ఉత్తమ్.. కేటీఆర్... ఓ వృద్ధ జంట

x
Highlights

ఉన్నది పది అడుగుల గుడెస... తాళ్లు పేనుకుంటూ జీవనయాత్ర సాగిస్తున్న వృద్ధ దంపతులు, ఆదుకునే బిడ్డలు లేదు.. అన్నం పెట్టే నాధుడు లేడు.. రోజూ నాలుగువేళ్లూ...

ఉన్నది పది అడుగుల గుడెస... తాళ్లు పేనుకుంటూ జీవనయాత్ర సాగిస్తున్న వృద్ధ దంపతులు, ఆదుకునే బిడ్డలు లేదు.. అన్నం పెట్టే నాధుడు లేడు.. రోజూ నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లే పరిస్థితి లేదు.. కానీ దోచుకునే అధికారులు పక్కనే ఉన్నారు.. గుడిసెపై 500 ఆస్తి పన్ను వేశారు అధికారులు.. ఇదేంటి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదు... వృద్ధుడికి వచ్చే నెలవారీ ఫించన్ నుంచి కట్ చేసుకొని మిగిలింది ఇచ్చారు.. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్లూర్‌ మండలం కర్దెల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ ఉదంతాన్ని ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు చెల్లించిన ఆస్తి పన్నును వెనక్కి ఇప్పించడంతో పాటు వారికి డబుల్‌బెడ్‌ రూం ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులు నిర్దయగా వ్యవహరించారని ఉత్తమ్‌ తప్పుపట్టారు. దీనికి కేటీఆర్‌ స్పందించి ఈ పొరపాటును సరిదిద్దాలని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఆ దంపతులకు డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని మంజూరు చేయాలని కోరారు. వృద్ధాప్య పింఛన్‌ రాని పక్షంలో అదీ మంజూరు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఉత్తమ్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ ఆదేశాలపై కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ ప్రశాంత్‌ జీవన్‌ ట్వీటర్‌లో స్పందించారు. ఈ విషయం తన దృష్టికి నాలుగు రోజుల క్రితమే వచ్చిందని.. వెంటనే బాధితులకు ఆస్తిపన్ను తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. ఆ వృద్ధ దంపతులకు ఇప్పటికే ఆసరా పింఛన్‌ అందుతోందని.. డబుల్‌ బెడ్‌రూం పథకం కింద ఇంటిని మంజూరు చేస్తామని కేటీఆర్‌కు ఆయన బదులిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories