మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ జాతరకు హాజరయ్యేందుకు భక్తులు గత వారం నుంచి క్యూకట్టారు. దీంతో...
మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ జాతరకు హాజరయ్యేందుకు భక్తులు గత వారం నుంచి క్యూకట్టారు. దీంతో మేడారం దారులన్నీ కిటికిటలాడుతున్నాయి. జాతరకు అందుకోలేమనుకున్న భక్తులు ముందుగా దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే గతవారంలో 40లక్షలమందికి పైగా దర్శించుకున్నారని అంచనా. మూడురోజుల పాటు జరిగే ఈ జాతరకు కోటిమందికి పైగా భక్తులు వనదేవతల్ని దర్శించుకుంటున్నారని సమాచారం.
సమ్మక్క - సారలమ్మ జాతర విశిష్టత
తెలంగాణ కుంభమేళా అనిపిలవబడే సమ్మక్క - సారక్క జాతర పై చరిత్ర చెప్పిన వివరాల ప్రకారం తన కుటుంబ పెద్ద కోసం ఆ కుటుంబంలోని సభ్యులు ప్రాణాలు అర్పించిన త్యాగం మనకు గోచరిస్తుంది. జాతర గురించి ముందుగా తెలుసుకోవాలంటే మనదేశంలో కుంభమేళా తరువాత అతిపెద్ద గిరిజన పండుగగ చెప్పుకునే ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కాబట్టే ఈ పండగను తెలంగాణ కుంభమేళా అనిపిలుస్తారు.
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా మనదేశంలోనే వనదేవతులుగా సమ్మక్క-సారక్క లు పూజలందుకుంటున్నారు.
ఎవరీ సమ్మక్క- సారలమ్మ?
12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఉన్న 'పొలవాస' ను పరిపాలించే గిరిజన దొర మేడరాజు. అయితే తన ఏకైక కుమార్తె సమ్మక్కను మేనల్లుడైన మేడారంను పాలించే పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. ఈ పుణ్య దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు.
ఇదిలా ఉంటే కాకతీయల మొదటి ప్రభువు ప్రతాప రుద్రుడికి రాజ్య విస్తరణ చేయాలనే కోరిక అమితంగా ఉండేది. అందుకోసం తన సైన్యంతో ఇతర రాజ్యలపై దండెత్తి వాటిని స్వాధీనం చేసుకొని తన రాజ్యంలో కలుపుకుంటాడు. అలా రాజ్యవిస్తరణలో భాగంగా ప్రతాపరుద్రుడు గిరిజన దొర మేడరాజు పాలించే పొలవాసపై దండెత్తుతాడు. ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడి దాడితట్టుకోలేని మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు.
ఇక మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకలతో పన్నుచెల్లించలేకపోతాడు. రాజ్యం విస్తరణ కాంక్షలో ప్రతాపరుద్రుడు మేడారాన్ని దక్కించుకోవాలనే దురుద్దేశంతో పగిడిద్ద రాజుపై కుట్రపన్నుతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో తనకు వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడంటూ ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.
జాతర విశిష్టత
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము (బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళె కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవములో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర.
తెలంగాణా కుంభమేళా
తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు, అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకు వస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు . 1996 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్,ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .
మేడారం జాతర…వన్ వే రూట్ వివరాలు
? వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే వాహనాలు ములుగు, పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి,
? తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధరం కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల,గుడేపాడ్ మీదుగా హన్మకొండకు చేరుకుంటారు,…
? గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం కాటారం మీదుగా వచ్చే వాహనాలు, భూపాలపల్లి,ములుగు ఘన్ పూర్, జంగాల పల్లి నుంచి పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి
? తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్ నుండి కాటారం లేదా కాల్వపల్లి, సింగారం, బోర్లగూడెం, పెగడ పల్లి, చింతకాని,మీదుగా కాటారం, చేరుకోవచ్చు.
? ఛత్తీస్ ఘడ్, భద్రాచలం, మణుగూరు నుంచి వాహనాలు, ఏటూరు నాగారం, చిన్న బోయినపల్లి, కొండయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకుని, తిరుగు ప్రయాణంలో ఇదే దారిలో వెళ్ళిపోతారు.
? మహబూబాబాద్ నుంచి వచ్చే వాహనాలు, నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి, ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా, మేడారం చేరుకుని,
? తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా మళ్ళీ మల్లంపల్లి మీదుగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire