బీజేపీ చేస్తున్న పని… వేస్తున్న ఎత్తుగడలు వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు అన్న విషయాన్ని కూడా చర్చించారు. బీజేపీ ఏపీపై సరికొత్త ఆయుధంగా తీసుకొస్తుందని...
బీజేపీ చేస్తున్న పని… వేస్తున్న ఎత్తుగడలు వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు అన్న విషయాన్ని కూడా చర్చించారు. బీజేపీ ఏపీపై సరికొత్త ఆయుధంగా తీసుకొస్తుందని ప్రచారంలో ఉన్న సీబీఐ మాజీ జెడి, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణని బీజేపీ ఎలా ఉపయోగించబోతున్నది అన్న విషయాలను కూడా ప్రస్తావించారు.దీంతో బీజేపీ ప్లాన్… రాష్ట్ర భవిష్యత్తు పై కొంత క్లారిటీ తప్పకుండా వస్తుంది.
“వచ్చే ఎన్నికలలో తమకు 10 లోక్‌సభ స్థానాలు, 50 వరకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాషాయదళం నుంచి తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి వచ్చింది. క్షేత్రస్థాయిలో అంతగా బలం లేని బీజేపీకి అన్ని సీట్లు కేటాయిస్తే అవన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను చంద్రబాబు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెబుతున్నారు. దీంతో కేంద్ర పెద్దలు చంద్రబాబును పట్టించుకోవడం మానేశారు.
చంద్రబాబుతో ఎప్పటికైనా ఇటువంటి ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్న మోదీ– షా ద్వయం ప్రత్యామ్నాయ వ్యూహాలకు పదునుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి కేసుల విషయంలో భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా అవినీతిపరుడిగా ముద్ర వేయడానికి వ్యూహ రచన చేశారు. ఇలా చేయడం వల్ల జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు– చంద్రబాబు కూడా అవినీతిపరుడే అన్న అభిప్రాయానికి ప్రజలు వస్తారనీ, దీంతో దొందూ– దొందే అని ప్రచారం చేసుకోవచ్చునన్నది కమలదళం ఆలోచనగా చెబుతున్నారు. అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై నోటికొచ్చినన్ని ఆరోపణలు చేశారు. దీని వెనుక కూడా మోదీ– షా ద్వయం ఉందని చంద్రబాబు అండ్ కో నిర్ధారణకు వచ్చారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబు వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి గవర్నర్ నరసింహన్ కారణమనీ, కేంద్ర పెద్దలు గవర్నర్ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించారనీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది.
రాష్ట్ర నాయకత్వాన్ని రాజకీయంగా బలహీనపరిస్తే రాష్ర్టానికి అది కావాలని, ఇది కావాలని బేరమాడే శక్తి చంద్రబాబు కోల్పోతారనీ, ఫలితంగా ఆయనను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవచ్చునన్నది బీజేపీ నాయకుల ఆలోచనగా తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే ‘డ్యామిట్! కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా జరగబోయే నష్టాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబునాయుడు, ప్రతివ్యూహాన్ని రచించి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. చంద్రబాబు నుంచి ఎదురైన ఈ ప్రతిఘటనతో కంగుతిన్న మోదీ– షా ద్వయం, ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతివ్యూహ రచన చేపట్టింది. ఈ క్రమంలో జగన్మోహన్‌రెడ్డి కేసులను దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వారి దృష్టిలో పడ్డారట!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పోరు కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్య కేంద్రీకృతమై ఉంది. జనాభాపరంగా ఈ రెండు వర్గాల కంటే అధిక సంఖ్యలో ఉన్న కాపులు కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. చిరంజీవి రూపంలో గతంలో జరిగిన ప్రయోగం విఫలమయ్యింది. ఇప్పుడు చిరంజీవి తమ్ముడైన పవన్ కల్యాణ్ జనసేనానిగా రంగంలో ఉన్నారు. అయితే చంద్రబాబు– జగన్మోహన్‌రెడ్డిలను ఢీకొట్టి నిలబడటానికి పవన్ కల్యాణ్ బలం సరిపోదన్నది కమలనాథుల అంచనా! వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఇష్టపడే పవన్ కల్యాణ్‌పై మాత్రమే ఆధారపడితే లాభం లేదనుకున్నారో ఏమోగానీ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై కన్నేశారు. ఆయనకు రాష్ట్రంలో మంచి పేరు ఉంది. రానున్న ఎన్నికలలో చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే కాపులను చేరదీయాలన్నది బీజేపీ అగ్ర నేతల ఆలోచనగా ఉంది. లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుని పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలన్నది అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు. బీజేపీపై ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ దీక్ష తర్వాతో, మరో సందర్భంలోనో రాష్ర్టానికి కొన్ని వరాలు ప్రకటించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాలన్నది బీజేపీ నాయకత్వం ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలో నిజాయితీపరుడు, ధైర్యవంతుడిగా ప్రజలలో గుర్తింపు ఉన్న లక్ష్మీనారాయణకు పార్టీ నాయకత్వం అప్పగించి ఎన్నికల నాటికి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాపు సామాజికవర్గం మద్దతు ఏకపక్షంగా లభిస్తుందన్నది కమలదళం వ్యూహం అని చెబుతున్నారు” ఇదన్నమాట కమల దళం మహా ప్లాన్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire