సంచలనం సృష్టించిన సజీవ దహనం ఘటన..చితివద్ద పూజలు చేస్తుండగా...

సంచలనం సృష్టించిన సజీవ దహనం ఘటన..చితివద్ద పూజలు చేస్తుండగా...
x
Highlights

నేటి సాంకేతిక కాలంలో ఏదో ఒక చోట మూఢ నమ్మకాలు జాడ్యం బయటపడుతూనే ఉంది. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మూఢ నమ్మకం ఓ నిండు ప్రాణాలు బలి...

నేటి సాంకేతిక కాలంలో ఏదో ఒక చోట మూఢ నమ్మకాలు జాడ్యం బయటపడుతూనే ఉంది. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మూఢ నమ్మకం ఓ నిండు ప్రాణాలు బలి తీసుకుంది. చేతబడుల నెపంతో ఓ యువకుడిని చితిపై వేసి దహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

హైదరాబాద్ శివారు ప్రాంతంలో మూఢ నమ్మకాలతో మరో యువకుడి బలికావడం కలకలం రేపింది. శామీర్ పేట మండలం అద్రాసుపల్లిలో చేతబడి చేసి ఓ మహిళ మృతికి కారణమయ్యాడన్న నెపంతో అతికిరాతకంగా హత్య చేసి దహనం చేశారు.

అద్రాసుపల్లికి చెందిన గ్యార లక్ష్మీ ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు పూజలు చేసి ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పేవాడని తెలిసింది. కానీ లక్ష్మీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆంజనేయులు కుటుంబంపై అనుమానం పెంచుకున్నారు లక్ష్మీ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో లక్ష్మీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. కుటుంబ సభ్యులు , గ్రామస్తులు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.

వారి కుటుంబ ఆచారం ప్రకారం రెండు గంటల తర్వాత చితివద్ద మరోసారి దీపం వెలిగించడానికి కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆంజనేయులు వారి కంట పడ్డాడు. శ్మశానంలో చితి చుట్టూ తిరుగుతూ ఏదో చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆంజనేయులును పట్టుకుని కిరాతకంగా కొట్టారు. ఆ తర్వాత లక్ష‌్మీ ని దహనం చేసిన చితిలోనే ఆంజనేయులు కూడా పడేసి కట్టెలు, టైర్లు వేసి దహనం చేశారు. ఆంజనేయులు ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో అతని బావ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీని చితిపెట్టిన ఘటన స్థలానికి వెళ్లి చూడగా అక్కడ మరో మృతదేహం దహనం అవుతున్నట్లు గుర్తించారు. గ్రామంలో చేతబడులపై గ్రామస్తులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఆంజనేయులు మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

ఆంజనేయులును అంత కిరాతకంగా హత్య చేయడానికి కారణమేంటి..? అతనికి నిజంగా చేతబడులు వచ్చా...? కుటుంబ సభ్యులు, గ్రామస్తులేమంటున్నారు...? అతన్ని చితిలో పడేసిన నిందితులు ఏం చెబుతున్నారు. ?

లక్ష్మీ చితిపై ఆంజనేయులును పడేసి సజీవ దహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఘటన స్థలంలో ఆంజనేయులు బట్టలతో పాటు సగం కాలిన మృతదేహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్చిప్, రక్తపు మరకలతో కొన్ని క్లూస్ సేకరించి ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు కిష్టయ్య, బలరాంలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిందితులు కిష్టయ్య, బలరాంలు విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. లక్ష్మీని చితిపెట్టిన తర్వాత ఆంజనేయులు అక్కడికి వెళ్లి అర్ధనగ్నంగా పూజలు చేస్తున్నాడని అక్కడి వెళ్లి చూసే సరికి తమపైకి ఎదురు తిరిగాడని తెలిపారు. అరగంట టైమ్ ఇస్తే లక్ష్మీని మాట్లాడిస్తానంటూ ఏవో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వారు వెల్లడించినట్లు సమాచారం. పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం మూఢ నమ్మకాలే అని ఇందులో వాస్తవం లేదని చెబుతున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని అనుమానంతోనే తన కొడుకును కిరాతకంగా హత్య చేశారని ఆంజేయులు తల్లి కన్నీరు మున్నీరవుతోంది. ఏమైనా మూఢ నమ్మకాలకు ఓ నిండి ప్రాణం బలైంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మూడ నమ్మకాలు నమ్మవద్దని ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని హెచ్ఎంటీవీ కోరుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories