అమ్మఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్న తొమ్మిదినెలల పసిగుడ్డును ఎత్తుకెళ్లి చిదిమేశాడో కామాంధుడు. ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిలను లిప్ట్ పేరుతో తీసుకెళ్లి ...
అమ్మఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్న తొమ్మిదినెలల పసిగుడ్డును ఎత్తుకెళ్లి చిదిమేశాడో కామాంధుడు. ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిలను లిప్ట్ పేరుతో తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడో సైకో కిల్లర్. గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లులే కసాయిలుగా మారి కన్నబిడ్డల్నే అత్యంత కిరాతకంగా చంపిన వరుస ఉదంతాలూ ఉన్నాయి. నడిరోడ్డుపై దారుణ హత్యలు కాపాడాల్సిందిపోయి తమ సెల్‌ఫోన్లో బంధిస్తూ చోద్యం చూస్తున్న జనాలు. ఈ మధ్యకాలంలో మనకి కనిపిస్తున్న, వినిపిస్తున్న వార్తలివి. అసలు ఏమైంది వీళ్లకి? ఎందుకిలా మృగాళ్ల మారుతున్నారు? మానసిక కృంగుబాటా? ఆత్మీయతలు లేని అనుబంధాలా?
ముద్దులొలికే చిన్నారి తొమ్మిదినెలలు కూడా నిండలేదు. ఓ మానవ మృగం తన దగ్గర్లోనే ఉందన్న విషయం తెలియక ఆ చిన్నారి తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తుంది. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ రాక్షసుడు తాను మనిషినన్న సంగతి కూడా మరిచి రాక్షసుడిలా ప్రవర్తించాడు. చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆమె ప్రాణాలు పోవటానికి కారణమై ఆ తల్లికి కడుపుకోత మిగిల్చాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటన తెలుగు ప్రజలను దిగ్భ్రమకు గురిచేసింది.
హన్మకొండ కుమార్‌పల్లి ప్రాంతంలో నివాసముండే ఈ దంపతులకు 9 నెలల పాప. ఆ పాప అంటే ఇంటిల్లిపాదికి ప్రాణం. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఆడుకుంది. ఉక్కపోత కారణంగా పాపను తీసుకుని మిగతా కుటుంబసభ్యులతో కలిసి ఇంటి డాబాపై నిద్రించారు. రోజంతా పనిచేసి అలసిపోయిన వారంతా ఆదమరిచి నిద్రపోతున్నారు. అదే సమయంలో ప్రవీణ్ అనే ఓ కిరాతకుడు తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని అపహరించుకుని వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మెలకువ వచ్చి చూసేసరికి తన పక్కన పాప లేకపోవటంతో ఆందోళన చెందిన తల్లి కేకలు పెట్టింది. దీంతో అప్రమత్తమైన బంధువులు పాప ఆచూకీ కోసం గాలించారు. ఇదే సమయంలో ఓ యువకుడు పాపను భుజంపై వేసుకుని వెళ్తున్న విషయాన్ని గమనించిన పాప మామయ్య స్నేహితులతో కలిసి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పాపను అక్కడ పడేసి ప్రవీణ్ పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని వెంబడించి పట్టుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ మరణించింది. ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది.
ఒంటరిగా అమ్మాయి కనబడితే చాలు మాయమాటలు చెప్పి తీసుకెళ్తాడు. తన కోరిక తీర్చుకుని తుదకు మూడో కంటికి కూడా తెలియకుండా దారణంగా హతమారుస్తాడు. అలా ఆ మానవమృగం చేతిలో పలువురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సీరియల్ కిల్లర్ బారిన పడ్డ బాధితుల ఎవరన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది.
ఒక హత్యకేసులో చేసిన విచారణ ఊహించని మలుపులు తిరిగి ఓ డేంజర్ సీరియల్ కిల్లర్ ఉదంతాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆ సైకో చేతిలో నలుగురు ప్రాణాలొదిలారు. ఇంకా కొంతమంది కూడా ఉండవచ్చన్న అనుమానంతో విచారణ కొనసాగుతుంది. శ్రావణి అనే అమ్మాయి కీసర నుంచి హాజీపూర్‌కు వెళ్లే క్రమంలో బొమ్మలరామారానికి చేరుకుంది. అక్కడి నుంచి కాలినడకనే వెళ్లాల్సి రావటంతో లిప్ట్ కోసం అక్కడే ఓ చెట్టుకింద ఆగింది. ఆ సమయంలో శ్రీనివాస్‌రెడ్డి అనే సైకో దృష్టి శ్రావణిపై పడింది. లిప్ట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి మధ్యలో తన మనసులో మాటబయటపెట్టాడు. అందుకు శ్రావణి నిరాకరించటంతో గొంతునులిమి అక్కడే ఉన్న బావిలోపడేశాడు. అనంతరం అపస్మారకస్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం మట్టితో కప్పేసి వెళ్లిపోయాడు.
హాజీపూర్‌కే చెందిన మనీషా అనే అమ్మాయిని కూడా కాలేజీకి వెళ్తుండగా శ్రీనివాస్‌రెడ్డి లిఫ్టు ఇస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. వ్యవసాయ బావి వద్దకు రాగానే బైక్ ఆపి కోరిక బయటపెట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి అపస్మారక స్థితిలోకి నెట్టేసి అత్యాచారం చేశాడు. అనంతరం చంపేసి సొంత బావిలోనే మృతదేహాన్ని పడేసి మట్టితో కప్పాడు. ఈ రెండు వ్యవహారాలు వెలుగు చూసిన సమయంలోనే విచారణ సమయంలో నాలుగు సంవత్సరాల క్రితం అదృశ్యమైన 11 సంవత్సరాల కల్పనను అంతమొందిచినట్లు అంగీకరించాడు. ఇవే కాదు కర్నూల్‌లో ఓ వ్యభిచారిణి హత్యకేసులోనూ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి నిందితుడు. హాజీపూర్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించింది.
భార్యభర్తల్లో విభేదాలు ఒక పక్క కుటుంబ కలహాలూ మరోపక్క ఆస్తి గొడవలు ఆర్థికఇబ్బందులు ఇలా పెద్దవాళ్లలో ఏం జరిగినా బలయ్యేది మాత్రం చిన్నారులే అభంశుభం తెలియని పిల్లలను ఎందుకు బలిగోరుతున్నారు. అసలు పగతీర్చు కోవాలంటే పిల్లల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆలనా పాలనా చూసకోవాల్సిన వారే కర్కషంగా హతమార్చే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి.
పిల్లలను చంపి పెద్దలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల మధ్య గొడవల్లో పిల్లలు బలి పశులవుతున్న దారుణ ఉదంతాలు అధికమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యావంతులు కూడా విచక్షణ కోల్పోయి ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలు వర్తమాన సమాజ విపరీత వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి.
సిద్దిపేటలో ఓ తల్లి తన ఇద్దరు కుమారుల్ని బీరు సీసాతో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన భాస్కర్ సరోజలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఐదున్నరేళ్ల వయసున్న అయాన్, రెండున్నరేళ్ల హర్షవర్ధన్ సంతానం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజూ ఉదయం సరోజ భర్తతో గొడవపడింది. భర్త బయటకు వెళ్లగానే పిల్లల్ని బెడ్‌పై వేసి బీరు సీసాను పగులగొట్టి అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రవిషాదాన్ని నింపింది.
ఇక తన అక్రమ సంబంధానికి అడ్డువస్తుందనే కారణంతో ప్రియుడితో కలిసి కన్న కూతుర్నే హతమార్చిందో తల్లి. గోదావరిఖనికి చెందిన మమత భర్తతో గొడవపడి పుట్టింట్లో తన ఐదుసంవత్సరాల కూతురితో కలిసి ఉంటుంది. ఈ సమయంలో ఈమెకు సతీష్ అనే యువకుడితో అక్రమసంబంధం ఏర్పడింది. అయితే సతీష్‌ను పెళ్లాడలనుకున్న మమత కూతుర్ని అడ్డుతొలిగించేందుకు ప్రియుడితో కలిసి గొంతునులుమి హతమార్చింది. ఇక కుటుంబ తగాదాల కారణంగా తన భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడ్ని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాజేష్ తన భార్య ఊర్మిళతో గొడవపడి ఆమెతలపై రాడ్‌తో బాది హతమార్చాడు. అనంతరం కుమారున్ని నీళ్లు నిండుగా ఉన్న బకెట్లో తలకిందులుగా వేసి పారిపోయాడు.
ఆర్థిక, వివాహేతర సంబంధాలు ఆలుమగల మధ్య వివాదాలకు ఎక్కువగా కారణమవుతున్నాయి. విద్యావంతుల విషయానికి వచ్చేసరికి వృతిపరమైన ఒత్తిడి, అహం, ఆధునిక జీవనవిధానం తదితర కారణాలు కాపురాల్లో చిచ్చు రాజేసి దారుణాలకు ఒడిగట్టేందుకు కారణమవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానమేనన్న భావన ఉన్న కుటుంబాల్లో కల్లోలాల బారిన పడుతున్నాయి. ఒక పక్క ఆధిపత్య ధోరణి ఆలుమగల మధ్య అగాధం పెంచుతుంటే మరోపక్క వృత్తిపరమైన ఒత్తిడి కూడా వైవాహిక సంబంధాలు విచ్ఛిన్నానికి దారితీస్తోంది.
వ్యక్తిగత కోపాలు ఆస్తి తగాదాలు ప్రేమ పేరుతో దాడులు ఇలా కారణమేదైనా ఈ మధ్య నడిరోడ్డుపైనే హత్యలు జరిగిపోతున్నాయి. సాటి మనిషిని వెంటాడి వేటాడి కత్తులు,గొడ్డళ్లతో పశువుల్లా నరికిచంపేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి సర్వసాధారణంగా మారాయి. ఈ మధ్య పటాన్‌చెరు, వేములవాడ, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఘటనను తమ ఫోన్లో బంధించటానికి ప్రయత్నిస్తున్న వారే కానీ బాధితుడ్ని కాపాడేవారు మాత్రం కరువయ్యారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire