సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని స్క్రిప్ట్. సస్పెన్స్ థ్రిల్లర్‌కు సరిగ్గా సరిపోయే స్క్రీన్ ప్లే. పక్కా ప్లాన్ ప్రకారం ఏకంగా 9 హత్యలు. ప్రాణం...
సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని స్క్రిప్ట్. సస్పెన్స్ థ్రిల్లర్‌కు సరిగ్గా సరిపోయే స్క్రీన్ ప్లే. పక్కా ప్లాన్ ప్రకారం ఏకంగా 9 హత్యలు. ప్రాణం ఉండగానే ఈడ్చుకెళ్లి బావిలో పడేసిన దృశ్యాలు. చేసిన తప్పు బయట పడకుండా ఉండేందుకు ఓ మానవ మృగం సాగించిన నరమేథం. గొర్రెకుంట బావిలో దొరికిన శవాల మిస్టరీ ఏంటి..? దాని వెనుక కథేంటి..? గొర్రెకుంట క్రైమ్ కథా చిత్రం.. మీకోసం..
ఒకరి వెనుక మరొకరు.. మొదటిరోజు నాలుగు మృతదేహాలు. మరుసటి రోజూ గాలిస్తే మరో 5 డెడ్‌బాడీస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామికవాడలోని బావిలో 9 శవాలు దొరకడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. మూడేళ్ల చిన్నపిల్లాడితో సహా ఓ కుటుంబం మొత్తం బావిలో శవాలై తేలింది. వీరితో పాటే మరో ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్ నుంచి వలస వచ్చిన మక్సూద్ కుటుంబం మొత్తం బావిలో శవాలై తేలింది. మక్సూద్‌తో పాటు ఆయన భార్య నిషా, కుమార్తె బుస్రా, కుమారులు షాబాజ్ ఆలం, సోహెల్ ఆలం, మూడేళ్ల చిన్నారితో సహా బిహార్‌కు చెందిన శ్యామ్, శ్రీరామ్, త్రిపురకు చెందిన షకీల్ ప్రాణాలు కోల్పోయారు. విషయం సీరియస్ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ విచారణ కోసం హుటాహుటిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో పాటు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సైబర్‌క్రైం, ఐటీకోర్ టీం, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ తదితర విభాగాల అధికారులతో కూడిన టీమ్‌లు దర్యాప్తు మొదలుపెట్టాయి. మొదట ఇవి ఆత్మహత్యలే అనుకున్నారు కానీ తర్వాత అనుమానాస్పద మరణాలుగా భావించారు.
నాలుగు రోజుల పాటు పోలీసులు, క్లూస్ టీంలు ఘటనా స్థలంతో పాటు, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అయితే ఎక్కడా ఏ ఆధారమూ లభించలేదు. దీంతో మృతుల మొబైల్స్ కాల్‌డేటాను విశ్లేషించే ప్రయత్నం చేశారు. చిన్న క్లూ దొరకడంతో వరంగల్‌లో ఉంటున్న సంజయ్‌తో పాటు అతడి స్నేహితుడు అంకూస్, యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఫోరెన్సిక్, పోస్టమార్టం రిపోర్టుల్లో ఇవి హత్యలే అని తేలాయి. ప్రాణం ఉండగానే బావిలో పడేసినట్లు నిర్ధారణ కావడం అలాగే డెడ్‌బాడీల్లో విషప్రయోగం జరిగినట్లు తేలింది. దీంతో కేసు కీలక మలుపు తీసుకుంది.
ఈ ఘోరం వెనుక కారణాల అన్వేషణలో మళ్లీ ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అనుమానితుడైన సంజయ్‌కు మక్సూద్ కుటుంబానికి ఉన్న సంబంధంపై ఆరా తీశారు. మక్సూద్ కూతరు బుస్రాకు, సంజయ్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం నడిచింది. చివరకు పోలీసులు తమ స్టైల్‌లో విచారణ జరపడంతో తానే ఆ 9 మందిని హత్య చేసినట్లు సంజయ్ ఒప్పుకున్నాడు.
మొత్తానికి సంజయ్ నేరాన్ని అంగీకరించాడు. 9 మందిని చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మరి ఎలా చంపాడు..? దాని వెనుక ఎలాంటి ఉన్న ప్లాన్ ఏంటి..? తనకెవరైనా సహకరించారా..? లేక ఒక్కడే అందరినీ మట్టుబెట్టాడా..?
సంజయ్.. 9 హత్యల వెనుక ఉన్న నరరూప రాక్షసుడు. చిన్నపిల్లాడనే కనికరం కూడా లేకుండా చంపిన దుర్మార్గుడు. మక్సూద్ కుటుంబాన్ని మట్టుబెట్టాలనుకున్న సంజయ్ దానికోసం పక్కా ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 16 నుంచి 20 వరకు మక్సూద్ ఫ్యామిలీ ఉండే ఫ్యాక్టరీ ఏరియాలో రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 18 వ తేదీన హన్మకొండలోని ఓ మెడికల్ షాపు నుంచి నిద్రమాత్రలు తీసుకొచ్చిన సంజయ్ 20 వ తేదీన మక్సూద్ పెద్ద కుమారుడి బర్త్ డే రోజున వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. సైకిల్‌పై మక్సూద్ ఇంటికి చేరుకున్న సంజయ్ ఎవరికీ తెలియకుండా అప్పటికే వండిపెట్టిన వంటల్లో నిద్రమాత్రలు కలిపాడు. ఆ తర్వాత పక్క రూముల్లో ఉంటున్న బిహారీ యువకుల పిల్లలు వండుకున్న ఫుడ్‌లో కూడా నిద్రమాత్రలు కలిపాడు. ఆ తర్వాత ఆ భోజనం తీసుకున్న మక్సూద్ ఫ్యామిలీ, మిగతా ముగ్గరు గాఢనిద్రలోకి వెళ్లిపోయింది.
అర్ధరాత్రి 12 గంటలా 30 నిమిషాలు. అందరూ గాఢ నిద్రలోకి పోయారని నిర్ధారించుకున్న సంజయ్ మక్సూద్ ఫ్యామిలీలోని ఒక్కొక్కరినీ గోనెసంచిలో చుట్టి బావిలోకి తోసేశాడు. నిద్రమాత్రలు కలిపిన భోజనం చేసిన మిగతా ముగ్గురు పిల్లలను కూడా అలాగే గోనె సంచుల్లో చుట్టి బావిలో పడేశాడు. ఇలా తెల్లవారుజాము 5 గంటల వరకు మొత్తం 9 మందిని సంచుల్లో చుట్టి బావిలో పడేశాడు. ఏకంగా ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ మారణకాండ ముగిసిన తర్వాత తెల్లవారుజామున సంజయ్ తన రూమ్‌కు వెళ్లినట్లు సీపీ వెల్లడించారు.
గొర్రెకుంట బావి రహస్యాన్ని ఛేదించారు పోలీసులు. ఒక హత్యను కప్పిపుచ్చేందుకు ఏకంగా 9 హత్యలు చేసినట్లు నిర్ధారించారు. ఒక్కడే 10 మందిని నిర్ధాక్షిణ్యంగా చంపాడని తెలిపారు. నిందితుడు సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 10 హత్యల క్రమాన్ని వివరించారు. నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
గొర్రెకుంట మర్డర్ కేసులో నిందితుల ప్లాన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. మక్సూద్ ఫ్యామిలీని సంజయ్ ఎందుకు లేకుండా చేశాడు..? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా..? ఈ మర్డర్లకు ఉసిగొల్పిన కారణాలేంటి..? ఆ కుటుంబం మొత్తాన్ని చంపేంత పగ ఎందుకు పెంచుకున్నాడు..? పోలీసులు సేకరించిన ఆధారాలేంటి..? ఈ మారణకాండకు ఫుల్ స్టాప్ ఎక్కడ పడింది..?
మక్సూద్ ఫ్యామిలీని మట్టుబెట్టాలన్న ఆలోచనకు ముందే సంజయ్ మరో హత్య చేశాడు. మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికా తన కూతుళ్లతో కొన్నాళ్ల క్రితం వరంగల్‌కు వచ్చింది. ఆ సమయంలో సంజయ్‌కు రఫికా పరిచయం అయ్యింది. అది సహజీవనం వరకు వెళ్లింది. ఇద్దరూ కలిసున్న క్రమంలో సంజయ్ మరో దారుణమైన ఆలోచన చేశాడు. రఫికా కూతురిపై కన్ను పడింది. దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన రఫికా సంజయ్‌ను అడ్డుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కూతురిని ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించింది. దీంతో రఫికా అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసిన సంజయ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి వెస్ట్ బెంగాల్‌కు వెళ్లేందుకు రైలెక్కించాడు.
మార్చ్ 7 న ట్రైన్‌లో ప్రయాణిస్తున్న రఫికాకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగ ప్యాకెట్ ఇచ్చాడు. అది తాగిన రఫికా నిద్రలోకి జారిపోయింది. రాత్రి 3 గంటల సమయంలో ఆమె మెడను చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని నడుస్తున్న రైలు నుంచే కిందకు తోసేశాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న సంజయ్‌ను రఫికా గురించి మక్సూద్ కుటుంబ సభ్యులు అడగడం మొదలుపెట్టారు. దీంతో రఫికాను మర్డర్ చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో మక్సూద్ ఫ్యామిలీ మొత్తాన్ని మట్టుబెట్టాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. తమ విచారణలో సీసీటీవీ ఫూటేజ్ ఆధారాలు కీలక అని వరంగల్ సీపీ వెల్లడించారు. మక్సూద్ ఇంటికి సంజయ్ వెళ్లడం గోనె సంచీలు తీసుకెళ్లడం ఉదయం తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలు రికార్డ్ అయినట్లు సీపీ వివరించారు.
సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై పెంచుకున్న ఆశ ఇంతటి ఘోరానికి కారణమైంది. ఒక హత్య మరో 9 హత్యలకు దారి తీసింది. చేసిన నేరం ఎక్కడ బయటపడుతుందో అనే భయం 10 మందిని మర్డర్ చేసేంతవరకు తీసుకెళ్లింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire