Gold rate: బంగారం అటూ ఇటూ తిరిగి కిందికి.. దోబూచులాడిన వెండి దిగివచ్చింది.. ఇదీ ఈవారం బంగారం ధరల తీరూ తెన్నూ!

Analysis on Gold and Silver rates this week
x

Gold and Silver rates this week

Highlights

Gold Rate: గత వారంలో బంగారం, వెండి ధరలు పైకీ కిందికీ కదులుతూ మొత్తమ్మీద స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి.ఆ వారంలో బంగారం, వెండి ధరల కదలికలు ఇలా ఉన్నాయి

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది.

ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(ఆగస్టు 09) నుంచి శనివారం(ఆగస్టు 15) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

స్వల్పంగా తగ్గిన పసిడి!

గత వారంలో (ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు) బంగారం ధరలు పైకీ కిందికీ కదులుతూనే ఉన్నాయి. తగ్గినపుడు స్వల్పంగా..పెరిగినపుడు భారీగా నమోదు చేసిన పసిడి ధరలు వారాంతానికి మాత్రం స్వల్ప తగ్గుదలతోనే ముగిశాయి.

అయితే, ఈ వారం ప్రారంభంలోనే పసిడి పరుగులకు బ్రేకులు పడ్డాయి. ఆగస్టు 17 వతేదీ సోమవారం పది గ్రాములకు 34౦ రూపాయలు తగ్గిన బంగారం ధరలు మర్నాడు మాత్రం 104౦ రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. ఇక ఆగస్టు 20 గురువారం మాత్రం 780 రూపాయలు తగ్గింది. తరువాతి రోజు అంటే శుక్రవారం నిలకడగా నిలిచింది. అయితే, మళ్ళీ శనివారం ఆగస్టు 22న 400 రూపాయల తగ్గుదలతో వారాన్ని ముగించింది పసిడి. వారం మొత్తంగా చూసుకుంటే సోమవారం(17 ఆగస్టు) 22 కారెట్ల బంగారం పది గ్రాములకు 50,700 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(22 ఆగస్టు) సాయంత్రం 50,480 రూపాయల వద్ద ముగిశాయి. అంటే దాదాపు 220 రూపాయల తగ్గుదల కనబరిచింది. ఇక 24 కారెట్ల బంగారం సోమవారం(17 ఆగస్టు)న పది గ్రాములకు 55,320 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(22 ఆగస్టు) సాయంత్రం 55,060 రూపాయల వద్ద ముగిశాయి. అంటే దాదాపు 260 రూపాయల తగ్గుదల కనబరిచింది.

ఇక ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో పసిడి కాస్త నిదానించినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెండి ధరలు దిగొచ్చాయి..!

ఇక దేశీయంగా వెండి ధరలు కూడా పసిడిబాటలోనే పయనించాయి. అమాంతం పెరిగిపోయిన వెండి ధరలు వారం అంతా భారీగా దోబూచులాడి చివరికి కాస్త శాంతించాయి. వారం పొడవునా వెండి ధరలు అటూ ఇటూ కదిలాయి. వారం ప్రారంభంలో సోమవారం(ఆగస్టు 17) కేజీ వెండి 1060 రూపాయల పెరుగుదల తో 68,900 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ మర్నాడే అంటే మంగళవారం(ఆగస్టు 18) కేజే వెండి ధర ఒక్కసారిగా 3,000 రూపాయలు దిగజారింది... అటు తరువాతి రోజు అంటే బుధవారం(ఆగస్టు 19) 1,100 రూపాయల పతనం చూసింది. ఆగస్టు 18, 19 రెండురోజుల్లో వెండి కేజీకి ఏకంగా నాలుగువేల రూపాయలకు పైగా దిగివచ్చింది. అటు తరువాత శుక్రవారం(ఆగస్టు 21) 800 రూపాయలు పెరిగిన వెండి.. వారాంతానికి 700 రూపాయలు తగ్గి 67,100 రూపాయల వద్ద నిలిచింది. దీంతో వారం ప్రారంభంలో 68,900 రూపాయలు ఉన్న కేజీ వెండి ధర వారాంతానికి 1800 రూపాయల తగ్గుదలతో..67,100 రూపాయలకు చేరుకుంది.

ఇక శుభముహూర్తాలు కూడా ఏమీ లేకపోవడంతో వచ్చే వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చనీ.. కొద్దిపాటి తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉందనీ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!

Show Full Article
Print Article
Next Story
More Stories