రెండు వేల ఏళ్లకుముందే జల యంత్ర మందిరం

రెండు వేల ఏళ్లకుముందే జల యంత్ర మందిరం
x
Highlights

కాళిదాసు కవిత్వం అంటే నాటికీ , నేటికీ ఒక కొలమానం. పూర్వం గొప్ప కవుల పేర్లు వరుసగా వేళ్ల మీద లెక్కపెడదామని కాళిదాసు అని చిటికెన వేలు తీసి - రెండో పేరు...

కాళిదాసు కవిత్వం అంటే నాటికీ , నేటికీ ఒక కొలమానం. పూర్వం గొప్ప కవుల పేర్లు వరుసగా వేళ్ల మీద లెక్కపెడదామని కాళిదాసు అని చిటికెన వేలు తీసి - రెండో పేరు చెప్పడానికి ఇప్పటిదాకా కవీ లేడు - రెండో వేలు తీయాల్సిన అవసరమూ రాలేదు - అన్న సంస్కృతశ్లోకం ద్వారా కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఉపమా కాళిదాసస్య - శ్లోకం ఉండనే ఉంది. పోలిక అందంగా , అద్భుతంగా చెప్పడంలో కాళిదాసును మించినవాడు ఉండాలి అంటే మళ్లీ కాళిదాసే పుట్టాలట.

కాళిదాసు ఎప్పటివాడు, ఎక్కడివాడు అన్న ప్రశ్నలకు ఎన్నెన్నో సమాధానాలు . ఏది నిజమో ? ఏది కల్పితమో ? తెలియక ఇప్పటికీ ఆ గందరగోళం అలాగే ఉంది. క్రీస్తు పూర్వం ఒకటి - అంటే ఇప్పటికి సరిగ్గా 2,100 సంవత్సరాల క్రితం ఇప్పటి ఉజ్జయినీ ప్రాంతవాసి - అన్న వాదనను పెద్దలు ఆమోదిస్తున్నారు . కొంతవరకు చారిత్రక , సాహితీ , ప్రాసంగిక ఆధారాలు ఈ వాదననే బలపరుస్తున్నాయి .

ఋతుసంహారం కావ్యంలో ఒక శ్లోకంలో ఎండాకాలంలో జనం జలయంత్ర మందిరాల్లో సేదతీరుతారని కాళిదాసు స్పష్టంగా ప్రస్తావించాడు. పైగా సందర్భం కూడా మొక్కుబడి ప్రస్తావన కాదు. కావ్యమే ఋతువుల అందాల గురించి. అందులో వేడిగా ఉన్నప్పటి ప్రస్తావన.

సంస్కృతాన్ని తెలుగులోకి అనువదించినప్పుడే ఎంతో అనువాద వధ జరిగి ఉంటుంది. ఈ రోజుల్లో సంస్కృతం తెలుగు మీదుగా ఇంగ్లీషులోకి దించితేనే తెలుగు చదివేవారికి సులభంగా అర్థమవుతుంది. కాళిదాసు జలయంత్ర మందిరాన్ని అలా అనువదిస్తే - ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్ - అవుతుంది.

మన అత్యాధునిక సెంట్రల్ ఏసీ , విండో ఏ సీ , స్ప్లిట్ ఏ సీ , టవర్ ఏ సీ , ఎయిర్ కూలర్ , షవర్ స్ప్రే ఇంకా అనేకానేక ఏ సీ లకు తాత లాంటి ఏ సీ గురించి కాళిదాసు చెప్తున్నాడు. పైగా ఆయన వాడిన సమాసాన్ని బట్టి ఒక రూమ్, ఒక హాల్ ఏ సీ కానే కాదు. మొత్తం శీతల భవనం. ఊరికే కిటికీలకు మనం మొన్నటిదాకా కట్టుకున్నట్లు వట్టివేళ్ల చాపలు, నీళ్లు చల్లడం - లేదా దుప్పట్లు కట్టి నీళ్లు చల్లడం కాదు . యంత్రం అని స్పష్టంగా చెప్తున్నాడు. పిచ్చివాసన రాకుండా సుగంధ పరిమళ భరితం కూడానట. దానికి తోడు ఈ భవనానికి వేడి తగ్గించే చలువరాతి కూర్పు .

మరి విద్యుత్ శక్తి లేనిరోజుల్లో ప్రపంచంలో వసతులు లేవా ? విలాసాలు లేవా ? కాళిదాసు ఎలాంటి ఏ సీ నో చెప్పలేదు కానీ - వేసవి వేడిని తన్ని తరిమేసి -మండు ఎండలో జల శీతల యంత్ర మందిరాల హాయిని అనుభవించేవారని మాత్రం - కళ్లకు కట్టినట్లు చెప్పాడు. బహుశా ఆటోమేటిగ్గా చల్లనీళ్ళ జల్లులు కురిపించే యంత్ర వ్యవస్థ కానీ , నీళ్లద్వారా భవనం గోడలను చల్లబరిచే పధ్ధతి కానీ అయి ఉంటుందని ఊహించవచ్చు.

అంతెందుకు - తెలుగు విమర్శ హిమ శిఖరం రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు - రాయలనాటి రసికత - పేరుతో - దాదాపు అయిదు శతాబ్దాల క్రితం విజయనగర జనజీవన వైభవోజ్వల దీప్తులను ఒళ్లు పులకించేలా , నోరూరేలా , అబ్బో అనిపించేలా చెప్పారు. శరత్కాలంలో డాబామీద అల్లుకున్న పూలతీగలు, ఆ పూల పందిళ్లపై కురిసే వెన్నెల, ఆ వెన్నెల్లో మంచాలు, ఆ మంచాలమీద చెక్కలు - వాటిమీద తినుబండారాలు , వెన్నెల తాగుతూ , పూలసుగంధాలు మత్తెక్కిస్తుంటే కరకరమని తినేవి , మెత్తగా చప్పరించి తినేవి , జుర్రుకుని తినేవి , వేడివేడిగా తినేవి , చల్లగా తినేవి , నంజుకుని తినేవి. తాగడానికి పాలు , మజ్జిగ , కొబ్బరి నీళ్లు , బత్తాయి రసం , దానిమ్మ రసం , నిమ్మకాయ నీళ్లు. ఇంతా చేస్తే ఇదంతా రాత్రి భోజనానికి ముందు - వెన్నెల ఉపాహారం అంతే. ఇక అసలు భోజనం మాటలకందదు . భోజనానంతరం తాంబూలం వేసుకుంటే - ఆ సుగంధ ద్రవ్యాలపరిమళమే ఆ వీధి వీధి అంతా వ్యాపించేది. ఆ రుచులను అష్టదిగ్గజకవులు కూడా వర్ణించలేరు .


ఇప్పటి మన అత్యాధునిక జీవితం, విలాసాలు , అతి నాజూకు ఆహారం చాలా గొప్పవి అని మనకు నమ్మకం.
కాళిదాసు జలయంత్ర మందిరం, రాళ్ళపల్లి వారి రాయలనాటి జీవనం విన్నతరువాత కూడా మీ అభిప్రాయం అదే అయితే వారి తపన , ప్రస్తావన , కృషి , సునిశిత పరిశీలన , అధ్యయనం -అన్నీ వృథా.

Show Full Article
Print Article
Next Story
More Stories