కొండగట్టు రోడ్డు ప్రమాదానికి అసలు కారణం తెలిసింది!

కొండగట్టు రోడ్డు ప్రమాదానికి అసలు కారణం తెలిసింది!
x
Highlights

కొండగట్టు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 51 మంది ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అడుగడుగునా డ్రైవర్ అ జాగ్రత్త కూడా...

కొండగట్టు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 51 మంది ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అడుగడుగునా డ్రైవర్ అ జాగ్రత్త కూడా కనిపిస్తోంది. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ డబ్బులకు కక్కుర్తి పడి 88 మందిని ఎక్కించారు. పైగా ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశమున్న చోట్ల కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నచోట్ల స్పీడ్ బ్రేకర్‌ను సూచిస్తూ ఎలాంటి గుర్తులూ లేవు. బస్సు కూడా ఏ మాత్రం కండీషన్‌లో లేనిదని విజువల్స్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.

బస్పు ప్రమాదం జరిగిన తీరు చూస్తే డ్రైవర్ అజాగ్రత్తే ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ఘాట్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ , మలుపు ఉన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ చాలా వేగంగా బస్సుని నడిపాడు. స్పీడ్ బ్రేకర్ కారణంగా బస్సు పైకి ఎగరడంతో ప్రయాణికులు కూడా ఎగిరిపడ్డారు. అదే సమయంలో డ్రైవర్ వెనుక పక్క కూర్చున్న ప్రయాణికులు పట్టు తప్పి డ్రైవర్‌పై పడ్డారు. డ్రైవర్ చేతి నుంచి స్టీరింగ్ అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. బస్సు పడిన ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లుండటం, వాటిపై బస్సు పడటంతో అవి గుచ్చుకుని కొందరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నిజానికి శనివారం పేట నుంచి జగిత్యాల వెళ్లే మార్గం ఈ ఘాట్ రోడ్డు కాదు. కానీ ఈ మార్గంలో వెళితే ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతారన్న ఆశతో బస్సు ఈ మార్గం నుంచి నడిపారు. ఈ ఘూట్ రోడ్డు కేవలం భక్తుల కోసం వేశారు. ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డు మార్గం ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి అనువుగా ఉండదు. అందువల్ల ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలోకి రావు. ఆర్టీసీ సర్వీస్ రూట్ కాకపోయినా బస్సు ఈ మార్గంలో నడపడం వల్ల ప్రమాదం జరిగింది. అనువైన మార్గం కాకపోయినా జగిత్యాల డిపో మేనేజర్ ఈ రూట్‌లో బస్సులు నడిపేందుకు అనుమతినివ్వడంతో, గత కొద్దిరోజులుగా ఇటువైపు బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ అధికారుల కాసుల కక్కుర్తి 51 మంది ప్రాణాలు తీసింది.

గతంలో ఇదే ప్రాంతంలో ఓ లారీ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదమప్పుడే అధికారులు ఈ ఘాట్‌ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. కేవలం బైక్స్‌ను మాత్రమే అనుమతించేవారు. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుకు ప్రత్యామ్నయంగా బైపాస్‌ రోడ్డు కూడా ఉంది. కానీ గత మూడు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్‌ వాహనాలను మళ్లీ అనుమతిస్తున్నారు. ఘాట్‌ రోడ్డు నుంచి హైవేపైకి కిలోమీటర్‌ దూరం ఉంటుంది. ప్రత్యమ్నాయ రోడ్డు ఉపయోగిస్తే మరో ఐదు కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతోనే ఆర్టీసీ అధికారులు డిజీల్‌కు కక్కుర్తిపడి బస్సులను షార్ట్‌కట్‌గా భావించిన ఘాట్‌రోడ్డు రూట్‌లో నడిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories