చంద్రబాబు దుర్నీతిని లౌక్యంగా తిప్పికొట్టాలి: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు దుర్నీతిని లౌక్యంగా తిప్పికొట్టాలి: వైఎస్‌ జగన్‌
x
Highlights

నంద్యాల: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టే ప్రజలను కూడా కొనుగోలు చేయొచ్చన్న అహంకారంతో చంద్రబాబు మూటలు, మూటలు డబ్బులతో నంద్యాలకు వచ్చారని వైఎస్‌ఆర్‌...

నంద్యాల: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టే ప్రజలను కూడా కొనుగోలు చేయొచ్చన్న అహంకారంతో చంద్రబాబు మూటలు, మూటలు డబ్బులతో నంద్యాలకు వచ్చారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 'ఉప ఎన్నికలు రాగానే మహిళలను మోసం చేయడానికి చంద్రబాబుకు కుట్టుమిషన్లు గుర్తొస్తాయి. రైతులను మోసం చేయడానికి ట్రాక్టర్లు గుర్తుకొస్తాయి. చంద్రబాబుకు ఇంతింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. మన దగ్గర నుంచి దోచిన సొమ్మే మనకు కొద్దో-గొప్పో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మద్యం నుంచి ఇసుక వరకు దోపిడే, గుడి భూముల నుంచి రాజధాని భూముల వరకే దోపిడే' అని అని అన్నారు. చంద్రబాబు తన మూడున్నరేళ్ల పాలనలో మూడున్నరలక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. ఆరు కోట్లమంది రాష్ట్ర జనాభాలో మూడున్నర లక్షల కోట్ల రూపాయాలు చంద్రబాబు దోచుకున్నారని, సగటున ఒకరి నుంచి రూ. 60వేల చొప్పున చంద్రబాబు దోపిడీ సాగిందని ధ్వజమెత్తారు.

దోచుకున్న సొమ్ము నుంచి ఓటర్లకు ఐదువేల చొప్పున చంద్రబాబు పంచబోతున్నారని అన్నారు. 'రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడు మూటలు మూటలు డబ్బులతో వచ్చి.. డబ్బులు చేతులో పెట్టి.. తన జేబులో నుంచి దేవుడి పటం తీసి.. తనకే ఓటు వేయాలంటూ మీ అందరితో ప్రమాణం చేయించుకుంటారు. ఏ దేవుడు కూడా పాపం చేయమని చెప్పడు. పాపం చేయమని సైతాన్‌, దెయ్యమే చెప్తుంది. ఆ దెయ్యాలు మీ దగ్గరకు వచ్చి.. చేతుల్లో డబ్బులు పెట్టి.. ప్రమాణం చేయమన్నప్పుడు ఆ దెయ్యాలతో గొడవ పడకండి. ధర్మం వైపు మేమంతా నిలబడతామని మనస్సులో దేవుడిని తలుచుకొని.. లౌక్యంగా వాళ్లు చేసే దుర్భుద్ధిని, దుర్నీతిని తిప్పికొట్టండి' అని వైఎస్‌ జగన్‌ ఓటర్లకు సూచించారు.

కచ్చితంగా న్యాయానికి, ధర్మానికే ఓటు వేయాలని నంద్యాల ప్రజలను ఆయన కోరారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన మీద ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, చంద్రబాబు తన పాలనలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నారా అని నిలదీస్తూ ఓటువేద్దామని ఆయన సూచించారు. చంద్రబాబు ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

'రైతుల రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే.. బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. జాబ్‌ ఇవ్వకపోతే ఇంటింటికి రూ. రెండువేలుచొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. కానీ ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు' అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు సైతం అది చేస్తాం ఇది చేస్తాం అని చంద్రబాబు మభ్యపెట్టారని విమర్శించారు.

ప్రతి ఓటు అధర్మానికి వ్యతిరేకంగా పడాలి!
'ఇప్పటివరకూ ఏమి చేయని బాబు.. ఉప ఎన్నికకు వచ్చే సరికి ఏవేవో చేస్తానంటున్నాడు. మళ్లీ మోసగిస్తాడు. ఈ పరిస్ధితి మార్చాలి. నంద్యాలలో వేసే ప్రతి ఓటు కూడా ఆయన చేసిన అధర్మానికి వ్యతిరేకంగా వేయాలి. ఈ ఎన్నికల్లో మీ అందిరితో చెప్తున్నాను. శిల్పాను అభ్యర్థిగా నిలబెడుతున్నాను. ప్రతి ఓటూ జగన్‌కు వేస్తున్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఏడాదిన్నరలో జరగబోయే మహాసంగ్రామానికి ఈ ఉప ఎన్నిక నాంది పలకబోతుంది. ప్రతి ఒక్కరూ చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయత చూపుతున్నారు. ఆప్యాయత అనురాగానికి ప్రతి అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. సెలవు. ఇంకొక చిన్న విన్నపం. మన పార్టీ గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే.. తెలిసిన వారందరూ చెప్పాలి. ఒకసారి గుర్తు చూపిస్తున్నాను అందరూ మన గుర్తు ఫ్యాన్‌ అని గుర్తుంచుకోవాలి' అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories