రాంబాబు పయనమెటూ.. వైసీపీలోనేనా..?

రాంబాబు పయనమెటూ.. వైసీపీలోనేనా..?
x
Highlights

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వలసలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది టీడీపీ. అయితే టీడీపీలోని ...

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వలసలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది టీడీపీ. అయితే టీడీపీలోని వైరివర్గాలు కొంతమంది వైసీపీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గత ఎన్నికల్లో వైసీపీతరుపున పోటీ చేసి గెలిచారు ముత్తుముల అశోక్ రెడ్డి. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అయన అధికార టీడీపీలో చేరిపోయారు. ఈ పరిణామం ఆయనపై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు రుచించలేదు. అయన రాకతో అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తాను వైసీపీలో చేరబోతున్నట్టు రాంబాబు చెప్పారు. ఆ తరువాత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు మద్దతు కూడా ప్రకటించారు. అయితే ఈ పరిణామాలు జరిగి మూడు నెలలు అవుతున్నా.. రాంబాబు మాత్రం రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి కారణం సీటు గ్యారెంటీ లేకపోవడమే అని తెలుస్తోంది .వైసీపీలో చేరితే తనకు కచ్చితంగా గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని రాంబాబు కండిషన్ పెట్టారట.

దాంతో ఆ పార్టీలో అంతర్గత చర్చ మొదలైంది. ఆయనకు టికెట్ ఇవ్వాలనుకుంటే మాజీ ఎమ్మెల్యే సాయికల్పన, ప్రస్తుత ఇంచార్జ్ ఐవి రెడ్డిలను ఒప్పించాలి. ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం ముందే ఇలా చేయడం రిస్క్ తో కూడుకున్న పని.. ఒకవేళ రాంబాబుకే టికెట్ అని ఆయనను పార్టీలో చేర్చుకుంటే.. మిగతా వారు వైసీపీలో కొనసాగుతారో లేదో అన్న అనుమానం కీలక నేతల్లో ఉంది. ఈ క్రమంలోనే రాంబాబు చేరిక నిర్ణయాన్ని వాయిదా వేసింది. మరోవైపు రాంబాబు జనసేనవైపు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుపున అయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గిద్దలూరులో కాపు ఓటు బ్యాంకు బలంగా ఉన్న కారణంగా గెలుపు ఈజీ అవుతుందన్న ఆలోచనలో రాంబాబు ఉన్నారట. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించినా జనసేనపై కూడా ఆలోచన చేస్తున్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి రాంబాబు చెప్పినట్టు ఆయన పయనం వైసీపీతోనా లేక జనసేనతోనో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories