తెలంగాణ ఖాతాలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు

తెలంగాణ ఖాతాలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు
x
Highlights

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతని పెంచడమే లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్-2018 అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పదిలక్షలకు...

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతని పెంచడమే లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్-2018 అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పదిలక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలలో విజయవాడకు అగ్రస్థానం లభించింది. లక్ష పట్టణ జనాభా జాబితాలో సిద్దిపేటకు అగ్రస్థానం దక్కింది. సాలిడ్ వేస్ట్ నిర్వహణలో రాష్ట్ర రాజధానుల విభాగంలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. పరిశుభ్రమైన నగరాల్లో ఇండోర్ మొదటిస్థానం, భోపాల్ రెండోస్థానంలో, చండీగఢ్ మూడోస్థానంలో నిలిచాయి.

మూడేళ్లుగా స్వచ్ఛ నగరాలపై సర్వే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల్లో బహిరంగ విసర్జన నివారణ చర్యలు, ఘన వ్యర్థాల సేకరణ, నిర్వహణ, ప్రాసెసింగ్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ఇస్తోంది. 2018 సంవత్సరానికి స్వచ్ఛ స‌ర్వేక్షణ్ ర్యాంకుల‌ను విడుద‌ల చేశారు కేంద్ర ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ. స్వచ్ఛ భారత్ సాధన దిశగా జరుగుతున్న కృషిలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి. నగరాల పారిశుధ్యం విషయంలో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ స్వచ్ఛత దిశగా దూసుకుపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఇరు రాష్ట్రాల్లోని నగరాలకు అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు రాగా.. దక్షిణాదిలో నాలుగు కేటగిరీలకు గాను మూడింట తెలంగాణ టాప్‌లో నిలిచింది.

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఇండోర్, భోపాల్, చండీగఢ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది తొలి రెండు ర్యాంకులు సాధించిన ఇండోర్, భోపాల్ నగరాలు వాటి స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా పది లక్షలకు పైబడిన నగరాల్లో విజయవాడ తొలి స్థానంలో నిలిచింది. ఘ‌జియాబాద్, కోటా త‌రువాత స్థానాల్లో నిలిచాయి. లక్ష నుంచి మూడు లక్షల జనాభా ఉన్న మధ్య తరహా నగరాల్లో ఉత్తమ ఘన వ్యర్థ నిర్వహణ అవలంభించినందుకు తిరుపతి టాప్‌లో నిలిచింది. తెలంగాణకు పలు వేర్వేరు విభాగాల్లో నాలుగు ర్యాంకులు వచ్చాయి. ఉత్తమ ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను పాటించిన రాష్ట్ర రాజధానుల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. దక్షిణాదిలో వేర్వేరు కేటగిరీల్లో ర్యాంకులు ప్రకటించగా.. మూడింట తెలంగాణ టాప్‌లో నిలిచింది. దక్షిణాదిలో లక్షలోపు జనాభా ఉన్న నగరాల్లో స్వచ్ఛమైన సిటీగా సిద్దిపేట, పౌరుల ఫీడ్‌బ్యాక్ విభాగంలో ఉత్తమ పట్టణంగా బోడుప్పల్, ఉత్తమ ఆవిష్కరణలు, పద్ధతులు వినియోగిస్తున్న నగరంగా పీర్జాదిగూడ టాప్ ర్యాంకులు సాధించాయి. స్వచ్ఛ స‌ర్వేక్షణ్‌లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు కోసం అన్ని విధాల ప్రయ‌త్నించినప్పటికి ఆ స్థానం రాక‌పోవడంపై బ‌ల్దియా వ‌ర్గాలు ఒకింత అసంతృష్తితో ఉన్నాయి. అయితే రాజధాని న‌గ‌రాల విభాగంలో మెరుగైన స్థానం రావ‌డంతో ఊరట చెందుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories