వీవో సంస్థల సోదాలపై చైనా ఆగ్రహం.. ఇలా చేస్తే..

China Responds to ED Raids on Vivo India
x

వీవో సంస్థల సోదాలపై చైనా ఆగ్రహం.. ఇలా చేస్తే.. 

Highlights

Vivo: చైనా కంపెనీలనే లక్ష్యంగా చేసుకుని భారత్‌ దాడులు చేస్తోందని బీజింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Vivo: చైనా కంపెనీలనే లక్ష్యంగా చేసుకుని భారత్‌ దాడులు చేస్తోందని బీజింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌లను నిషేధించిన భారత్‌ ఈ ఏడాది చైనాకు చెందిన షామీ, హువావే కంపెనీలకు చెందిన కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖలు దాడులు నిర్వహించింది. తాజాగా మనీలాండరింగ్‌ ఆరోపణలపై చైనాకు చెందిన మరో కంపెనీ వివో కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. తమ కంపెనీలకు చెందిన కార్యాలయాలపై దాడులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు చైనా తెలిపింది. విదేశీ కంపెనీలపై దాడులు చేయడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటుందని చైనా విమర్శించింది. చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు జంకుతాయని భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వాంగ్‌ జియాన్‌ హెచ్చరించారు.

వివో, దాని అనుబంధ సంస్థల్లో మనీలాండరింగ్‌ ఆరోపణలపై చాలా రోజుల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ దృష్టి పెట్టింది. తాజాగా వివోకు చెందిన 44 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లు జెంగ్‌షెన్‌ ఔ, చాంగ్‌ చియా చైనాకు పారిపోయినట్టు తెలుస్తోంది. ఐటీ విభాగం, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలు కూడా వివో సంస్థ వ్యవహారంపై దృష్టి సారించాయి. చైనా సంస్థ ఆర్థిక అవకతవకలపై విచారణలో భాగంగానే వీవోపైనా దర్యాప్తు చేస్తున్నట్టు ఈడీ తెలిపింది. గతంలోనూ చైనా మొబైల్‌ దిగ్గజ సంస్థలు షామీ, హువావే సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఆయా కంపెనీలు బోగస్‌ కంపెనీల ద్వారా నిధులను రాయాల్టీ రూపంలో చైనాకు 5వేల 500 కోట్ల రూపాయలను తరలించినట్టు గతంలో ఐటీ తెలిపింది.

తాజాగా వీవో సంస్థలపై దాడుల నేపథ్యంలో భారత్‌కు చెందిన అధికారులు చట్టాలకు లోబడి వివక్ష లేకుండా విచారణ జరపాలని బీజింగ్‌ డిమాండ్‌ చేసింది. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని తమ కంపెనీలకు చెప్తామని చైనా తెలిపింది. కానీ భారత్‌ మాత్రం తమ దేశ కంపెనీలే లక్ష్యంగా దాడులు చేస్తోందని ఆరోపించింది. గతంలోనూ షామీ, వన్‌ప్లస్‌, జడ్‌టీఈ కంపెనీల్లో తనిఖీలను గుర్తు చేసింది. ఇలా చేస్తే విదేశీ పెట్టుబడుదారులు ఎలా వస్తారని బీజింగ్‌ ప్రశ్నించింది. గతంలో చైనా కంపెనీలు వల్లించిన మాటలనే ఇప్పుడు కూడా వీవో వల్లిస్తోంది. ఈదీ విచారణలో తాము పూర్తిగా సహకరిస్తున్నట్టు వివో ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories