గజేంద్ర మోక్షణం

గజేంద్ర మోక్షణం
x
Highlights

పోతన భాగవతంలో శరణాగతికి సంబంధించి గజేంద్ర మోక్షణాన్ని మన పెద్దలు భిన్న కోణాల్లో దర్శింపచేస్తారు. నా అంత వాడు లేడన్నది గజేంద్రుడి నమ్మకం. నిజంగా కూడా...

పోతన భాగవతంలో శరణాగతికి సంబంధించి గజేంద్ర మోక్షణాన్ని మన పెద్దలు భిన్న కోణాల్లో దర్శింపచేస్తారు. నా అంత వాడు లేడన్నది గజేంద్రుడి నమ్మకం. నిజంగా కూడా వాడి బలానికి కొండలు పిండి అయ్యేవి , పులులు , సింహాలు భయపడి పారిపోయేవి. మొసలితో పోరాటం కూడా మాములుగా చేయలేదు. చివరి రక్తపు బొట్టు వరకు గెలవగలననే అనుకున్నాడు .

మనమూ అంతే - నా బలం , నా తెలివి తేటలు , నా కార్యదక్షత , నేను , నా . . .అనే అంటూ ఉంటాం .

కొంచెం పరిస్థితులు పట్టుదప్పగానే దేవుడికే పరీక్షలు పెడతాం. నువ్వు ఉంటే - నన్ను గట్టెంకించాలి , నువ్వున్నది నిజమయితే - మా అమ్మాయికి పెళ్లి కావాలి - అంటూ ఆయన ఉనికిని కాపాడుకోమని ఆయనకే సవాలు విసురుతాం.
ఆతరువాత - ఆయనతో డీల్ పెట్టుకుంటాం - పరీక్షలో పాస్ చేయిస్తే - గుండు కొట్టించుకుంటా , నీ హుండీలో వంద రూపాయలు వేస్తా , మెట్లెక్కి వస్తా , కళ్యాణం చేయిస్తా , అది చేస్తే సత్యనారాయణ వ్రతం చేస్తా . ఇది చేస్తే గుడి కట్టిస్తా . ఇలా అన్నిటికీ మనవి అగ్రిమెంట్లే , దేవుడికి లంచమో , కమిషనో ఆఫర్ చేస్తాం . ఈ మాత్రం ఆఫర్ ఇచ్చే వారు కరువయ్యారు అనుకుని పాపం ఆయన చేస్తున్నాడేమో ?


చాలాసార్లు అలా చేయకపోతే నేను లేనని అనుకుంటారేమోనని ఆయన చేయాల్సి వస్తుందట .
భాగవతంలోనే ఒకచోట - వాడు నాకొరకు రక్షింపవలయు - అన్నాడు శ్రీహరి . నేనున్నానని నిరూపించుకోవడానికయినా , లేదా నాకోసం భక్తుడిని రక్షించాల్సిందే - అన్నది ఆయన విధానం .

గజేంద్రుడు కూడా మనలాగే - మొదట నువ్వున్నావా లేవా అన్నాడు , తరువాత ఉంటే గింటే రక్షించు అన్నాడు , చివర నీవే తప్ప - ఇంకెవరు కాపాడతారు అన్నాడు . సంపూర్ణ శరణాగతి మాటలతో చెప్పినంత సులభం కాదు . చాలా పరిపక్వత కావాలి . నిర్మలమయిన భక్తి పరీక్షల కుంపటి మీద కాగి కాగి - శరణాగతి మీగడ కట్టాలి , ఆ మీగడ వెన్న కావాలి , అది ఇంకా చిలికి చిలికి నెయ్యి కావాలి.

మనమెక్కడున్నామో ?

Show Full Article
Print Article
Next Story
More Stories