సీఎం కేసీఆర్, సీఎం చంద్ర‌బాబుపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు

సీఎం కేసీఆర్, సీఎం చంద్ర‌బాబుపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు
x
Highlights

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల 31 మంది ముఖ్యమంత్రులలో 11 మంది (35శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి. ఇది ఏ రాజకీయ నాయకుడో చేసిన ఆరోపణ...

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల 31 మంది ముఖ్యమంత్రులలో 11 మంది (35శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి. ఇది ఏ రాజకీయ నాయకుడో చేసిన ఆరోపణ కాదు... నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు దాఖలు చేసే ఎన్నికల ప్రమాణ పత్రాలలో స్వయంగా వారే పేర్కొన్న వాస్తవం. ఈ విషయాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్), జాతీయ ఎన్నికల పరిశీలన సంస్థ (ఎన్‌ఈడబ్ల్యూ)ల సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో... తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎన్.చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), కె.చంద్రశేఖరరావు (తెలంగాణ)సహా నితీశ్‌కుమార్ (బిహార్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), రఘువర్‌దాస్ (ఝార్ఖండ్), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), పినరాయి విజయన్ (కేరళ), కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), మెహబూబా ముఫ్తీ (జమ్ముకశ్మీర్), వి.నారాయణ స్వామి (పుదుచ్చేరి) ఉన్నారు. వీరందరిలోనూ మొత్తం 22 కేసులతో దేవేంద్ర ఫడ్నవీస్ అగ్రస్థానంలో ఉండగా ఇందులో మూడు కేసులు తీవ్రమైనవని నివేదిక పేర్కొంది. ఇక పినరాయి విజయన్ 11, కేజ్రీవాల్ 10 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే, తీవ్రమైన కేసుల జాబితాలో కేజ్రీవాల్ (4) ప్రథమ స్థానంలో ఉండగా- చంద్రబాబు, మెహబూబా, నారాయణస్వామిలపై తీవ్ర కేసులేవీ లేకపోవడం విశేషం. ఇక తీవ్ర స్వభావంగల కేసుల జాబితాలో హత్య, హత్యాయత్నం, మోసం, అవినీతి, నేరపూరిత బెదిరింపు, ఆస్తుల స్వాధీనం వంటివి ఉన్నాయి.

ముఖ్యమంత్రులందరిలో వ్యక్తిగత సంపద రీత్యా చంద్రబాబు నాయుడు (ఏపీ) రూ.177 కోట్ల ప్రకటిత ఆస్తులతో ప్రథమ స్థానం అలంకరించారు. ఇక పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్) రూ.129 కోట్లు, కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్) రూ.48 కోట్ల ఆస్తులతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక అత్యంత స్వల్ప ఆస్తులున్నవారిలో మాణిక్ సర్కార్ (త్రిపుర) రూ.26 లక్షలతో అగ్రస్థానంలో ఉండగా మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్) రూ.30 లక్షలు, మెహబూబా (కశ్మీర్) రూ.50 లక్షలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories