కాంగ్రెస్‌లోకి ఎర్రబ‌ెల్లి రాజకీయ వార‌సులు

కాంగ్రెస్‌లోకి ఎర్రబ‌ెల్లి రాజకీయ వార‌సులు
x
Highlights

సాధారణ ఎన్నిక‌లకు స‌మ‌యం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయ‌ాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. నిన్నామొన్నటి వ‌ర‌కు బ‌ద్ధశ‌త్రువులుగా ఉన్నవాళ్లు...

సాధారణ ఎన్నిక‌లకు స‌మ‌యం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయ‌ాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. నిన్నామొన్నటి వ‌ర‌కు బ‌ద్ధశ‌త్రువులుగా ఉన్నవాళ్లు ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత‌ల బంధువులు హ‌స్తం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ కీల‌క‌నేత ఎర్రబ‌ెల్లి ద‌యాక‌ర్‌రావు అల్లుడు మదన్‌మోహన్‌ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

రాజ‌కీయాల్లో శాశ‌్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండ‌ర‌నే మాట నిజమ‌వుతోంది. టీఆర్ఎస్‌ను ఆగ‌ర్భ శ‌త్రువుగా భావించిన టీడీపీ సీనియ‌ర్ నేత ఎర్రబ‌ెల్లి ద‌యాక‌ర్ రావు తర్వాత అదే పార్టీలో చేరారు. అప్పటి వ‌ర‌కు ఉప్పూనిప్పుగా ఉన్న గులాబీ నేత‌లు, ఎర్రబ‌ెల్లి ఒకే వేదిక పంచుకుంటున్నారు. అలాంటి ఎర్రబ‌ెల్లికి రాజకీయ వార‌సులు మరో పార్టీ తీర్థం పుచ్చుకొనబోతున్నారు.

ఎర్రబెల్లి సొంత అల్లుడు తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఒకేఒక బలమైన ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకొని ఎర్రబ‌ెల్లికి షాకిచ్చారు. గ‌తంలో ఎర్రబ‌ెల్లి ద‌యాక‌ర్ రావుతోపాటు టిడిపిలో చురుగ్గా పని చేసిన మ‌ద‌న్ మోహ‌న్ రావు, ఆయ‌న త‌మ్ముడు ప్రదీప్ రావు హస్తం పార్టీలో చేర‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మ‌ద‌న్ మోహ‌న్ రావు టీడీపీ నుంచి జ‌హీరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ద‌యాక‌ర్ రావుతోపాటు వీళ్లిద్దరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పడు మ‌ద‌న్ మోహ‌న్ కాంగ్రెస్‌లో చేర‌డానికి సిద్ధమ‌య్యారు. ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కండువా మార్చేందుకు ముహూర్తం ఖ‌రారైనట్లు స‌మాచారం.

వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజక‌వ‌ర్గం టికెటిస్తే ప్రదీప్ రావు కూడా కాంగ్రెస్‌లో చేర‌డానికి సిద్ధంగా ఉన్నట్లు గాంధీభ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరూ లేక‌పోవ‌డంతో పార్టీ కూడా ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎర్రబ‌ెల్లి ద‌యాక‌ర్‌రావు ఇద్దరు రాజకీయ వార‌సులు హస్తం తీర్థం పుచ్చుకోవడం ఖాయమ‌ని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories