కన్నడనాట కొత్త కేబినెట్‌.. 34 మందితో విస్తరణ

కన్నడనాట కొత్త కేబినెట్‌.. 34 మందితో విస్తరణ
x
Highlights

కర్ణాటకలో కొత్త కేబినెట్ కూర్పు కసరత్తు పూర్తయ్యింది. 34 మందితో మంత్రి మండలి ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు, జేడీఎస్‌కు...

కర్ణాటకలో కొత్త కేబినెట్ కూర్పు కసరత్తు పూర్తయ్యింది. 34 మందితో మంత్రి మండలి ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 12 బెర్తులు దక్కబోతున్నాయి. అయితే బలనిరూపణ తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక స్పీకర్‌ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ స్పీకర్‌ జేడీఎస్‌కు ఇస్తారు.

కర్ణాటకలో మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్‌–జేడీఎస్‌ల మధ్య అంగీకారం కుదిరింది. 34 మందితో ఏర్పడే కేబినెట్‌లో..సీఎంతో కలిపి జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవితో కలపి కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు వరించనున్నాయి. జేడీఎస్ 37 సీట్లు , కాంగ్రెస్‌కు 78 సీట్లు ఉండడంతో ఆ నిష్పత్తి ప్రకారం మంత్రి పదవులు తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయవచ్చన్న సంకేతాల నేపథ్యంలో బలపరీక్ష ముగిసిన వెంటనే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్, జేడీఎస్‌ ఉన్నాయి.

కర్ణాటక మంత్రి వర్గంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండాలనే ప్రతిపాదన వచ్చినా.. జేడీఎస్‌ అంగీకరించకపోవడంతో చివరకు ఒకరికే అవకాశం కల్పించారు. అసెంబ్లీలో 24వ తేదీన బల పరీక్ష ముగిశాక మంత్రుల పేర్లను ప్రకటిస్తారు. నిజానికి తమకే ఎక్కువ పదవులు దక్కాలని కాంగ్రెస్‌ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి ఇస్తామని ప్రతిపాదించారు. డిప్యూటీ స్పీకర్‌ జేడీఎస్‌కు తీసుకోబోతోంది. 24న బలనిరూపణ తర్వాత 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కేఆర్‌. రమేష్‌ పేరు దాదాపు ఖరారైంది.

ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి సిల్కు చొక్కా, పట్టు పంచెతో హాజరవుతారు. తొలుత విధానసభ ప్రాంగణంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో వీఐపీలు కూర్చోడానికి వీలుగా మూడు వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడం, బల నిరూపణకు ముందే 19వ తేదీన రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో 37 సీట్లున్న జేడీఎస్, 78 సీట్లున్న కాంగ్రెస్‌ కలసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.

బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యేందుకు, రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఈ కార్యక్రమం వేదికగా మారనుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, ఏపీ, ఒడిశా సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, విజయన్, చంద్రబాబు, నవీన్‌ పట్నాయక్, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎంఎన్‌ఎం నేత కమల్‌ హాసన్‌ తదితరులు హాజరవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories