న్యూస్ పేపర్లో ప్రచురితమైన వార్త ప్రభుత్వాలను కదిలిస్తుంది..టీవీలో కనిపించే దృశ్యం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రేడియోలో వినిపించే ఒక...
న్యూస్ పేపర్లో ప్రచురితమైన వార్త ప్రభుత్వాలను కదిలిస్తుంది..టీవీలో కనిపించే దృశ్యం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రేడియోలో వినిపించే ఒక స్వరం ప్రజలను చైతన్యపరుస్తుంది. పాత్రికేయానికి ఉన్న పవర్ అలాంటిది..తమ కలంతో సామాన్యుల పరిస్థితిని, వారి బాధామయ గళాలను వినిపిస్తూ సమాజసేవలో తమ వంతు పాత్ర పోషించే జర్నలిస్టులకు మనదేశంలో రక్షణ కరువైంది. సిరా చుక్కల స్థానంలో నెత్తురు చుక్కలు దర్శనమిస్తున్నాయి. అకృత్యాలను అమానుష చర్యలను ఎదిరించి ప్రశ్నించి వార్తలు రాసిన పాపానికి ప్రాణాలను బలి పెట్టాల్సి వస్తోంది.
బెంగుళూరుకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరి లంకేష్‌పై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఫైరింగ్ జరిపారు. ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. గౌరి ఛాతిలో దుండుగులు కాల్చినట్లు ఆమె సోదరుడు చెప్పాడు. గౌరి ఓ కార్యకర్త అని, ఆమె కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లేది అని, ఇప్పటి వరకు ఆమెకు ఎటువంటి బెదిరింపులు లేవని ఇంద్రజిత్ తెలిపాడు. నేత్రాదానం చేయాలన్నది ఆమె ఆకాంక్ష అని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురికావడంతో దేశంలో జర్నలిస్టుల పరిస్థితి మరోసారి చర్చకు వచ్చింది. గౌరీలంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత కిరాతకంగా జరిగిన ఆమె హత్యపై పాత్రికేయ లోకం భగ్గుమంటోంది. ఆమెను కాల్చిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. గౌరీలంకేశ్ హత్యను ఐండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఖండించింది.ఈ హత్యపై ఎడిటర్స్ గిల్డ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి.. అసమ్మతి వాదాన్ని వినిపించిన ఆమెను హత్య చేయడమంటే.. భావప్రకటనా స్వేచ్ఛపై కిరాతకంగా దాడిచేయడమేనని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది.
గౌరి లంకేష్ మర్డర్ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె సోదరుడు ఇంద్రజిత్ లంకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు గౌరి హత్యను ఖండిస్తూ బెంగుళూరు టౌన్‌హాల్లో కొందరు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా సంతాప సమావేశం నిర్వహించారు. భారతదేశంలో పాత్రికేయులు అత్యంత విషమ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తు న్నారని న్యూయార్క్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. అంతేకాకుండా జర్నలిస్టులకు రక్షణ లేని దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2015లో 110 మంది జర్నలిస్టులు హత్యగావింపబడ్డారు..వీరిలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్లినవారు 69 మంది చనిపోగా..43 మంది అసలు ఎందుకు చనిపోయారో కూడా కారణం తెలియదు. ఇదే సమయంలో భారత్‌లో 28 మంది పాత్రికేయులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రధానంగా ఆయిల్ మాఫియా, అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణ, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో విభేదాలు వంటి పలు కారణాలతో జర్నలిస్టులు హత్యగావింపబడ్డారు.
ప్రస్తుతం అత్యాచారం, హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీంకు వ్యతిరేకంగా కథనాలు రాసిన విలేకరి..రామచంద్ర చత్రపతిని కూడా గుర్మీత్ అనుచరులు చత్రపతి కార్యాలయంలోకి చొరబడి తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఇంకా మనం మరవలేదు. మిడ్ డే ప్రతికకు చెందిన క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయి డేను అండర్ వరల్డ్ మాఫియా 2011లో హత్య చేసింది. మహారాష్ట్రకు చెందిన సంపాదకుడు నరేంద్ర దబోల్కరును 2013 ఆగస్టు లో ఒక ఆలయం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హిందీ దైనిక్ దీనబంధు విలేకరి సాయిరెడ్డి.. ఛత్తీస్‌ఘడ్‌లోని నక్సల్ ప్రభావిత జిల్లా బీజాపూర్‌లో అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. 2013లో యూపీలోని ముజఫర్‌నగర్లో ‘నెట్వర్క్ 18’కు చెందిన విలేకరి రాజేష్ వర్మను తుపాకీతో కాల్చి చంపేశారు. ఫేస్‌బుక్‌లో మంత్రిగారికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడనే అక్కసుతో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూరుకు చెందిన విలేకరి జోగేంద్ర సిన్హాను సజీవ దహనం చేశారు. 2014 మే 27న ఒడిశాలోని స్థానిక టీవీ ఛానల్ స్ట్రింగర్ తరుణ్ కుమార్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ఎంవీఎన్ శంకర్ హత్యకు గురయ్యారు.
ఎంవీఎన్ ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఆయిల్ మాఫియాపై పలు కథనాలు అందించారు. 2015 జూన్లో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో విలేకరి సందీప్ కొఠారీని సజీవ దహనం చేశారు. వ్యాపం కుంభకోణంపై పరిశోధన చేస్తున్న ఆజ్‌తక్ రిపోర్టర్ అక్షయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. ఆయన మరణానికి కారణాలు నేటి వరకూ తెలియదు. 2016 మే 13న బీహార్లోని హిందీ దైనిక్ హిందుస్థాన్‌కు చెందిన జర్నలిస్టు రాజ్‌దేవ్ రంజనును తుపాకీతో కాల్చి చంపారు. బయటి ప్రపంచానికి తెలిసినవి ఇవి కొన్ని మాత్రమే..ఇంకా ఆచూకీ లేక గల్లంతైన వారు.. అనుమానాస్పదంగా మరణించినవారికి సంబంధించిన వివరాలకు లెక్కే లేదు.
ఇలాంటి వాటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహా అనేక జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా చర్యలు మాత్రం శూన్యం. బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. ఆమెపై నిన్న రాత్రి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేసిన ఘటనపై బెంగళూరు సహా ఢిల్లీలో పలు నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాధసింగ్ స్పందించారు. వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అంతే తరువాత మామూలే. ప్రభుత్వం వైపునుంచి స్పందన కరువు. షరా మామూలే..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire