అక్షయ తృతీయ అసలు నిజం

అక్షయ తృతీయ అసలు నిజం
x
Highlights

అక్షయ తృతీయ వస్తే...ప్రతి ఒక్కరు బంగారం షాపులకు క్యూకడుతారు. డబ్బున్న వారి సంగతి అంటుంచితే...డబ్బు లేని కూడా కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనుగోలు...

అక్షయ తృతీయ వస్తే...ప్రతి ఒక్కరు బంగారం షాపులకు క్యూకడుతారు. డబ్బున్న వారి సంగతి అంటుంచితే...డబ్బు లేని కూడా కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అసలు అక్షయ తృతీయకు ఉన్న ప్రాధాన్యత ఏంటీ ? అక్షయ తృతీయకు పురాణాల్లో ఉన్న విశిష్టత ఏంటీ ?

అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. మత్స్య పురాణంలో 65 అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది. పుణ్య కార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.

అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి లాంటి నగలు, ఆభరణాలు కొనుగోలు చేయడం అలావాటుగా మారింది. అక్షయ తృతీయ రోజు ఏ శుభ కార్యాన్నైనా వారం, వ్యర్జం, రాహు కాలంతో నిమిత్తం లేకుండా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసి బ్రాహ్మాణులకు దానం చేస్తే మంచి జరుగుతుందని ప్రజల్లో నమ్మకముంది. అంతేకాదు గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు ప్రారంభించవచ్చని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారులు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించారు. పది వేల విలువ చేసే వస్తువు కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ ఇస్తామని, పది గ్రాముల బంగారం కోనుగోలు చేస్తే ఒక గ్రాము ఉచితంగా ఇస్తామని ప్రత్యేక ఆపర్లు ప్రకటించాయ్.

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభాలు జరుగుతాయా ? ఆ రోజు బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేయాలి ? బంగారం కొన్న వారికే అదృష్టం వరిస్తుందా ? కొనుగోలు చేయని వారికి కష్టాలు వస్తాయా ? అక్షయ తృతీయను...బంగారం అమ్ముకోవడానికి వ్యాపారులు సృష్టించారా ?

అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం వరిస్తుందా అన్న దానిపై మహిళల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటేనే అదృష్టం వస్తుందా ? మిగతా రోజుల్లో బంగారం కొనుగోలు చేస్తే దురదృష్టం వెంటాడుతుందా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజు బంగారం ధరలను పెంచేస్తారని అది తెలియక జనం షాపులకు క్యూ కడుతున్నారని అంటున్నారు. డబ్బున్న వారు బంగారం కొంటారు సరే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు అక్షయ తృతీయ అంటేనే తమకు నమ్మకం లేదని మహిళలు చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేశామని అయితే తమకు ఎలాంటి అదృష్టం రాలేదని గృహిణి తెలిపారు. బంగారం అంతకుముందు కొన్నాం అదే రోజు కొన్నామని అదృష్టం గానీ, దురదృష్టం గానీ రాలేదని చెబుతున్నారు. అక్షయ తృతీయ అన్నది ఓ మూఢ నమ్మకమని చెబుతున్నారు.

అక్షయ తృతీయ అన్నది భారతదేశంలో ఆనాది వస్తున్న ఒక ఆచారమని చంద్రశేఖర శర్మ సిద్ధాంతి చెబుతున్నారు. జపం చేసినా వ్రతం చేసినా అక్షయమవుతుందని తెలిపారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడా లేదని చెబుతున్నారు.

బంగారం కొనుగోలు చేయాలంటే అక్షయ తృతీయ రోజే కొనాలని రూలేమీ లేదని సిద్ధాంతులు చెబుతున్నారు. అయితే వ్యాపారులు సొమ్ము చేసుకోవడానికే ఇలాంటివి క్రియేట్‌ చేస్తున్నారని మహిళలు అంటున్నారు. ఆర్భాటపు ప్రకటనలు, ప్రచారాలతో మోసపోవద్దని బంగారాన్ని ఆభరణంగానో, పెట్టుబడిగానో భావిస్తే మాత్రమే కొనాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories