ఉగ్రభూతం.. ఎప్పటికి అంతం?

ఉగ్రభూతం.. ఎప్పటికి అంతం?
x
Highlights

ఉ..గ్ర..వా..దం... ఎనిమిదో దశకం నుంచే భారతదేశాన్ని వణికిస్తున్న అంశమిది. ప్రగతి బాటలో పయనిస్తున్న నవభారతంలో ఉన్నట్టుండి ఒక్క కుదుపు.. ఈ ఉగ్రవాదం....

ఉ..గ్ర..వా..దం... ఎనిమిదో దశకం నుంచే భారతదేశాన్ని వణికిస్తున్న అంశమిది. ప్రగతి బాటలో పయనిస్తున్న నవభారతంలో ఉన్నట్టుండి ఒక్క కుదుపు.. ఈ ఉగ్రవాదం. దీనిపేర్లు ఏవైనా కావచ్చు గానీ చూపిస్తున్న ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటోంది. ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ రాష్ట్రంలో మొదలైన ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారీ ఎత్తున ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నిర్వహించాల్సి వచ్చింది. దాంతో దేశంలో ఉగ్రవాదం దాదాపుగా ముగిసినట్లేనని అనుకుంటున్న తరుణంలో.. ఆ తర్వాత తొమ్మిదో దశకం ప్రారంభంలో మళ్లీ ఉగ్రవాదం ఆనవాళ్లు మన దేశంలో కనిపించాయి. అప్పటివరకు ఇక్కడ పెద్దగా కనిపించని ముస్లిం ఉగ్రవాదం ఒకేసారి పెద్దస్థాయిలో కనిపించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో 1993 మార్చి 12న రెండు గంటల వ్యవధిలో జరిగిన వరుస ఆర్డీఎక్స్ పేలుళ్లలో 257 మంది దుర్మరణం పాలయ్యారు.713 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఆర్డీఎక్స్ వినియోగం జరగడం అదే మొదటిసారని తేలింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకునేందుకు దావూద్ ఇబ్రహీం ఆధ్వర్యంలోని డి కంపెనీ మాఫియా పేలుళ్లకు వ్యూహరచన చేసింది. దావూద్‌తో పాటు టైగర్ మెమన్, మొహమ్మద్ దోసా, ముస్తఫా దోసా ఈ దాడుల కుట్రలో పాలు పంచుకున్నారు. భారత ప్రభుత్వాన్ని భయపెట్టడం, ప్రజల్లో భయాందోళనలు కలిగించడం, ఓ వర్గం ప్రజలను భారతీయ సమాజానికి దూరం చేయడం, దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడం కుట్ర ప్రధానోద్దేశం.

ముంబైలోని వివిధ ప్రాంతాల్లో కేవలం రెండు గంటల వ్యవధిలో 12 బాంబులు పేలాయి. ఇలా వరుస బాంబు పేలుళ్లు జరగడం అప్పటికి ప్రపంచంలోనే తొలిసారి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెల్లార్లో తొలి బాంబు పేలింది. కార్లు, స్కూటర్లలో బాంబులు పెట్టారు. సూట్కేసులలో బాంబులు పెట్టి హోటళ్లలో విడిచిపెట్టారు. వాస్తవానికి శివాజీ జయంతి సందర్భంగా ఏప్రిల్లో ఈ దాడులు చేయాలనుకున్నారు. కానీ ఉగ్రవాద శిక్షణకు ఎంపిక చేసిన గుల్ నూర్ మొహమ్మద్ షేక్ను మార్చి 9న పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్లాన్ లీక్ అవుతుందనే భయంతో మార్చి 12నే అమలు చేశారు.

ఆ తర్వాత కూడా వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట వరుసపెట్టి పేలుళ్లు, కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రధానంగా పాకిస్తాన్ కేంద్రంగా వేళ్లూనుకున్న లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు నిరుద్యోగ, నిరుపేద యువతను చేరదీసి.. వారిని తమ విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టి వారిని ఉగ్రవాదంలోకి లాగుతున్నాయి. ఆత్మాహుతి దాడులకు పాల్పడటం అల్లాకు సేవ చేయడమేనని, జిహాద్ (పవిత్రయుద్ధం)లో పాల్గొనేవారు నేరుగా స్వర్గానికి వెళ్తారని మభ్యపెట్టడమే కాక.. అందుకు సిద్ధపడేవారి కుటుంబాలకు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెప్పడంతో చాలామంది పేద యువకులు దీనివైపు ఆకర్షితులు కావడం మొదలైంది. ప్రధానంగా పాకిస్తాన్‌లోని ముస్లింలలో పెద్ద కుటుంబాలు ఉండటం, వాళ్లలో పేదరికం కూడా భరించలేని స్థితికి చేరడంతో.. ఎలాగోలా తాము లేకపోయినా కుటుంబం కష్టాలు తీరుతాయన్న ఉద్దేశంతో ఎక్కువమంది ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరాలవైపు ఆకర్షితులవుతున్నారు. ఇక అక్కడ వారికి ముందుగా సర్వ సుఖాలు అలవాటు చేసి ఆ తర్వాత ఆయుధ శిక్షణ, బాంబుల తయారీ, బాంబులను ఉపయోగించడం, అత్యాధునిక పేలుడు సామగ్రి వాడకం లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) హస్తం కూడా ఉందనేది చెప్పక తప్పని విషయం. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇప్పించేది కూడా పాక్ ప్రభుత్వమేనన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వం నుంచి అందుతున్న అండదండలతో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టారు.

చివరకు 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో మరో మారణహోమం సృష్టించారు. ఈసారి మరింత అత్యాధునిక శిక్షణ పొందిన ఉగ్రవాదులను తయారుచేశారు. ప్లాన్ కూడా పక్కాగా రచించారు. ఆ ఉగ్రవాద దాడిలో 166 మంది మరణించారు. వీరిలో పోలీసులు, పౌరులతో పాటు విదేశీయులు ఉన్నారు. పాకిస్థాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు అరేబియా సముద్రం నుంచి ముంబైలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. ఆరోజు రాత్రి తొలుత ఏదో థియేటర్లో రెండు మాఫియా గ్యాంగుల మధ్య కాల్పులు జరుగుతున్నాయని భావించారు. కానీ క్రమంగా రైల్వేస్టేషన్, లియోఫోల్ కేఫ్‌లలో కూడా దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలా ఒకేసారి వేర్వేరుచోట్ల కాల్పులు, బాంబుల మోతలు వినిపించడంతో ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని నిర్ధారణకు వచ్చారు. నేషనల్ సెక్యూరిటీ గార్డులు స్పందించి అక్కడకు చేరుకునేలోపే తాజ్ హోటల్ లో కూడా ఉగ్రవాదులు ప్రవేశించి, దాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆరోజు జరిగిన అతిపెద్ద తప్పిదం.. మీడియా కవరేజి. అప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా భారతదేశంలో విస్తృతంగా ఉంది. లైవ్ కవరేజి జాడ్యం పట్టుకుంది. ఉగ్రవాద దాడులు జరుగుతున్నప్పుడు భద్రతాదళాలు వారిని ఎలా మట్టుబెడతాయో తాము లైవ్ కవరేజిలో చూపించాలన్న అత్యుత్సాహం.. చివరకు ఉగ్రవాదులకు చక్కగా ఉపయోగపడింది. ఏయే మార్గాలలో భద్రతాదళాలు వస్తున్నాయన్న విషయాన్ని ఎంచక్కా భారత టీవీ చానళ్లలో చూస్తున్న పాక్ మూకలు.. అక్కడినుంచి తమవాళ్లకు శాటిలైట్ ఫోన్ల ద్వారా మొత్తం సమాచారాన్ని అందిచడంతో బయట ఏం జరుగుతోందో కూడా లోపలున్న ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు తెలిసిపోయి వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే మారణహోమం తీవ్రత మరింత పెరిగిందని కూడా అంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఆ తర్వాత గానీ అసలు విషయం ఎవరికీ తెలియలేదు.

ఎక్కువగా విదేశీయులు చేరే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు.. బాంబులు విసిరి, కాల్పులు జరిపి మొత్తం రక్తపాతం సృష్టించారు. ఒకచోటు నుంచి మరో చోటుకు కార్లలో వెళ్లి మరీ ప్రాణాలు తీశారు. ఈ దాడిలో భారత భద్రత బలగాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చగా, ఒక్క అజ్మల్ కసబ్ మాత్రం ఒక పోలీసు అధికారి సమయస్ఫూర్తి వల్ల ప్రాణాలతో దొరికాడు. అప్పటికి కసబ్ కూడా మరణించినట్లు నటిస్తూ పడుకుని ఉండగా.. అతడి గుండె కొట్టుకోవడం, శ్వాస ఆడటం లాంటివి గమనించిన సదరు పోలీసు అధికారి.. ఓ ఉగ్రవాది బతికే ఉన్నాడని ఉన్నతాధికారులకు చెప్పారు. ఇలాంటి సందర్భాలలో సజీవంగా పట్టుకోవడం ఎంత ముఖ్యమో గుర్తించడం ఆయన చేసిన మంచి పని. దానివల్లే మొత్తం ఉగ్రవాద కుట్ర అంతా బయటపడింది. పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు వాళ్లకు ఎలా సాయపడ్డారో, తాము ఎక్కడినుంచి బయల్దేరి ముంబైలోకి ఎలా ప్రవేశించామో మొత్తం వృత్తాంతం అంతటినీ కసబ్ విచారణలో వెల్లడించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం కసబ్‌ను ఉరి తీశారు. ఈ ఘటనతో సంబంధం లేదని తొలుత పాక్ ప్రకటించినా, కసబ్, ఇతర ఉగ్రవాదులు పాక్ జాతీయులనేని అంగీకరించింది. ముంబై ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌లోనే పథకం రచించి.. పాక్ గడ్డపై నుంచే ఉగ్రవాదులు ముంబైకి వచ్చి మారణహోమం సృష్టించారని పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాజీ డీజీ తారిఖ్ ఖోసా ఆ తర్వాత ఓ సందర్భంలో అంగీకరించారు. వెల్లడించారు. దీనిపై ఆయన పాక్ పత్రిక ఒకదాంట్లో సుదీర్ఘంగా వ్యాసం రాశారు. ఉగ్రవాదులు ముంబైకి వచ్చిన తీరు, పాకిస్థాన్ నుంచి వారికి నిర్దేశం చేయడం, ముంబై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణ పరిస్థితుల గురించి తారిఖ్ ఈ వ్యాసంలో వెల్లడించారు.

ఒక్క భారతదేశమే కాదు.. ప్రపంచంలో అన్ని దేశాలూ ఉగ్రవాద దాడుల బారిన పడుతూనే ఉన్నాయి. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఇరాక్, సిరియా లాంటి దేశాలలో ఇటీవలి కాలంలో ఇస్లామిక్ స్టేట్ ఎంతటి భయోత్పాతాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. అల్ కాయిదా తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రమాదకారిగా మారిన ఉగ్రవాద సంస్థ.. ఇస్లామిక్ స్టేట్. ప్రపంచం మొత్తం ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని, అక్కడ షరియాను అమలుచేయాలని కలలు గంటూ అందుకోసం దేశాలకు దేశాలనే ఆక్రమించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఖలీఫా సామ్రాజ్యాన్ని తీసుకొస్తామని పగటి కలలు కంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన పేద ముస్లిం యువకులను ఆకర్షించి, వారికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చి వారిని బలిపశువులుగా ముందుకు పంపి దాడులు చేయించింది. అయితే ఇస్లామిక్ స్టేట్ మీద ప్రపంచ దేశాలన్నీ కలిసి విరుచుకుపడటంతో చివరకు తనకు మొదట్లో బాగా పట్టున్న సిరియా, ఇరాక్ ప్రాంతాలలో కూడా తోకముడవక తప్పలేదు.

పేరు ఏదైనా.. ఉగ్రవాదం మాత్రం ప్రపంచానికి మంచిది కాదు. ఎప్పటికీ ఆ మార్గంలో లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదు. ఎవరైనా ఒకరు ముందుకెళ్లాలంటే స్వయంకృషికి తోడు పదిమంది సాయం తీసుకుని వెళ్లాలే గానీ.. తనకంటే ముందున్న పదిమందిని తొక్కేసి లేదా హతమార్చి ముందుకు వెళ్లాలనుకోవడం అవివేకం. ఉగ్రవాదుల ఆలోచన అచ్చం ఇలాగే ఉంటోంది. ఒకచోట అంతం చేసినా మరోచోట ఏదో ఒకరూపంలో ఇది కనిపిస్తూనే ఉంది. తాలిబన్లు, ఇస్లామిక్ స్టేట్, లష్కరే తాయిబా, జైషే మహ్మద్.. ఇలా పేర్లు ఏవైనా అందరి తీరు ఒకటే. విధ్వంసం సృష్టించడం, దాని ద్వారా తమ ఉనికిని చాటుకోవడం. పోనీ దానివల్ల ఇప్పటివరకు ఎవరికైనా ఏవైనా ప్రయోజనాలు కనిపించాయా అంటే.. లేదు. అందువల్ల మౌలికంగా ఉగ్రవాదం అనే భావననే తుడిచిపెట్టేయాలి. అప్పుడుగానీ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది.. ఆ భావన ఉన్నన్నాళ్లూ ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక పేరుతో మళ్లీ ఆ భూతం లేస్తూనే ఉంటుంది. అందుకని శాశ్వతంగా ఆ భావననే అంతం చేస్తే తప్ప ప్రయోజనం ఉండదు.

చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

Show Full Article
Print Article
Next Story
More Stories