Gold rate: భారీగా దిగొచ్చిన బంగారం.. వెండి ధరలూ అదే బాటలో.. గత వారం పసిడి ధరల్లో మార్పులు ఇవే!
Gold Rate:గత వారంలో బంగారం వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. ఆ వారంలో బంగారం ధరల కదలికలు ఇలా ఉన్నాయి
బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది.
ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.
ఇక గత సోమవారం(ఆగస్టు 09) నుంచి శనివారం(ఆగస్టు 15) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.
పడి లేచిన పసిడి!
గత వారంలో (ఆగస్టు 02 నుంచి ఆగస్టు 08 వరకు) అమాంతం పెరిగిపోయి బంగారం ప్రియులకు చుక్కలు చూపించింది. రికార్డు స్థాయిలో ధరలు పరుగులు తీశాయి. పది గ్రాముల బంగారం ధరలు వేలాది రూపాయల పెరుగుదల నమోదు చేశాయి.
అయితే, ఈ వారం ప్రారంభంలోనే పసిడి పరుగులకు బ్రేకులు పడ్డాయి. ఆగస్టు 10 వతేదీ సోమవారం పది గ్రాములకు 23౦ రూపాయలు తగ్గిన బంగారం ధరలు మర్నాడూ 44౦ రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. ఇక ఆగస్టు 12 బుధవారం రికార్డు స్థాయిలో బంగారం ధరలు పతనం అయ్యాయి. 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 3010 రూపాయలు తగ్గింది. దీంతో ఒక్కసారిగా 50,130 రూపాయలకు పడిపోయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధరకూడా పది గ్రాములకు ఏకంగా 3350 రూపాయలు కిందికి దిగింది. దీంతో అమాంతం 54,680 రూపాయలకు దిగివచ్చింది. ఒక్కరోజులో ఇంత భారీ పతనం ఈ మధ్యకాలంలో ఇదే కావడం విశేషం.
ఇక తరువాత రెండు రోజుల పాటు స్వల్పంగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో శనివారం(ఆగస్టు 15) సాయంత్రానికి పది గ్రాముల బంగారం ముగింపు ధరలు 22 క్యారెట్లు 51,000 రూపాయలుగానూ, 24 క్యారెట్లు 55,650 రూపాయలుగానూ నిలిచాయి.
సోమవారం (27 జూలై) పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 49,050 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 53,480 రూపాయలుగానూ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. ఆ రోజు ఏకంగా 730 రూపాయల పెరుగుదల కనబర్చింది. ఇక అక్కడి నుంచి వారం మొత్తం బంగారం ధరలు పైపైకి కదులుతూనే వచ్చాయి. వారాంతానికి రికార్డు గరిష్ట ధరలను నమోదు చేశాయి. శనివారం (1 ఆగస్టు) సాయంత్రం 22 క్యారెట్ల బంగారం 51,780 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 56,490 రూపాయలుగానూ ముగిసాయి. అంటే వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 2,730 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 3,010 రూపాయలు పైకెగసింది.
వివాహ ముహూర్తాలు పూర్తికావడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా తగ్గుముఖం పట్టడం తో పసిడి కాస్త నిదానించినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వెండి ధరలు దిగొచ్చాయి..!
ఇక దేశీయంగా వెండి ధరలు కూడా పసిడిబాటలోనే పయనించాయి. అమాంతం పెరిగిపోయిన వెండి ధరలు ఈ వారం కాస్త శాంతించాయి. వారం పొడవునా వెండి ధరలు అటూ ఇటూ కదిలాయి. వారం ప్రారంభంలో సోమవారం కేజీ వెండి 940 రూపాయల పెరుగుదల తో 75,150 రూపాయల వద్ద నమోదు అయింది. ఆ మర్నాడే అంటే మంగళవారం కేజే వెండి ధర 2,650 రూపాయలు పడిపోయింది. అటు తరువాతి రోజు అంటే బుధవారం 7,500 రూపాయల రికార్డు పతనం చూసింది. ఒక్కరోజులో ఇంత పతనం ఈ మధ్యకాలంలో ఇదే కావడం విశేషం. ఆగస్టు 11, 12 రెండురోజుల్లో వెండి కేజీకి ఏకంగా పదివేల రూపాయలకు పైగా దిగివచ్చింది. అటు తరువాత మూడు రోజుల్లోనూ దాదాపుగా మూడువేల రూపాయల వరకూ కేజీ వెండి ధర పెరిగింది. దీంతో వారం ప్రారంభంలో 75,150 రూపాయలు ఉన్న కేజీ వెండి ధర వారాంతానికి 68,000 రూపాయలకు చేరుకుంది.
ఇక శ్రావణ మాసం పూర్తి కావస్తుండడం.. శుభముహూర్తాలు కూడా ఏమీ లేకపోవడం వంటి కారణాలతో వచ్చే వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చనీ.. కొద్దిపాటి తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉందనీ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire