క్రెడిట్ కార్డుతో జాగ్ర‌త్త సుమీ

క్రెడిట్ కార్డుతో జాగ్ర‌త్త సుమీ
x
Highlights

గతంలో బ్యాంకుల నుంచి ఖాతాదారుల ప్రత్యేక అభ్యర్థనపై అవసరాలకు రుణాలు తీసుకునే పద్ధతి మాత్రమే ఉండేది. ఖాతాదారుడి తిరిగి చెల్లింపు, ఆర్థిక సామర్ధ్యాలు...

గతంలో బ్యాంకుల నుంచి ఖాతాదారుల ప్రత్యేక అభ్యర్థనపై అవసరాలకు రుణాలు తీసుకునే పద్ధతి మాత్రమే ఉండేది. ఖాతాదారుడి తిరిగి చెల్లింపు, ఆర్థిక సామర్ధ్యాలు ఆధారంగా బ్యాంకులు వివిధ రుణాలు అందజేసేవి. బ్యాంకులు కంప్యూటర్‌ ఆధారిత సేవలు అందించడం మొదలయ్యాక.. క్రెడిట్‌ కార్డు రుణాలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. క్రమేణా వీటి వినియోగం బాగా పెరుగుతూ వస్తోంది. వాణిజ్యరంగంలోనూ క్రెడిట్‌ కార్డుల ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా క్రెడిట్‌కార్డు వాడటం మొదలుపెట్టేవారు కార్డు వినియోగం విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
జేబులో డబ్బు తీసుకొని వెళ్లే రోజులు పోయాయి. నిర్ణీత మొత్తానికి మించి, నగదు కొనుగోళ్లు అనుమతించని నిబంధనలు ఉన్నందున వీలైనంత వరకూ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారానే కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. అవసరానికి చేతిలో డబ్బు లేకపోయినా.. మన అవసరం తీర్చేందుకు క్రెడిట్‌కార్డు ఉపయోగపడుతుంది. అయితే, ఏదైనా కొనడానికే క్రెడిట్‌ కార్డు అనే అపోహా చాలామందిలో ఉంటుంది. కానీ, ఇది పూర్తిగా నిజం కాదు. క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా వినియోగించుకోవాలి. వాడుక తెలియాలి. లేదంటే లాభం కంటే నష్టమే ఎక్కువ.
లాభాలేంటి?!
జేబు నుంచి తీసి డబ్బు ఖర్చు పెట్టి, కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా.. కార్డుతో కొంటే, దాదాపు 45-60 రోజుల వరకూ వ్యవధి దొరుకుతుంది. దీనివల్ల మీపై అప్పటికప్పుడు ఆర్థిక భారం ఉండదు. ఇలా వ్యవధి దొరకడం వల్ల మీ బడ్జెట్‌ను కాస్త సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. మీ దగ్గర ఉన్న మొత్తం కన్నా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
ప్రయోజనాల మాటున కొన్నిసార్లు ఇబ్బందులూ ఉంటాయి. కచ్ఛితంగా వాటిపై అవగాహన ఉండాలి.
వినియోగించే ముందు
ఏదో ఒక క్రెడిట్‌ కార్డు అని తీసుకోవడం ఎప్పుడూ సరికాదు. ఎక్కడ ఏ కార్డును వాడుతున్నామన్నదీ ముఖ్యమే. మీరు తరచూ ఎక్కడ కార్డు వాడుతున్నారన్నది ముందుగా అవగాహన ఉండాలి. మీ ఖర్చులకు తగ్గట్టుగా.. ఏ కార్డు రాయితీలు, నగదు వెనక్కి వంటి ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకోవాలి. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు, హోటళ్లు, రెస్టారెంట్లలో రాయితీలను ఇచ్చే కార్డులను తీసుకోవడం కలిసొస్తుంది. ఎక్కువగా కొనుగోళ్లు చేసేవారు డిస్కౌంట్లను అందించే కార్డులను తీసుకోవాలి.
కార్డు పరిమితి
సాధారణంగా ఎంత మేరకు ఖర్చు చేస్తారో.. ఆ మేరకే కార్డు ఉండేలా చూసుకోవాలి. అవసరం లేకున్నా.. అధిక పరిమితి ఉన్న కార్డును తీసుకోవడం వల్ల ఏదైనా మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సి రావచ్చు. అంతేకాకుండా.. అధిక పరిమితి ఉంటే.. అనవసరంగా ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదమూ ఉంది. అర్హత ఉంటే.. అవసరాన్ని బట్టి, పరిమితిని పెంచుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది.
రాయతీలు, బీమాలు
క్రెడిట్‌ కార్డు కంపెనీలు కొన్ని హోటళ్లు, కారు అద్దెకు ఇచ్చే సంస్థలు, షాపింగ్‌ మాళ్లల్లో కొన్ని ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఇక్కడ మీరు కార్డును వాడినప్పుడు రాయితీల ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ రాయితీల వల్ల పెద్ద మొత్తంలో మిగిలే అవకాశం ఉంది. కాబట్టి, మీరు వాడుతున్న కార్డు ఏయే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందో ఒకసారి తెలుసుకోండి. ప్రస్తుతం చాలా క్రెడిట్‌ కార్డులు తమ ఖాతాదారులకు రకరకాల బీమా పాలసీల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణ బీమా పాలసీలను అందిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు… ముందుగానే క్రెడిట్‌ కార్డు సంస్థను ఆ విషయాలు అడిగి తెలుసుకోవాలి.
నగదు, రివార్డు పాయింట్లు
క్రెడిట్‌కార్డు ద్వారా ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేసినప్పుడు ఆయా కంపెనీలు రాయతీలు ప్రకటిస్తుంటుంది. అసలు ఖరీదులో 5, 10 శాతం నగదును తిరిగి మన అకౌంట్‌కు బదిలీ చేస్తుంది. ఇలా నగదు వెనక్కి రావడం అంటే.. ఆ మేరకు మీ ఖర్చు తగ్గినట్లే కదా! సాధారణ పద్ధతిలో కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి రాయితీలు, డిస్కౌంట్లు ఉండకపోవచ్చు. కానీ, కార్డు ద్వారా కొన్నప్పుడు మీకు వచ్చే నగదు వెనక్కి, రాయితీల్లాంటివి లాభంగానే చెప్పుకోవచ్చు.
మనం కొనుగోలు చేసిన మొత్తాన్ని బట్టి, క్రెడిట్‌కార్డు కొన్ని రివార్డు పాయింట్లను కేటాయిస్తుంది. కార్డు వాడిన ప్రతిసారీ ఎన్నో కొన్ని రివార్డు పాయింట్లు ఖాతాలో జమవుతాయి. ఇవి నిర్ణీత సంఖ్యకు చేరిన తర్వాత నగదుగా మార్చుకోవచ్చు. లేదా ఏదైనా వస్తువులు కొనుగోలు చేయవచ్చు. కార్డును ఉపయోగిస్తున్నందుకు ఏదైనా ఫీజులు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఈ రివార్డు పాయింట్లను అందుకు ఉపయోగించుకొని, మనపై భారం లేకుండా చూసుకోవచ్చు.
అంతేకాకుండా, ఖర్చులకు క్రెడిట్‌ కార్డునే వాడటం వల్ల బడ్జెట్‌ను సులభంగా ప్రణాళిక వేసుకునేందుకు వీలవుతుంది. బిల్లును చూడగానే నెలకు ఎంత ఖర్చు చేశామన్నది సులభంగా తెలుస్తుంది. ఇందులో అనవసర ఖర్చులు అనుకున్నవి, వచ్చే నెలలో తగ్గించుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇలా ఖర్చులను నియంత్రించుకునే దిశగా అడుగులు వేయవచ్చు.
వడ్డీరేటు ఇలా!
సాధారణంగా వ్యక్తిగత రుణాలతో పోలిస్తే.. క్రెడిట్‌ కార్డులు అందించే రుణాలపై 2-3 శాతం అధిక వడ్డీ ఉంటుంది. కొన్నిసార్లు కొత్తగా కార్డు తీసుకున్న వారికి తక్కువ వడ్డీకే రుణాన్ని అందించవచ్చు. లేదా కొన్నాళ్లపాటు ‘సున్నా’ శాతం వడ్డీకే అప్పు ఇవ్వవచ్చు. ఇలాంటివేమైనా అవకాశాలున్నాయేమో గమనించాలి. వీటిని వాడుకొని, ‘సున్నా’ వడ్డీ వ్యవధిలోపు అప్పు తీర్చేందుకు ప్రయత్నించాలి. అధిక వడ్డీ ఉన్న వాటిని వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. తక్కువ వడ్డీకి వచ్చే రుణాలతో అధిక వడ్డీ అప్పులను తీర్చేయాలి. ఏ నెలా వాయిదాలు చెల్లించకుండా ఉండకూడదు. ఇది మన చెల్లింపుల చరిత్రనూ, క్రెడిట్‌ స్కోరునూ ప్రభావితం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories