Top-6 News of the Day: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా: మరో 5 ముఖ్యాంశాలు
x

Top-6 News of the Day

Highlights

Top-6 News of the Day, 05/08/2024: ఈరోజు టాప్ 6 న్యూస్ ముఖ్యాంశాలు.

Top-6 News of the Day (05/08/2024)

1. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా


షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దేశంలో కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేశారు. దీంతో సైన్యం దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. హింసను విడనాడాలని ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ నిరసనకారులను కోరారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ ప్రకటించింది. రాజీనామా చేసిన తర్వాత హెలికాప్టర్ లో హసీనా ఇండియాకు చేరుకున్నట్టుగా మీడియా కథనాలు వెల్లడించాయి. రిజర్వేషన్ల అంశంపై జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. చివరకు ఇది హసీనా రాజీనామాకు దారి తీసింది.

2. దళిత మహిళను హింసించిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ పై సస్పెన్షన్ వేటు


షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ రాంరెడ్డి సహా ఐదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు. దళిత మహిళను హింసించారనే రాంరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. షాద్ నగర్ కు చెందిన నాగేందర్ అనే వ్యక్తి తన ఇంట్లో 22 తులాల బంగారం, రూ. 2 లక్షలు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేశారు. నాగేందర్ ఇంటి ఎదురుగా ఉండే భీమయ్య, సునీత దంపతులను సీఐ రాంరెడ్డి పిలిచి విచారించారు. ఆ తర్వాత గత నెల 30న స్టేషన్ కు తీసుకెళ్లి తమను చిత్రహింసలు పెట్టారని సునీత దంపతులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సీపీ విచారణకు ఆదేశించారు. ఏసీపీ రంగస్వామి విచారణ చేసి సీపీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీపీ చర్యలు తీసుకున్నారు.

3. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించవద్దు: చంద్రబాబు


చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించవద్దని ఆయన అధికారులను కోరారు. ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సూచించారు. పేదరిక నిర్మూలన కోసం అధికారులు పనిచేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే అభివృద్ది అనేలా పనిచేయాలని ఆయన కోరారు. జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని ఆయన విమర్శించారు.

4. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా నియామకం


ఆనంద్ మహీంద్రాను తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఛైర్మన్ గా కొనసాగుతారని సీఎం అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికా న్యూజెర్సీలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. గత వారమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు పలు అంశాల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు అవసరమైన కోర్సులను ఈ యూనివర్శిటీ అందిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 17 రకాల కోర్సులను రూపొందించారు.

5. భధ్రతపై ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్


వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తనకు ఉన్న భద్రతను కొనసాగించాలని జగన్ ఆ పిటిషన్ లో కోరారు. మరమ్మత్తులకు గురైన వాహనాన్ని తనకు కేటాయించారని ఆ పిటిషన్ లో జగన్ చెప్పారు. గత నెలలో పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన సమయంలో ఆయన ఉపయోగించిన వాహనం పాడైందని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. అయితే ఈ వాహనం కండిషన్ లోనే ఉన్న జగన్ స్వంత వాహనంలో పర్యటన చేశారని ప్రభుత్వం ప్రకటించింది.

6. దిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్ధించిన హైకోర్టు


అరవింద్ కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్ట్ చేయడాన్ని దిల్లీ హైకోర్టు సోమవారం సమర్దించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అంతేకాదు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కాంలో ఈ ఏడాది మార్చి 21న ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదే కేసులో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories