RBI: రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ.. మరింత పెరగనున్న బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు..!

RBI Hikes Repo Rate to 6.5%
x

RBI: రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ.. మరింత పెరగనున్న బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు..!

Highlights

Repo Rate: రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును మళ్లీ పావు శాతం పెంచింది.

Repo Rate: రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును మళ్లీ పావు శాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ RBI గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు సమర్థించినట్లు ఆయన చెప్పారు. 2023లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. డిసెంబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటు 35 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చారు. అంతకు ముందు వరుసగా 3 సమీక్షల్లో 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఈసారి పెంపు వేగం కొంత తగ్గి 25 బేసిస్‌ పాయింట్లకే పరిమతమైంది. రివర్స్‌ రెపోరేటు 3.35లో ఎటువంటి మార్పులు చేయలేదు. దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతిస్తుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లపై మధ్యస్థ వైఖరి ప్రదర్శిసుండటంతో RBI రెపో రేటును స్వల్పంగా పెంచింది.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు ద్రవ్యపరపతి విధానాన్ని సవాలుగా మార్చేశాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. చాలా రంగాల్లో భారత్‌ భాగస్వామ్యం కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా భవిష్యత్తు అంచనాలు అస్పష్టంగానే ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ అప్రమత్తంగానే ఉందని చెప్పుకొచ్చారు. తగినంత నగదు ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగు త్రైమాసికాల్లో భారత్‌ పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. 2023-24లో ద్రవ్యోల్బణం 4శాతం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మార్జినల్‌ స్టాండింగ్‌ రేటును 6.75గా మార్చినట్టు తెలిపారు. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేట్‌ను 6.25కు సర్దుబాటు చేశామన్నారు. 2023 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 7శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనావేశారు.

రెపోరేటు పెరగడంతో అన్ని రకాల బ్యాంకు రుణాలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా రుణ వినియోగదారులపై భారం పడింది. తాజా నిర్ణయంతో పర్సనల్, హోం, వెహికల్ లోన్ల వడ్డీలు మరింత పెరగనున్నాయి. ఫలితంగా EMIలు కూడా పెరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories