Top-6 News of the Day: వైఎస్ఆర్ సీపీ పదవులకు ఆళ్లనాని రాజీనామా: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: వైఎస్ఆర్ సీపీ పదవులకు ఆళ్లనాని రాజీనామా: మరో 5 ముఖ్యాంశాలు
x

Top-6 News of the Day(09/08/2024)

Highlights

1. ఆళ్ల నాని వైఎస్ఆర్ సీపీ పదవులకు రాజీనామా ఆళ్లనాని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ సీపీ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత...

1. ఆళ్ల నాని వైఎస్ఆర్ సీపీ పదవులకు రాజీనామా


ఆళ్లనాని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ సీపీ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా పత్రాలను పంపారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవితో పాటు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టుగా ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించిన ఆయన జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రివర్గంలో చోటు కోల్పోయారు.

2. పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ పై కేసు


పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ పై మహారాష్ట్రలోని బుందాగార్డెన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పుణె కలెక్టరేట్ లో పనిచేసే తహసీల్దార్ దీపక్ అకాడే ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ ప్రొబేషనరీ ఐఎఎస్ పూజా ఖేద్కర్ కు అవసరమైన కేబిన్ , ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తనను బెదిరింపులకు గురి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో పూజా ఖేద్కర్ సివిల్స్ లో ఉద్యోగం పొందిందని విచారణలో తేలడంతో పూజా ఖేద్కర్ నియామాకాన్ని రద్దు చేసింది యూపీఎస్ సీ.

3. రాజకీయాల్లోకి వస్తా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్


దేశంలో ప్రస్తుత పరిస్థితులను చూసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనిపిస్తోందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తనయుడు సాజీబ్ వాజెద్ చెప్పారు. ఈసారి ప్రధానిగా పదవీకాలం పూర్తైన తర్వాత తన తల్లి హసీనా రాజకీయాల నుంచి రిటైరయ్యేవారన్నారు. కానీ, ప్రస్తుత పరిణామాలతో అవామీ లీగ్ పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత హసీనా తిరిగి బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తారన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల వరకు తనకు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదన్నారు. కానీ, పార్టీని కాపాడుకొనే ఉద్దేశ్యంతో అవసరమైతే రాజకీయాల్లోకి రావడానికి వెనుకడుగు వేయబోనని ఆయన చెప్పారు.

4. దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్



మద్యం కుంభకోణంలో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2023 ఫిబ్రవరి 26న ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో ఈడీ కూడా అరెస్ట్ చేసింది. అయితే పలుసార్లు ఆయన బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే పలు కారణాలతో బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. పరిమితి దాటిన తర్వాత ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం ఆ వ్యక్తి హక్కులను హరించినట్టేనని సుప్రీంకోర్టు ధర్మాసనం మనీశ్ సిసోడియా కు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.

5. నాలుగేళ్లు కృష్ణానదికి నీళ్లు రాకున్నా సుంకిశాలతో నీటి ఇబ్బందులు రావు: కేటీఆర్


హైద్రాబాద్ నగరానికి 50 ఏళ్ల తాగునీటి అవసరాలకు ఇబ్బంది రాకుండా ప్రణాళికలను సిద్దం చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే సుంకిశాల ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. నాగార్జునసాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్నా నీటి కొరత రాకుండా ఉండేందుకే సుంకిశాల నుంచి నీటిని తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ నెల 2న ఈ ప్రాజెక్టు గోడకూలితే ప్రభుత్వానికి సమాచారం రాలేదా...కప్పిపెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. నాణ్యత లేని పనులతోనే ఇలా జరిగిందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దిల్లీ, బెంగుళూరు, చెన్నైలలో మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బంది పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేటీఆర్ విమర్శలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కౌంటరిచ్చారు. సుంకిశాలను కట్టింది మీరే...ఇది కూలితే అందుకు మీరే బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు కూలిన విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు.

6. కవితకు ఆరోగ్య సమస్యలు : కేటీఆర్


కల్వకుంట్ల కవిత... బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. జైల్లో ఉన్న ఆమె 11 కిలోలు తగ్గారని ఆయన తెలిపారు. కవితకు బెయిల్ విషయమై న్యాయనిపుణులతో చర్చించినట్టుగా ఆయన చెప్పారు. ఇదే కేసులో అరెస్టైన మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది మార్చిలో కవితను దిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఆమె ఉన్నారు. ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories