కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పేరు. చైనాలో పుట్టి..తీవ్రంగా నష్టపరిచి.. మెల్లగా ప్రపంచాన్ని చుట్టి మన దేశంలోకి చొరబడింది. ఇప్పుడు మన...
కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న పేరు. చైనాలో పుట్టి..తీవ్రంగా నష్టపరిచి.. మెల్లగా ప్రపంచాన్ని చుట్టి మన దేశంలోకి చొరబడింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలని వణికిస్తోంది. మందే లేని వైరస్ గా.. ఒక్కసారి వస్తే మరణమే దిక్కన్నట్టుగా ప్రచారం వెల్లువెత్తుతోంది. దీంతో సహజంగానే సాధారణ ప్రజల్లో ఎన్నో అనుమానాలు. ఇంకా చెప్పాలంటే అయోమయం. సోషల్ మీడియా పుణ్యమా అని అదిగో పులి.. ఇదిగో తోక వంటి కథనాలు పరిస్థితిని మరింత ఆందోళన కరంగా చేస్తున్నాయి. మానవజాతి ఇటువంటి ఎన్నో వైరస్ లను చూసింది.. ఇంతకు మించిన ఉపద్రవాలనూ భరించింది. ఇప్పుడు ఈ కరోనా అని పిలవదబడుతున్న కోవిడ్-19 వైరస్ వంతు. అసలు కరోనా సోకితే చనిపోవడం తప్పదా? కరోనా అంటే చావేనా? ఈ వైరస్ మనిషిని చంపడానికే వచ్చిందా? కేవలం స్పర్శతోనే ఇది వ్యాపించేస్తుందా? మరి మందే లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి? సోషల్ మీడియాలో గత నాలుగు రోజులుగా వెల్లువెత్తుతున్న కథనాల్లో నిజమెంత? ఇలా ఎన్నో ప్రశ్నలు.. వాటిని ఒకసారి పరిశీలిస్తే..
అసలు కరోనా అనబడే కోవిడ్-19 వైరస్ ఏమిటి?
గతంలో మనలని కదిపేసి, కుదిపేసిన ఎన్నో వైరస్ ల లాంటిదే ఇది కూడా. ఇది చైనాలోని ఓ జీవినుంచి మనిషికి సంక్రమించిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ తో మరణం సంభవిస్తుందనే విషయం కొంత వరకూ నిజమే. కానీ ఈ వైరస్ సోకిన వారంతా కచ్చితంగా మరనిస్తారనే విషయం నిర్ధారణ కాలేదు. అసలు చెప్పాలంటే కరోనా వైరస్ పై పూర్తి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇంకా దీనిమీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ సంక్రమించిన తరువాత మనిషిలోని ఆరోగ్య లోపాల ఆధారంగా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది అని మాత్రం ప్రస్తుతానికి ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. ఇక సాధారణ జలుబు, దగ్గులాంటి లక్షణాలనే చూపించే ఈ వైరస్ నేరుగా ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. తద్వారా మరణం సంభవిస్తుంది అనేది ఇప్పటివరకూ తెలిసిన విషయం.
వేడి ప్రాంతాల్లో వైరస్ వ్యాపించాలేదా?
నిజానికి ఏ వైరస్ అయినా వేడిని తట్టుకోలేదు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటె అది నిర్వీర్యం అయిపోతుంది. (అయితే, అసలు వైరస్ కు మరణం ఉండదు) అందుకే, మనకు సాధారణంగా వచ్చే వైరల్ ఫీవర్..దగ్గు..జలుబు వంటివి వర్షాకాలం..శీతాకాలం లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ కరోనా సంగతి చూస్తే ఇది కూడా అదే విధంగా వేడి ఎక్కువ అయితే నిర్వీర్యం అయిపోతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదు. నిజంగా చెప్పాలంటే వైరస్ వేడిని తట్టుకోలేదు అనేది కూడా ఇంకా శాస్త్రీయంగా రుజువైన దాఖలాలు లేవు. సో, కరోనా ఎండాకాలం కాబట్టి మనకు అంతగా వ్యాప్తి చెందదు అని నూటికి నూరు శాతం అనుకోవడానికి వీలులేదు. కొన్నాళ్ళ క్రితం ప్రపంచాన్ని వణికించిన ఎబోలా, సార్స్ లాంటి వైరస్ లు మన దేశంలో అంతగా వ్యాపించాకపోవడానికి కారణం ఇక్కడి వేడి వాతావరణం అని చెబుతున్నారు. అ వైరస్ ల వరకూ అది నిజం కావొచ్చు. అన్నిటికీ ఇది వర్తిస్తుందని చెప్పడానికి శాస్త్రీయమైన ఆనవాళ్ళు ఏమీలేవు.
ముట్టుకుంటే హత్తుకుంటుందా?
కరోనా గురించి ఎక్కువగా భయపెడుతున్న వార్త చేతుల్ని తాకిస్తే చాలు కోవిడ్ వైరస్ అన్తుకుంటుందని వస్తున్న ప్రచారం. అలాగే, తుమ్మినా, దగ్గినా కూడా ఈ వైరస్ సులభంగా పక్కవాళ్ళకి వ్యాపించేస్తుంది అనేదీ విపరీతంగా ప్రచారంలో ఉంది. ఇది నిజమే. ఇక్కడ చెప్పుకోవలసింది సాధారణంగా ఎక్కువ శాతం వైరస్ లు ఈ రకంగానే వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా ఇంట్లో ఒకరికి జలుబు వస్తే కుటుంబంలో అందరికీ వరుసపెట్టి రావడం.. కళ్ళకలక లాంటి వ్యాధులు సీజనల్ గా వ్యాప్తి చెందడం ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఇది కొత్త విషయమేమీ కాదు. అయితే త్వరితగతిన వ్యాపించే అవకాశం ఈ కరోన వైరస్ కు ఉంది. చేతి ద్వారా సంక్రమించి.. అతి తొందరగా మనిషి శరీరంలో బలపడిపోయే శక్తి దీనికి ఉంది. ముఖ్యంగా ఇది శారీరకంగా బలహీనంగా ఉన్నవారిలో.. పెద్దవయసు వారిలో తీవ్ర ప్రభావం చూపించగలదు. సాధారణంగానే ఇటువంటి వైరస్ లు తుమ్ము, దగ్గుద్వారా వ్యాపిస్తాయి. దానికోసం కచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిందే.
కరోనా మరణాలు కొన్ని నిజాలు..
ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కరోనా సోకిన తరువాత మరణించిన వారి సంఖ్య సీజనల్ ఫ్లూ, మీజిల్స్, ఎబోలా, హెచ్ఐవీ, చికెన్ గున్యా వంటి వైరస్ సోకిన వారి మరణాలతో పోలిస్తే చాలా తక్కువ కావడం గమనార్హం. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 95,481మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 3,285 మంది మరణించగా 53,688 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. అంతే కాకుండా వరల్డ్ మీటర్స్ వెబ్సైట్ లో పొందుపరచిన పూర్తి వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా వైరస్ బారిన ఉన్న బాధితులు 38,508 మంది వారిలో 32,088మందిపై కరోనా ప్రభావం తక్కువ స్థాయిలోనే ఉంది. ఇక 6,420 మంది క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 56,973 కరోనా బాధితులకు ఉపశమనం లభించింది. 53,688మంది కరోనా బాధితులు మరణం నుంచి బయటపడ్డారు. 3,285 మంది మృత్యువాత పడ్డారు. (క్రింది ఇమేజ్ చూడండి) ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చికెన్ గున్యా బారిన పడిన 4 మిలియన్ల మందిలో వారిలో 4,70,000 మంది మరణించారు. దీనితో పోల్చుకుంటే కరోనా వైరస్ బారిన పడిన వారిలో మరణాలు తక్కువనే చెప్పుకోవచ్చు. అందువలన కరోనా వైరస్ సోకితే మరణమే శరణ్యం అనే భావన నుంచి అందరూ బయట పడాల్సి ఉంటుంది.
ఎందువల్ల కరోనా ప్రమాదకరంగా కనిపిస్తోంది?
అతివేగంగా విస్తరించే అవకాశం ఉండడం అనే కారణంతోనే ప్రధానంగా కరోనా వైరస్ అత్యంత ప్రమాదకారిగా కనిపిస్తోంది. ఇక రకరకాల మాధ్యమాల ద్వారా ఈ వ్యాధి పట్ల జరుగుతున్న ప్రచారాలూ ప్రజల్లో భయాన్ని పెంచేస్తున్నాయి. ఇది కచ్చితంగా ప్రమాదకర వైరస్ అయినప్పటికీ, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీనిని వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. ముఖ్యంగా పెద్ద వయసు వారిలోనే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం కోవిడ్ మరణాల్లో 21.9శాతం 80 ఏళ్లకు పైబడిన వారే. 70-79 మధ్య వయసు వారిలో 8 శాతం మంది, 60-69 మధ్య వయసు వారిలో 3.6 శాతం మంది, 50-59 మధ్య వయసు వారిలో 1.3 శాతం మంది, 40-49 మధ్య వయసు వారిలో 0.4 శాతం మంది, 30-39 మధ్య వయసు వారిలో 0.2 శాతం మంది, 20-29 మధ్య వయసు వారిలో 0.2 శాతం, 10-19 మధ్య వయసు వారిలో 0.2 శాతం మంది ఉన్నారు. ఇక ఇప్పటివరకూ 0-9 మధ్య వయసు వారిలో ఒక్కరు కూడా ఈ వైరస్ వలన మృత్యువాత పడలేదు. ఈ గణాంకాల ప్రకారం చూస్తె, కోవిడ్ వైరస్ ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారిపై కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంటుందని స్పష్టం అవుతోంది.
మొత్తమ్మీద కరోనా వైరస్ పట్ల అప్రమత్తతే చాలా ముఖ్యమైనది. అనవసర వదంతులు వినడం..నమ్మడం వంటివి ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తాయి. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారు కరోన వైరస్ పట్ల చాలా జాగ్రతగా ఉండాలని తెలుస్తోంది. ఇక పడ్డ వయసు వారిని ఈ వైరస్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire