Gold Price: భగభగమంటున్న బంగారం ధరలు.. 24 క్యారెట్ల ధర రూ.71,300

The Gold Rate Hike
x

Gold Price: భగభగమంటున్న బంగారం ధరలు.. 24 క్యారెట్ల ధర రూ.71,300

Highlights

Gold Price: 45 రోజుల్లోనే 15 శాతానికి పెరిగిన పసిడి

Gold Price: బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.64 వేలకు పైగా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,300 ఉండేది. పుత్తడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్‌ మారకపు విలువ బాగా పెరగడంతో, బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్సు ధర 2,165 డాలర్ల నుంచి 2,255 డాలర్లకు పెరగడం విశేషం. ఈ నెలలో వివాహాది శుభకార్యాల ముహూర్తాలు ఉండగా, పుత్తడి, వెండి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అమ్మకాలు తగ్గాయని విక్రయదారులూ చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో అక్షయ తృతీయ రోజున బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది. ఏడాది వ్యవధిలో సుమారు రూ.9 వేల వరకు పెరిగింది. కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నా, గత రెండు మూడు నెలల్లో మార్పు మరింత ఎక్కువగా ఉన్నట్లు వర్తకులు చెబుతున్నారు.

పసిడి ధర గత 45 రోజుల్లోనే 15 శాతానికి పైగా పెరిగింది. ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగానే ఉన్నా, కొనుగోళ్లు మందగించాయి. పలువురు తాము కొనుగోలు చేయాలనుకున్న మొత్తంలో 50-60 శాతమే కొంటున్నారు. ధరలు కొంత తగ్గాక, మిగిలిన బంగారం కొంటామని చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో జరిగే విక్రయాల్లో 40% వ్యాపారం తగ్గింది. ధర ఎక్కడి దాకా పెరుగుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? అన్నది అంచనా వేయడం కష్టంగా ఉందని బంగారం వర్తకులు లబోదిబోమంటున్నారు. ఉగాది తర్వాత పెళ్లిళ్లు భారీగా ఉన్నా.. ధరలు కొండెక్కడంతో జనం బెంబేలెత్తుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయి. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గితే, బంగారంపై పెట్టుబడులు పెడతారు. ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ ప్రకటించినందున, పసిడిపైకి మదుపర్ల దృష్టి మళ్లుతోంది. మనదేశంలో బంగారాన్ని సెంటిమెంట్‌గా కొనుగోలు చేస్తారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో, తక్కువ పరిమాణంలో ఆభరణాలు కొంటున్నారు. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories