ఐనవోలు మల్లన్న...అందుకో మా మొక్కులన్న

ఐనవోలు మల్లన్న...అందుకో మా మొక్కులన్న
x
ఐనవోలు మల్లన్న
Highlights

వరంగల్ జిల్లాలోని ఐనవోలు గ్రామంలో యాదవుల, కురుమల ఇష్టదైవంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన మల్లికార్జున దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రతీ ఏడాది భక్తులు ఎంతో...

వరంగల్ జిల్లాలోని ఐనవోలు గ్రామంలో యాదవుల, కురుమల ఇష్టదైవంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన మల్లికార్జున దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రతీ ఏడాది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జాతరను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్లన్న దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు మకర సంక్రాంతిని పురస్కరించుకుని మల్లికార్జున స్వామికి ఉత్తరాయణ, పుణ్యకాలము, విఘ్నేశ్వర పూజ, పున్యహావాచనపు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వర్చన పూజలు నిర్వహించనున్నారు. అలాగే ప్రభల బండ్లు తిరిగే కార్యక్రమం కన్నుల పండుగగా సాగనుంది.

సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో ఈ జాతర జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నైవేద్యం పెడతారు. తరువాత కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామి కథను చెబుతారు. ఇలా రంగులతో ముగ్గులు వేయడాన్ని పట్నం వేయడం అని అంటారు. దీన్నే స్వామివారి కళ్యాణం అని కూడా పిలుస్తారు. అంతే కాకుండా ఈ ఆలయంలో ప్రతీ మాసశివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.

దాంతో పాటుగానే ఈ ఆలయంలో ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథంపైన భక్తులకు దర్శనమిస్తాడు. ఈ సందర్భంగానే ఉత్సవాల్లో చివరి రోజున సాయంకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ అగ్ని గుండంలో నడిస్తే పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢనమ్మకం. తరువార వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం నిర్వహిస్తారు.

ఆలయ చరిత్ర...

ఈ ఆలయాన్ని ఆరవ విక్రమాదిత్యుని మంత్రి అయ్యనదేవుడు కట్టించాడని చరిత్ర చెపుతుంది. అందువల్లనే ఈ ప్రాంతాన్ని అయ్యన-ప్రోలుగా పిలిచేవారని, కాలనుగుణంగా అది అయినవోలు, ఐనవోలుగా రూపాంతరం చెందదని అంటారు. ఈ ఆలయాన్ని 108 స్తంభాలతో, అష్టభుజాకృతిలో నిర్మించారు. చాళుక్యుల కాలంలో దీన్ని నిర్మించారణడానికి ఆనవాలుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది. దీని ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం నిర్మించారు. ఆలయంలో మల్లన్న (మల్లికార్జున స్వామి) భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో, ఖడ్గం, ఢమరుకం, పాన పాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు రెండువైపులా భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి. వీటి ముందు భాగంలో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, ఖండేల రాయుడు అని కూడా భక్తులు పిలుచుకుంటారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories