ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం

ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం
x
Highlights

రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతరకు వివిధ జిల్లాల నుంచి...

రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతరకు వివిధ జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలి రానున్నారు. వారం రోజుల పాటు వైభవోపేతంగా ఈ జాతర జరుగనుంది. ఊరూరా జాతరలు మామూలే. జాతర జరగని గ్రామాలు చాలా అరుదుగా వుంటాయి. ఊరికో జాతర ఉన్నట్లే జాతరకో ప్రత్యేకత ఉంటుంది. ఓ నేపథ్యం వుంటుంది. అయితే వారం రోజుల పాటు తిరుపతి గంగ జాతరకు మాత్రం ఎన్నో ప్రత్యేకతలు. ఏటా మే నెలలో తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మకు జాతర నిర్వహిస్తారు. వారం పాటు జరిగే ఈ జాతరలో భక్తులు చిత్ర,విచిత్ర వేషాలతో మొక్కులు తీర్చుకుంటారు. వందల ఏళ్లుగా సాగుతూ వస్తున్న ఈ జాతరకు రాయలసీమ జిల్లాలలోనే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూడా ఆదరణ వుంది.

జాతర జరిగే వారం రోజులు ఊళ్లో ఆడవాళ్ళు మగవాళ్ళుగా.. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతారు. చిత్ర విచిత్ర వేషాలతో ఊర్లో తిరుగుతుంటారు. పిల్లలకి మీసాలు మొలుస్తాయి. ఆడాళ్ళు వీధుల్లో ఆడిపాడుతారు. ఎదురు పడినవారిని ఎగతాళిచేస్తారు. బూతులు తిడుతూ వీధుల్లో తిరుగుతుంటారు. అయినా ఎవరూ పట్టించుకోరు. చీపురుతో కొట్టినా ఛీ పో అని వెళ్ళిపోతారు. తిరుపతిలో పుట్టి పెరిగిన వారు వారం రోజుల పాటు ఎన్ని పనులున్నా ఊరు దాటి వెళ్ళరు. వెళ్ళినా రాత్రికి తిరిగి ఇంటికి చేరుకుంటారు.

వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం వెనుక ఒక ఐతిహ్యం వుంది. రాయలసీమలో పాలేగాళ్ళ రాజ్యం నడుస్తున్న రోజుల్లో ఒక చిన్న గ్రామంగా వున్న తిరుపతిని పాలించే పాలెగాడి అరాచకత్వానికి అంతు వుండేది కాదు. అతగాడి కన్నుపడిన మహిళ కడతేరిపోవాల్సిందే లేదా కాళ్ళ కింద పడి వుండాల్సిందే. ఆ దుష్టుడి నుంచి మహిళలను రక్షించుకొనేందుకు ప్రజలు నానా తంటాలు పడేవారు. ఆ సమయంలో తిరుపతికి సమీపాన అవిలాల గ్రామంలోని కైకాల కులస్థుల ఇంట్లో పుట్టిన ఓ ఆడబిడ్డను తిరుపతికి చెందిన ఓ రెడ్డి దత్తత తీసుకున్నాడు. ఆమే గంగమ్మ. యుక్తవయసులో వున్న గంగమ్మపై కన్నేసిన పాలెగాడు ఆమెను వశపరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు తిరగబడిన గంగమ్మ చంపుతానని ప్రతిన చేసింది. దాంతో భయపడ్డ పాలెగాడు దాక్కున్నాడు. ఆ పాలెగాడిని పట్టుకునేందుకు గంగమ్మ రోజుకో వేషంలో తిరుగుతూ బండబూతులు తిట్టి రెచ్చగొట్టినా పాలెగాడు బయటకు రాలేదు. చివరకు పాలెగాళ్ళ నాయకుడైన దొరవేషంలో వచ్చినప్పుడు బయటికొచ్చిన పాలెగాన్ని సంహరించింది గంగమ్మ. ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించిన ప్రజలు ఆమెను గ్రామదేవతగా భావించి ఏటా జాతర చేస్తున్నారు. ఆపదలో గంగమ్మకు మొక్కితే సునాయాసంగా బయటపడతామంటున్నారు భక్తులు. ప్రాణమున్నంత వరకు విచిత్ర వేషాలతో అమ్మవారిని మ్రొక్కుతూనే వుంటామంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories