విషాదంగా ముగిసిన పసికందు ‘కుమారస్వామి’ కథ

విషాదంగా ముగిసిన పసికందు ‘కుమారస్వామి’ కథ
x
Highlights

కర్ణాటకలో పసికందు చిన్నారి కుమారస్వామి కథ విషాదంగా ముగిసింది. బ్లడ్‌, బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ సోకి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే చనిపోయిన 11...

కర్ణాటకలో పసికందు చిన్నారి కుమారస్వామి కథ విషాదంగా ముగిసింది. బ్లడ్‌, బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ సోకి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే చనిపోయిన 11 రోజుల తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని తెలియచేసింది. దీంతో పోలీసు సిబ్బంది, స్థానికుల్లో విషాదం నెలకొంది.

బెంగళూరు శివార్లలో దొరికిన పసికందు ‘కుమారస్వామి’ కథ విషాదాంతమైంది. చిన్నారిని స్వయంగా పోలీసులే అక్కున చేర్చుకుని యోగక్షేమాలు విచారించినా ఫలితం దక్కలేదు. ఈనెల ఒకటో తేదీన దొడ్డతొగురు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం దగ్గర ప్లాస్టిక్‌ కవర్‌లో చిన్నారిని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... చిన్నారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆకలితో అలమటిస్తున్న చిన్నారికి అర్చన అనే మహిళా కానిస్టేబుల్‌ తన పాలిచ్చి ఆకలి తీర్చింది.

ఈ వార్త కర్నాటక వ్యాప్తంగా వైరల్‌ కావడంతో పాలిచ్చి చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్‌ అర్చనను అంతా అభినందించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. దీంతో ఈ చిన్నారికి పోలీసులు కుమారస్వామి అని పేరు పెట్టారు. పసికందు రాత్రి వేళ ఆరుబయట ఉండటంతో పసికందు అనారోగ్యంగా ఉన్నట్టు గుర్తించి స్ధానిక ఇందిరాగాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ బిడ్డ చికిత్సకు స్పందికపోవడంతో ఈ నెల 7న చనిపోయాడు. ఈ విషయాన్ని బిడ్డ చనిపోయిన 11 రోజుల తర్వాత వైద్యులు వెల్లడించారు.

చిన్నారిని రాత్రంతా చలిలో వదిలేయడంతో బ్లడ్‌, బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ సోకి చనిపోయినట్టు ఆస్పత్రి డైరెక్టర్‌ ఆశా బెనకప్ప తెలిపారు. బిడ్డ మరణ వార్త తెలిసి పోలీసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బిడ్డకు పాలిచ్చిన కానిస్టేబుల్‌ అర్చన ఈ విషయం తెలిసి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పోలీసులతో పాటు బిడ్డ లభించిన ప్రాంతంలో కూడా విషాదం నింపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories