీద కరోనా కొరడాను తట్టుకుని.. దాని పీచమణిచే దిశలో ప్రపంచం క్రమేపీ ముందడుగు వేస్తోంది. తాత్కాలికంగా ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డా, త్వరలో కరోనాను జయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది అందరికీ ఉపశమనం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories